Romantic Novels: రొమాంటిక్ నవలలు చదవాలనుందా? తెలుగులో తప్పకుండా చదవాల్సిన పుస్తకాలివే
05 August 2024, 18:40 IST
Romantic Novels: తెలుగులో వచ్చిన ప్రేమ కథా పుస్తకాలు తప్పకుండా చదవాల్సిందే. వాటిలో మంచి అనుభూతినిచ్చే పుస్తకాలేంటో చూడండి.
తెలుగు ప్రేమ కథ పుస్తకాలు
లవ్ స్టోరీలంటే సినిమాల్లోనే చూసి ఆనందిస్తున్నాం ఇప్పుడు. కానీ సినిమా కథల్ని మించిన ప్రేమ కథలు పుస్తకాల రూపంలోనూ వచ్చాయి. అప్పట్లో ఆ పుస్తకాలకున్న ఆదరణ ఊహించలేము. టీవీలు రాకముందు కాలాయాపన అంటే పుస్తకాలతోనే. ఇప్పుడు బ్లాక్ బాస్టర్ సినిమాలు వస్తున్నట్లు.. అప్పట్లో హిట్ పుస్తకాలూ వచ్చేవి. అప్పట్లో ప్రేమ కథ ఆధారంగా వచ్చిన కొన్ని పుస్తకాలున్నాయి. రొమాన్స్, ప్రేమ కలగలిపి రచించిన పుస్తకాలూ కొన్నున్నాయి. అవేంటో చూడండి. ఆసక్తి ఉంటే తప్పకుండా చదవండి.
1. వెన్నెల్లో ఆడపిల్ల:
ఈ పుస్తకాన్ని యండమూరి వీరేంద్రనాథ్ రాశారు. ఇద్దరి వ్యక్తుల మధ్య నడిచే ప్రేమ కథ ఇది. ప్రతి పేజీ చదువుతుంటే మన భావోద్వేగాలు మారుతూ ఉంటాయి. ఒక పేజీలో గుండె ప్రేమతో నిండిపోతుంది. మరో పేజీ కన్నీళ్లు పెట్టిస్తుంది. మరో పేజీలో ఉత్కంఠ రేకెత్తిస్తుంది. కాస్త జ్ఞానాన్నీ పెంచుతుంది. మనతో లెక్కలూ చేయిస్తుంది. ఒక్కోసారీ ఈ పుస్తకంలో ఉన్న పజిళ్లకు సమాధానాల కోసం పిచ్చీ లేస్తుంది. వాటితో కథ మీద ఆసక్తి మరింత పెరుగుతుంది. ఈ పుస్తకం చదివాక మనసు అనేక భావాలతో నిండిపోతుంది. తప్పకుండా చదవాల్సిన ప్రేమ కథా పుస్తకమిది.
2. మైదానం:
ఈ పుస్తకం చలం రచనల్లో ఒకటి. ఈ నవల స్త్రీ స్వేచ్ఛకు సంబంధించింది. ఒక స్త్రీ యొక్క వ్యక్తి గతజీవితం చుట్టూ తిరుగుతుంది కథంతా. స్త్రీ శారీరక సుఖం కోసం పడే తపన, దానికి వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు, సమాజం యొక్క పాత్ర, మొదలైనవన్నీ ఈ నవలలో వివరిస్తారు. ఒక స్త్రీ తన కోరికల్ని, అభిప్రాయాల్ని పాఠకుడితో పంచుకుంటున్నట్లు ఉంటుంది. నవల మొత్తంలో ముఖ్య పాత్రలు మూడు. మొదటిది రాజేశ్వరిది. రెండవది అమీర్. నవల మొత్తం వీరిద్దరే ప్రధాన పాత్రధారులు. మిగిలింది మీర్ అనే పాత్ర.
3. సెక్రటరీ:
ఇది యద్దనపూడి సులోచనారాణి రాసిన పుస్తకం. అందం, ఆత్మాభిమానం ఉన్న జయంతి అనే అమ్మాయి.. డబ్బు, పలుకుబడితో ఆడవాళ్లని ఆకర్షించే రూపమున్న అబ్బాయి రాజశేఖరం.. వీరిద్దరి పరస్పర ఆకర్షణ, ప్రేమ, ద్వేషం, కోపం, పట్టుదలలతో నిండిన ప్రేమకథ “సెక్రటరీ” పుస్తకం. ఒకరిమీద ఒకరికున్న ఇష్టాన్ని వ్యక్తం చేసుకోకుండా ఈ కథనం అలా సాగుతుంది. సులోచనారాణి రచనా తీరుతో ఈ పుస్తకం పూర్తి చేసేదాకా ఊరుకోలేరు.
4. థ్రిల్లర్:
ఈ పుస్తకం కూడా యండమూరి వీరేంద్రనాథ్ రచన. ప్రేమ అంటేనే స్వార్థం కోసం అనుకుంటుందీ ఓ అమ్మాయి. చిన్నప్పటి నుంచి తన చుట్టూ ఉన్న మనుషలు ఆమెలో ఆ అభిప్రాయానికి కారకులు. అప్పుడే ప్రేమలో నిజాయితీ నిరూపించుకోడానికి అనుదీప్ అనే కుర్రాడు ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. ఆమె పొందాలని ప్రయత్నం చేస్తాడు. ప్రేమ, బాధ కలగలిసి ఉత్కంఠ రేకెత్తించే పుస్తకం తప్పకుండా చదవాల్సిందే.
5. ప్రియురాలు పిలిచే:
ఇది కూడా యండమూరి వీరేంద్రనాథ్ రచనే. ముగ్గురి మనుషుల చుట్టూ ఈ పుస్తక రచన కొనసాగుతుంది. వీళ్ల జీవితాల్లో వచ్చే మలుపులతో కథ సాగుతుంది. ఒక వ్యక్తి నుంచి ఏమీ ఆశించని ప్రేమ ఉంటుందా? అలా ప్రేమించడం సాధ్యమా కాదా అనే కథనంతో సాగుతుంది.
టాపిక్