Masala Chai Cake । ఎప్పుడైనా తిన్నారా? కొత్తగా ఉంటుంది ట్రై చేయండి!
08 June 2022, 18:14 IST
- ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయం ఏదైనా చాయ్ మనందరికీ ఎనర్జీ ఇచ్చే బూస్టింగ్ డ్రింక్. మంచి మసాలా చాయ్ తాగితే ఎంతో మజాగా ఉంటుంది. అయితే మీరెప్పుడైనా మసాలా కేక్ చాయ్ తిన్నారా? ఇంకా అద్భుతంగా ఉంటుంది. రెసిపీ ఇక్కడ ఉంది చూడండి..
Chai Cake
మసాలా చాయ్ కేక్ వినడానికి కొత్తగా ఉన్నా, సాయంకాలం వేళల్లో వేడివేడి ఛాయ్‌లో ముంచుకుని తింటే ఎంతో సుతిమెత్తగా ఉంటుంది. నేరుగా తిన్నా కూడా చాయ్ బిస్కెట్ కలుపుకొని తిన్నట్లు ఉంటుంది. సాధారణంగా మనకు కేక్ అనగానే ఎన్నో రకాల ఫ్లేవర్స్ తో కూడిన క్రీమ్ కేక్స్ గుర్తుకు వస్తాయి. అయితే ఈ మసాలా చాయ్ కేక్ వాటన్నింటికీ విభిన్నం. మన భారతీయ వంటగదిలో సాధారణంగా లభించే మసాలా దినుసులు, రోస్ట్ చేసిన హాజెల్ నట్స్‌తో కలిపి ఈ కేక్‌ని తయారు చేస్తారు.
మీరు చాయ్ లవర్స్ కాకపోయినా, కేక్ తినడం ఇష్టం లేకపోయినా.. ఈ రెండింటిని కలిపిచేసిన చాయ్ కేక్ ఒకసారి తింటే మళ్లీమళ్లీ తినాలనుకుంటారు. మరి ఇంత బిల్డప్ ఇచ్చిన ఈ కేక్‌ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ దాని రెసిపీని అందజేశాం. వీలైతే మీరు ట్రై చేయండి, బాగుంటుంది.
మసాలా చాయ్ కేక్ కోసం కావాల్సినవి
- 190 ml పాలు (ఫుల్ ఫ్యాట్ క్రీమీ మిల్క్)
- 2 టేబుల్ స్పూన్ల టీ పౌడర్
- 8-10 ఏలకులు (చూర్ణం)
- 4-5 లవంగాలు
- 1 అంగుళం దాల్చిన చెక్క
- 100 గ్రాముల వెన్న
- 30 గ్రాముల కాస్టర్ చక్కెర
- 100 గ్రాముల రోస్ట్ చేసిన హాజెల్ నట్స్
- 130 గ్రాముల ఆల్- పర్పస్ ఫ్లోర్ (మైదా/గోధుమ పిండి)
- 210 గ్రాముల కండెన్స్‌డ్ మిల్క్
- 1 ¼ టీస్పూన్ బేకింగ్ పౌడర్
- ½ టీస్పూన్ బేకింగ్ సోడా
తయారీ విధానం
- ముందుగా చాయ్ చేసుకోవాలి. ఇందుకోసం పాలు, టీ పొడి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మనం సాధారణంగా ఎలా చాయ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. అయితే ఇక్కడ చక్కెర వేయొద్దు, నీళ్లు అస్సలు పోయవద్దు. చాయ్ సిద్ధం అయిన తర్వాత వడకట్టి ఒక పక్కన పెట్టుకోండి.
- తరువాత ఒక గిన్నెలో ఆల్-పర్పస్ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అలాగే రోస్ట్ చేసిన హాజెల్‌నట్ ముక్కలను వేసి బాగా కలపండి, అనంతరం దీనిని కూడా ఒక పక్కన పెట్టండి.
- మరొక గిన్నెలో వెన్న, చక్కెరను కలిపి మెత్తగా వదులుగా అయ్యేంతవరకు కలపండి. ఇందులో కండెన్స్‌డ్ మిల్క్‌ని వేసి గిలకొట్టడం కొనసాగించండి. ఇప్పుడు ఇందులోనే ఇంతకుముందు సిద్ధం చేసుకున్న చాయ్ వేసి బాగా అన్నీ కలిసిపోయేలా కలపండి, చిక్కటి మిశ్రమంలా తయారవుతుంది. ఇప్పుడు ఇందులోనే పైన చేసుకున్న పిండి మిశ్రమం వేసి ఉండలు లేకుండా కలుపుకోండి. పిండిముద్దలా తయారవుతుంది.
- ఇప్పుడు ఈ పిండి ముద్దను ఒక గిన్నె లేదా బేకింగ్ పాన్‌లోకి తీసుకోవాలి. దీనిని 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 50-60 నిమిషాలు బేక్ చేయండి. అనంతరం బయటకు తీసి 30 నిమిషాల పాటు చల్లబరచండి.
ఇప్పుడు బయటకు తీస్తే మసాలా చాయ్ కేక్ రెడీగా ఉన్నట్లే. దీనిని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి, పండగ చేసుకోండి.