Vankaya Curry: రాయలసీమ స్టైల్లో నూనె వంకాయ కర్రీ వండేయండి, వేడివేడి అన్నంలో రుచిగా ఉంటుంది
27 November 2024, 17:30 IST
- Vankaya Curry: రాయలసీమ స్పెషల్ వంటకాలలో నూనె వంకాయ ఒకటి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి వండుకున్నారంటే మీరు తరచూ తింటారు.
నూనె వంకాయ కూర రెసిపీ
వంకాయల్లో గుత్తి వంకాయ కర్రీ చాలా స్పెషల్. దీనికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. గుత్తి వంకాయలాగే రాయలసీమలో నూనె వంకాయ కూరను వండుతారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇది కొంచెం తమిళనాడు ఫ్లేవర్ ను తెచ్చుకుంటుంది. కాబట్టి రుచి కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. ఈ నూనె వంకాయను కేవలం లేత నీలం రంగు తెలుపు కలగలిసిన వంకాయలతో వండితే రుచిగా ఉంటుంది. అవి దొరకనప్పుడు మీరు ఏ వంకాయతోనైనా వండుకోవచ్చు. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
నూనె వంకాయ రెసిపీకి కావలసిన పదార్థాలు
వంకాయలు - అరకిలో
ధనియాల పొడి - రెండు స్పూన్లు
కారం - రెండు స్పూన్లు
మిరియాలు - అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
కరివేపాకులు - గుప్పెడు
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
నూనె - తగినంత
కొత్తిమీర తరుగు - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
చింతపండు - నిమ్మకాయ సైజులో
ఉల్లిపాయ - రెండు
పచ్చి శనగపప్పు - ఒక స్పూను
టమోటాలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
పచ్చి కొబ్బరి తురుము - అరకప్పు
పసుపు - అర స్పూను
నీళ్లు - సరిపడినన్ని
నూనె వంకాయ కర్రీ రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
2. అందులో ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి.
3. ఆ తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి.
4. టమోటోలను కూడా వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
5. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పచ్చికొబ్బరిని కూడా వేసి వేయించుకోవాలి.
6. ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి తగినంత నీరు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేయాలి.
8. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.
9. గుప్పెడు ఉల్లిపాయ తరుగును కూడా వేసి వేయించాలి.
10. వంకాయలను గుత్తి వంకాయల్లాగా మధ్యలోకి నాలుగు చారలుగా కోసి నూనెలో వేయాలి.
11. పైన మూత పెడితే వంకాయలు మెత్తగా ఉడుకుతాయి.
12. అవి కొంచెం మెత్తగా అయ్యాక కారం, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.
13. చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు పులుసును కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి.
14. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను ఇందులో వేసి ఒకసారి బాగా కలిపి పావుగంటసేపు చిన్నమంట మీద ఉంచాలి.
15. ఇది మొత్తం ఉడికి నూనె పైకి తేలుతుంది. ఆ సమయంలో కొత్తిమీర తరుగును పైన చల్లుకొని మూత పెట్టేయాలి.
16. అంతే నూనె వంకాయ కూర రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. గుత్తి వంకాయతో పోలిస్తే నూనె వంకాయ స్పెషల్ రుచిని కలిగి ఉంటుంది.
రాయలసీమ ప్రజలకు నూనె వంకాయ కర్రీ గురించి తెలిసినదే. అక్కడ ఇది చాలా ఫేమస్ కర్రీ. తమిళనాడులో కూడా నూనె వంకాయ కర్రీని ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో ఈ నూనె వంకాయ ఇగురున వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది. ఒక్కసారి మీరు చేసుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.
టాపిక్