తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Morning Cycling | ప్రతిరోజూ ఉదయాన్నే సైక్లింగ్ చేయండి, ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు

Morning Cycling | ప్రతిరోజూ ఉదయాన్నే సైక్లింగ్ చేయండి, ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు

HT Telugu Desk HT Telugu

21 August 2022, 5:42 IST

google News
    • ఉదయం వేళ సైక్లింగ్ మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఉత్తేజితం చేసే అద్భుతమైన వ్యాయామం. పొద్దున్నే లేచి వ్యాయామం చేయాలంటే బద్ధకంగా అనిపించే వారు సైక్లింగ్ ఎంచుకోవాలి. ఉదయాన్నే సైక్లింగ్ చేస్తే కలిగి లాభాలు తెలుసుకోండి.
Morning Cycling
Morning Cycling (Pixabay)

Morning Cycling

వేకువజామున లేచి వర్కవుట్‌లు చేయటం వలన శరీరంలో ఎండార్ఫిన్‌ల స్థాయిలు మెరుగుపడుతాయి. మీ మనసుకు మంచి అనుభూతి కలిగించటంలో ఈ హార్మోన్లు సహయపడతాయి. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మీకు శక్తి లభిస్తుంది. తద్వారా మీరు ఉదయం నుంచే ఉత్సాహంగా ఉంటారు. అయితే చాలా మందికి పొద్దున్నే లేచి వర్కవుట్‌లు చేయటం, జాగింగ్ చేయటం, రన్నింగ్ చేయమంటే బద్ధకంగా అనిపిస్తుంది. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని పొద్దున లేవటం సాధ్యంకాదు. లేచి వ్యాయామాలు చేయటం ఆసక్తి కలిగించదు. బదులుగా మీరు సైక్లింగ్ ఎంచుకోవచ్చు. తెల్లవారు జామునే బయట చల్లటి వాతావరణంలో సైకిల్ మీద షికారుకు వెళ్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

సైక్లింగ్ అనేది అన్ని వయసుల వారిపై తేలికగా ప్రభావం చూపే వ్యాయామం. వాకింగ్, రన్నింగ్ చేసేటపుడు మోకాళ్లపై ఒత్తిడి ఉంటుంది, దీంతో త్వరగా అలిసిపోగలరు. అయితే సైక్లింగ్ తో ఇలాంటి సమస్యలేమి ఉండవు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సైక్లింగ్ మీ కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌ను పెంచుతుంది. మీరు జిమ్‌లో నైనా సైక్లింగ్ చేయవచ్చు లేదా కొంతదూరం అవుట్‌డోర్ లో హుషారుగా సైక్లింగ్ చేయవచ్చు. ఉదయం వేళ చేసి సైక్లింగ్ మీ మొత్తం ఆరోగ్యాన్ని, శ్రేయస్సును పెంచుతుంది. అధిక బరువును నియంత్రణలో ఉంచుతుంది. వివిధ భూభాగాలపై సైకిల్ తొక్కుతున్నప్పుడు పొందే ఆడ్రినలిన్ రష్ ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో నిపుణులు వివరించారు, అవి ఇక్కడ తెలుసుకోండి.

బరువు తగ్గవచ్చు

ఈరోజులో చాలా మంది ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారు. ఇలాంటి నిశ్చలమైన జీవనశైలి వలన బరువు పెరగడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. బరువు తగ్గటానికి చేసే వ్యాయామాల్లో సైక్లింగ్ కూడా ఒకటి. ప్రతిరోజూ 45 నుంచి 60 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే సుమారు 300 కేలరీలు బర్న్ చేయవచ్చు. కాబట్టి తక్కువ దూరాలకు నడిచి వెళ్లడం ఉత్తమం. అదేవిధంగా దూరం ఎక్కువైతే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లటానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. పెడలింగ్ సెషన్‌లతో మీ శరీరంలో కొవ్వు కరుగుతుంది. దీంతో మీ బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది మిమ్మల్ని చురుకుగా కూడా ఉంచుతుంది.

కండరాలు మెరుగుపడతాయి

సైక్లింగ్ చేస్తే రెసిస్టెన్స్ పెరుగుతుంది, శరీరంలో కొవ్వు అనేది కరుగుతుంది. దీంతో మీ కండరాలు మెరుగుపడతాయి. సైక్లింగ్ మీ కండర ద్రవ్యరాశిని సంరక్షిస్తుంది. కండరాలను నిర్మిస్తుంది అలాగే దృఢపరుస్తుంది. ఇది కాళ్ల కండరాలను సరైన ఆకృతిలో టోన్ చేస్తుంది. కాళ్లకు బలాన్ని చేకూరుస్తుంది.

డిప్రెషన్, ఆందోళనను తగ్గిస్తుంది

సైకిల్ తొక్కడం వల్ల శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మానసిక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే సైకిల్ తొక్కుకుంటూ బయటకు వెళ్లటం వల ప్రకృతిని ఆస్వాదించగలరు. తద్వారా మీరు పునరుజ్జీవనం పొందుతారు. ఇది మీ డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి అన్నింటిని నయం చేయగలుగుతుంది. మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. పాజిటివ్ ఆలోచనలు కలిగేలా చేస్తుంది. జీవితంపై ఆశాజనకంగా ఉంటారు

మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

సైక్లింగ్ ద్వారా మీ కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ పెరుగుతుంది. ఇలా రోజూ సైక్లింగ్ చేయడం ద్వారా మీరు మీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. రెగ్యులర్ సైక్లింగ్ ద్వారా మీ శ్వాసక్రియ బాగుంటుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తుంది.

వ్యాధుల నుంచి రక్షణ

రెగ్యులర్ సైక్లింగ్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని వివిధ అధ్యయనాలు నిరూపించాయి. మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులను నివారించవచ్చు అలాగే ఇతర జీవనశైలి అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఈ రకంగా అనేక వ్యాధుల నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం