తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation । జీవితంలో ఎదగాలంటే.. భయాన్ని వీడి స్వేచ్ఛగా ఎగరండి, ఆకాశమే మీ హద్దు!

Saturday Motivation । జీవితంలో ఎదగాలంటే.. భయాన్ని వీడి స్వేచ్ఛగా ఎగరండి, ఆకాశమే మీ హద్దు!

HT Telugu Desk HT Telugu

18 March 2023, 4:30 IST

google News
    • Saturday Motivation: మనలో కొందరు మాత్రమే ఉన్నతంగా ఎదుగుతారు, జీవితంలో గొప్పగా స్థిరపడతాడు. ఎవరైనా ఉన్నతంగా ఎదగాలంటే మార్గం ఏమిటి? ఈ స్ఫూర్థిదాయకమైన కథ చదివితే మీకే తెలుస్తుంది.
Saturday Motivation
Saturday Motivation (unsplash)

Saturday Motivation

Saturday Motivation: మనమందరం జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకుంటాము, కానీ కొందరు మాత్రమే గొప్ప స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఏదైనా ఒక స్థితికి చేరుకోవాలనుకుంటే ఉన్నచోటు నుంచి కదలాలి. అవసరమైతే అయినవాళ్లను, పుట్టిన ఊరును వదిలి దూరంగా బ్రతకాలి. కష్టమైనా, నష్టమైనా పట్టుదలతో ముందుకు సాగాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే సాధన చేస్తేనే అది సాధ్యం అవుతుంది.

డబ్బుతో చదువును కొనగలం కానీ, జ్ఞానాన్ని కొనలేం, పరపతితో పనులు చేయించుకోగలం కానీ, పని చేసే సామర్థ్యాన్ని పొందలేం, వారసత్వంతో రాజభోగాలను అనుభవించగలం కానీ, రాజ్యాన్ని నిర్మించలేం. తన కాళ్లపై తాను నడుస్తూ, వేరొకరికి మార్గాన్ని చూపుతూ, తన అడుగుజాడల్లో ఇతరులను నడిపించగలిగే వాడే నాయకుడవుతాడు, లోకాలను ఏలుతాడు. అంతేకాని ఒకరి మీద ఆధారపడ్డ వాడు పడతాడే తప్ప, జీవితంలో పైకి ఎదగడు. ఇదే సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. ఇక్కడొక చిన్న కథ చెప్పుకుందాం..

ఒక రోజు ఒక రాజుకు ఓ వ్యక్తి వచ్చి రెండు గద్ద పిల్లలను బహుమతిగా ఇచ్చారు. ఆ రెండు గద్ద పిల్లలు చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇంతకు ముందు ఎప్పుడూ ఆ రాజు అంతటి అద్భుతమైన గద్దలను చూడలేదు. రాజు వాటిని పెంచుకోవాలని నిర్ణయించుకుంటాడు, వాటి సంరక్షణ కోసం అనుభవజ్ఞుడైన కేర్‌టేకర్‌ని నియమిస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఈ రెండు గద్ద పిల్లలు పెరిగి పెద్దవుతాయి, మరింత అద్భుతమైన పక్షుల్లా అవి తయారవుతాయి.

ఒకరోజు ఆ రాజు తాను పెంచుకుంటున్న గద్దలను చూడటానికి వస్తాడు. అవి పెద్ద పక్షుల్లా పెరగటం చూసి సంతోషిస్తాడు. అవి ఎగిరితే చూడాలని ఆశపడతాడు. కేర్‌టేకర్‌ని వాటిని ఎగిరేలా చేయమని ఆదేశిస్తాడు, దీంతో ఆ కేర్‌టేకర్‌ సంజ్ఞ చేయగా ఆ రెండు గద్దలు ఎగురుతాయి. అందులో ఒక గద్ద ఆకాశాన్ని తాకగా, మరొకటి కొద్దిపాటి ఎత్తుకు మాత్రమే ఎగిరి తిరిగి, తాను ఉన్నచోటుకే వచ్చి కూర్చుంటుంది. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు, రెండు గద్దలు సమానంగా పెరిగాయి, సమానమైన శక్తిని కలిగి ఉన్నాయి. ఒకటి మాత్రమే ఎగురుతుంది, మరొకటి ఎగరటం లేదు, ఎందుకు ఇలా అని కేర్‌టేకర్‌ని రాజు అడుగుతాడు. అందుకు అతడు బదులిస్తూ.. ఇదే ఈ గద్దతో వచ్చిన సమస్య, మొదటి నుంచి ఇంతే, అది ఎక్కడకు వెళ్లదు, ఎంత ఎగరేలా చేసినా, తిరిగి అది ఉన్న కొమ్మపై వచ్చి వాలుతుంది ప్రభు అని చెప్తాడు.

కానీ ఓ రోజు రెండో గద్ద కూడా ఆకాశాన్ని తాకినట్లు రాజు చూస్తాడు. సంతోషంతో ఆ గొప్ప వ్యక్తి ఎవరో సన్మానించాలనుకుంటాడు, అతణ్ని పిలిపించాలని ఆదేశిస్తాడు. అయితే ఆ గద్దను ఎగరేలా చేసింది, ఏ మేధావి కాదు, గొప్ప వ్యక్తి కూడా కాదు, అతడొక మామూలు రైతు.

దీంతో ఆ రాజు ఆత్రుతగా మేధావులకే సాధ్యం కానిది, నీకు ఇదేలా సాధ్యం అయిందని ఆ రైతును అడుగుతాడు. దీనికి ఆ రైతు నేను అంత మేధావిని కాదు, గద్ద ఎగరకుండా అదే కొమ్మపై వాలుతుండటం చూసి, అది కూర్చొనే కొమ్మను నరికేశాను. దీంతో అది అలవాటు పడిన కొమ్మ లేకపోవడంతో అక్కడకు వచ్చి వాలడం మానేసింది. దూరంగా ఎగరటం ప్రారంభించింది అని చెబుతాడు. ఆ రాజు ఆ రైతును సన్మానిస్తాడు. బాగా చదువుకున్న వారు మేధావి కాదు, జ్ఞానం ఉన్నవారు మేధావి అని చెబుతాడు.

ఈ కథతో మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే.. మనం అందరం కూడా ఆ రెండో గద్దలాగా ఒకే చోట ఉండాలనుకుంటాం. మన కంఫర్ట్ జోన్‌లో నుంచి బయటకు రావడానికి ఇష్టపడము. కానీ బయటకు వచ్చినపుడే అంతకు మించిన అవకాశాలు, సౌకర్యాలు ఉంటాయి అని గ్రహించాలి. భయం వీడి మన శక్తి యుక్తులపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలి, అప్పుడే ఉన్నతంగా ఎదగగలం.

తదుపరి వ్యాసం