తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleep Without Alcohol: మందు చుక్క పడందే.. నిద్ర పట్టట్లేదా?

sleep without alcohol: మందు చుక్క పడందే.. నిద్ర పట్టట్లేదా?

07 May 2023, 20:00 IST

google News
  • sleep without alcohol: ఆల్కహాల్ తాగకపోతే నిద్రపట్టడం లేదా? అయితే మీ జీవనశైలిలో ఎలంటి మార్పులు చేసుకోవాలో కొన్ని చిట్కాలు తెలుసుకోండి. 

ఆల్కహాల్ సేవించడం
ఆల్కహాల్ సేవించడం (pexels)

ఆల్కహాల్ సేవించడం

కుటుంబ బాధ్యతలు, పెళ్లి, ఉద్యోగం, ఆర్థిక నష్టాలు.. ఇలా ఏవేవో కష్టాలు, కారణాల వల్ల నిద్ర పట్టదు. కళ్లు మూసుకుంటే అవే ఆలోచనలు. వాటినుంచి బయటపడటానికి చాలా మంది మందుకు బానిసవుతారు. మందు చుక్క నోట్లో పడందే నిద్ర పట్టకుండా అలవాటుపడిపోతారు. మొదట్లో కష్టాలు మర్చిపోడానికి చేసుకున్న అలవాటు ఇపుడు మానేయాలంటే కష్టమవుతుంది. ఎలాంటి బాధ్యతలు నెత్తిమీద లేకపోయినా ఆర్భాటం, ఆనందాల కోసం ఆల్కహాల్ ను అలవాటు చేసుకుంటారు ఇంకొంతమంది. కానీ ఈ అలవాటు మంచిది కాదు. మానుకోవాలి అనుకుంటే ఈరోజే కొన్ని మార్పులతో మొదలెట్టండి.

అది నిద్ర కాదు:

ఆల్కహాల్ తాగితే నాడీ వ్యవస్థ మొద్దుబారిపోతుంది. దానివల్ల మెదడు చురుగ్గా పనిచేయదు కాబట్టి సులువుగా నిద్రపోతారు. కానీ అది అసలు నిద్ర కానే కాదు. మత్తు మాత్రమే. ఒక మనిషి నిద్రపోయే వ్యవధిలో చాలా ముఖ్యమైన సమయం ఉంటుంది. గాఢ నిద్ర అంటాం దాన్ని. అదే మనకు నిద్రపోయామన్న భావన ఇస్తుంది. కానీ ఆల్కహాల్ తాగి పడుకుంటే అలాంటి నిద్ర దొరకదు. మధ్య మధ్యలో మెలకువ వస్తుంటుంది. ఎంతసేపు పడుకున్నా కూడా ప్రశాంతంగా నిద్రపోయాం, నిద్ర సరిపోయిందన్న భావన రాదు. మెరుగైన నిద్ర దొరకదు.

ఇన్సోమ్నియా:

ఆల్కహాల్ మానేయడం వల్ల మొదట్లో అసలు నిద్ర పట్టకపోవచ్చు. దీన్నే ఇన్సోమ్నియా అంటాం. కానీ ఆ సమస్య కొన్ని రోజులే. చిన్న సమస్య కోసం పెద్ద తప్పు చేయలేం కదా. కొద్ది రోజులయ్యాక క్రమంగా మీరు నిద్రపోయే సమయం పెరుగుతుంది. అవసరమైతే వైద్య సహాయం తీసుకోండి.

వెంటనే అనుకుని ఆల్కహాల్ మానేయడం కష్టమవ్వచ్చు. కానీ కొన్ని నియమాలు పాటిస్తే సులువు. అవేంటంటే..

చామంతి టీ(Chamomile tea):

ప్రతిరోజూ ఆల్కహాల్ తాగడం వల్ల మన శరీరం దానికే అలవాటు పడుతుంది. ఆ సమయంలో ఏదైనా తాగాలనిపిస్తుంది. అందుకే దానికి బదులు చామంతి టీ తాగి చూడండి. ఇది కూడా నిద్ర మత్తు వచ్చేలా చేస్తుంది. నాణ్యమైన నిద్రకు సహకరిస్తుంది. కెఫీన్ ఉన్న పానీయలా జోలికి పోకండి. ఎందుకంటే మళ్లీ అదొక అలవాటుగా మారిపోతుంది.

వేడినీటి స్నానం :

నిద్రకు ముందు వేడి నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి కండరాలు సాంత్వన పొందుతాయి. ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇపుడు కొన్ని నిద్రను పెంచే బాత్ బాంబ్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని స్నానం చేసే నీటిలో వేసుకుంటే నిద్రకు తోడ్పడతాయి.

ఎసెన్షియల్ నూనెలు:

ల్యావెండర్, నీలగిరి, పెప్పర్ మింట్ లాంటి ఎసెన్షియల్ నూనెలను డిఫ్యూజర్ లో వేసుకుని గదిలో పెట్టుకోండి. వాటి వాసన వల్ల, లేదా వాటిని కొబ్బరినూనెతో కలిపి తలకు మర్దనా చేసుకున్నా నిద్ర పడుతుంది.

వ్యాయామం:

రోజు మొత్తం శారీరక శ్రమ చేస్తే, అలిసిపోతే మన శరీరం నిద్ర కోసం ఎదురుచూస్తుంది. అందుకే తప్పకుండా వ్యాయామం అలవాటు చేసుకోండి. అన్ని పనుల్లో చురుగ్గా ఉండండి. నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం వల్ల కూడా త్వరగా నిద్రపడుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం