Rice Cooking Methods । అన్నం రుచికరంగా ఉండాలంటే.. ఈ పద్ధతుల్లో వండి చూడండి!
19 October 2022, 22:05 IST
- Rice Cooking Methods: అన్నం రుచికరంగా రావాలంటే వండే విధానంలో మార్పులు చేసుకోవచ్చు. ఎప్పుడూ తినేలా కాకుండా షాహీ పద్ధతిలో రుచికరంగా అన్నం ఎలా వండాలో ఇక్కడ కొన్ని పద్ధతులు చూడండి.
Rice Cooking Methods
మనం ప్రతిరోజూ ఇష్టంగా తినే ఆహారం ఏదైనా ఉందంటే అది అన్నం మాత్రమే. ఎన్ని రకాల వెరైటీ ఆహారాలు ఉన్నా, అన్నంతో చేసినవే ఎంతో రుచిగా ఉంటాయి. మనం ఒక పూట అన్నం తినకపోతే, దానిని ఉపవాసమే అనవచ్చి. ఖిచ్డీ నుంచి బిర్యానీ వరకు అన్ని రకాలు అన్నంతో కలిపి వండేవే. బియ్యం రకాన్ని బట్టి అన్నం ఫ్లేవర్ మారుతూ ఉంటుంది. బిర్యానీకైతే బాసుమతి, జీరారైస్ వంటి వాటికి చిట్టి ముత్యాలు, ఇవి కాకుండా సాధారణమైన బియ్యంతో వండే తెల్లన్ని అన్నం.
సాధారణంగా మనం తెల్ల అన్నం వండుకొని అందులో పప్పులు, కూరగాయలు కలుపుకొని తింటాం. అయితే మీకు రోజూ ఒకే రకమైన తెల్ల అన్నం తినాలని అనిపించినపుడు అన్నం వండేటపుడు కొన్ని చిట్కాలు పాటిస్తే అన్నానికి మరింత రుచి జోడించవచ్చు. ఈ పద్ధతులతో మీ వండే నైపుణ్యాలను మెరుగు పరుచుకోవచ్చు. అందులో కొన్ని పద్ధతులు ఇక్కడ చూడండి.
అన్నం రుచిని పెంచే పద్ధతులు- Shahi Style Rice Cooking Methods
అన్నం ప్రత్యేక వాసన లేదని అనిపిస్తే కుక్కర్‌లో ఉడికించే ముందు కొద్దిగా నెయ్యి వేయండి. తరవాత జీలకర్ర వేసి, జీలకర్ర చిటపటలాడినప్పుడు, బియ్యం, నీరు వేసి ఉడికించండి. జీలకర్ర రుచి అన్నం రుచిని మారుస్తుంది. ఇది పప్పు లేదా దమ్ ఆలూతో బాగా రుచిగా ఉంటుంది.
అన్నం ఉడికిన తర్వాత అందులో తాజా కొత్తిమీర చల్లండి. ఇది చూడటానికే కాక, తినడానికి కూడా రుచిగా ఉంటుంది.
అన్నం కొద్దిగా కలర్‌ఫుల్‌గా ఉండాలంటే అన్నం వండేటప్పుడు పచ్చి బఠానీలు, మొక్కజొన్న వేయాలి. దీని వల్ల అన్నం రుచి మాత్రమే కాకుండా పోషక విలువలు కూడా పెరుగుతాయి.
సాదా ఉడకబెట్టిన అన్నం లేదా ఏదైనా రకమైన తహరీని తయారుచేసేటప్పుడు, ముందుగా పాన్‌లో నెయ్యి వేయండి, ఆ తర్వాత బిర్యానీ ఆకులను వేసి వేయించి, అందులో అన్నం ఉడికించండి. అది అన్నానికి రాయల్ ఫ్లేవర్ ఇస్తుంది.
నెయ్యి వేడి చేసి, మసాలా దినుసులు వేయించి అందులో నీళ్లు మరిగించి అన్నం వండండి, ఇలా కూడా వేరే రుచి ఉంటుంది.
అన్నం ఘుమఘుమలాడాలంటే కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి. రుచి కూడా భిన్నంగా ఉంటుంది.