Love Languages: ప్రేమకు ఓ భాష ఉంది..
14 February 2023, 5:04 IST
- Love Languages: ఫిబ్రవరి 14.. ప్రేమికులు ఏడాదంతా ఎదురుచూసే రోజు. మీ ప్రేమను కలకాలం నిలుపుకోవాలంటే ప్రేమ భాష తెలిసి ఉండాలని అంటున్నారు సైకాలజిస్ట్ కృష్ణ. ప్రతి ప్రేమకు భాష ఉంటుందని, భాగస్వామితో ఆ భాషలో సంభాషించగలిగితే ఆ బంధం కలకాలం నిలుస్తుందని చెప్తున్నారు. ఈ ప్రేమ భాష ఏంటో.. తెలుసుకుందామా మరి..!
ప్రేమికుల దినోత్సవాన ఐదు ప్రేమ భాషలు మీకోసం
ఇంగ్లీష్ భాష పై పట్టు ఉంటే ఉద్యోగం వస్తుంది. తెలుగు భాష బాగా తెలిస్తే సాహిత్యంలో పట్టు వస్తుంది. ప్రేమ భాష పై పట్టు ఉంటే వలపు జీవితం, వైవాహిక జీవితం రెండూ బాగుంటాయి. చాలామందికి ప్రేమించడం తెలుసుగాని, ప్రేమను సరైన రీతిలో వ్యక్తం చేయడం ఎలాగో తెలియదు. గుండెల్లో ఉన్న ప్రేమను ఏ భాషలో వ్యక్తీకరిస్తే భాగస్వామి మనసు ఆనంద పడుతుందనే విషయంపై అవగాహన ఉండదు. అందుకే ఎఫ్2 సినిమాలో మాదిరిగా "నువ్వు మారిపోయావు వెంకీ" లాంటి మాటలు వినాల్సి వస్తుంది. కాలం గడిచే కొద్ది బంధం కొద్ది కొద్దిగా బీటలు వారడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రేమ భాష గురించి తెలియాలి.
ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రత్యేకంగా ఐదు భాషలు ఉన్నాయి. ఇవేవో ఆ బాహుబలి సినిమాలో కిలికిరి భాష లాగా అర్థం కాని రీతిలో ఉంటాయని భావించాల్సిన అవసరం లేదు. భాగస్వామి ఏ భాషను ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసుకుని ఆ భాషలో ప్రేమను వ్యక్తీకరిస్తే చాలు. పంచప్రాణాలుగా ప్రేమించడమే కాదు, పంచ భాషలను సమయానుకూలంగా ఉపయోగించగలిగితే బంధం బలంగా పెనవేసుకుంటుంది. ఈ పంచ భాషలు ఏంటి.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
1. ముత్యాల లాంటి మాట..
మనసునిండా ప్రేమిస్తే సరిపోదు, అప్పుడప్పుడు మాటల్లో కూడా చెప్తూ ఉండాలి. ఆ మాటలు కట్టే, కొట్టే , తెచ్చే అన్నట్లు కాకుండా ప్రోత్సాహకరంగా ఉండాలి. ప్రశంసాపూర్వకంగా ఉండాలి. అప్పుడెప్పుడో ఐ లవ్ యు చెప్పాను కదా అంటే కుదరదు, రోజుకోసారైనా చెప్పండి. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావ్ అంటూనో, గుర్తుకొస్తున్నావ్ అంటూనో ఓ మెసేజ్, క్యాంపుకు వెళ్ళేటప్పుడు ఇంట్లో తనకు కనిపించే విధంగా పెట్టి వచ్చే ఒక లవ్ నోట్, తనపై ప్రేమ వ్యక్తం చేస్తూ అనూహ్యంగా ఓ గ్రీటింగ్ కార్డ్.. ఇవి చాలు భాగస్వామిని ప్రేమతో కట్టిపడేయడానికి. మీరు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేయడానికి.
2. అపురూప క్షణాలు..
భాగస్వామికి మీరు ఇచ్చే అతి పెద్ద బహుమతి మీ సమయమే. వారానికి ఓసారైనా ఏకాంత సంభాషణ, భాగస్వామి చెప్పేది శ్రద్ధగా ఆలకించడం, ప్రత్యేకంగా తన కోసమే సమయం కేటాయించడం లాంటివి చేస్తే తన గుండెలో కోట కట్టేసినట్లే. తనతో గడిపే సమయంలో ఫోన్, టీవీలకు దూరంగా ఉండటం, ఆ సమయంలో తనే మీ ప్రపంచం అన్న భావన కలిగించడం ముఖ్యం. మీతో తను గడిపే ప్రతి క్షణాన్ని మధుర జ్ఞాపకంగా అందివ్వగలిగితే అదే తనకు ఆనందం అనే విషయాన్ని మరవద్దు.
3. అందాల బహుమతి..
ప్రేమలో బహుమతి ఇవ్వడం, తీసుకోవడం రెండు మధురానుభవాలే. ప్రేమికుల రోజు, పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటి సందర్భాల్లో మనసుకు నచ్చే విధంగా ఓ బహుమతి ఇస్తే మహదానందం పొందుతారు. గిఫ్ట్ విలువ ఖరీదును బట్టి కాదు, అది ఇచ్చిన సందర్భాన్ని బట్టి ఉంటుంది. వారు ఊహించని సమయంలో మీరు ఇచ్చే చిన్న బహుమతి కూడా పెద్ద ఆనందాన్నిస్తుంది. బహుమతి అంటే డైమండ్ రింగు, నెక్లెస్సో కాదు. చిన్న బొకే కావొచ్చు, ప్రేమపూర్వకంగా పెట్టే ఓ ముద్దు కావొచ్చు. మీరు ఇచ్చే ఏ చిన్న బహుమతి అయినా భాగస్వామికి నువ్వు నాకు ఎంతో ప్రత్యేకం అనే ఫీలింగ్ ఇస్తుంది.
4. బంగారు భాగస్వామ్యం
బంధంలోనే కాదు, వారి పనుల్లో కూడా భాగస్వామ్యం వహిస్తే మీ ప్రేమ వారికి అర్థమవుతుంది. పనుల్లో తలమునకలై ఉన్నప్పుడు సాయం చేయడం, అలసిన సమయాల్లో స్వయంగా కాఫీ పెట్టి ఇవ్వడం, ఆడుతూ పాడుతూ ఇంటి పనులు కలిసి చేసుకోవడం ఒకరికొకరిని మరింత దగ్గర చేస్తాయి. నీకు నేనున్నాననే భావన ఇస్తాయి. తనకు సాయంగా మీరు చేసే చిన్న, చిన్న పనులే పెద్ద ఫలితాన్నిస్తాయని గుర్తుంచుకోండి. ప్రత్యేక సందర్భాల్లో పని భారం ఉంటుంది కాబట్టి పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి.
5. సొగసైన స్పర్శ..
ప్రేమను వ్యక్తం చేయడంలో స్పర్శను మించిన సాధనం లేదు. ప్రేమ పూర్వకమైన ఒక్క స్పర్శ చాలు భాగస్వామి గుండెల్లో గంటలు మోగడానికి. కొన్ని సందర్భాలలో వేయి మాటలు కన్నా ఒక్క స్పర్శ బాగా పనిచేస్తుంది. ఏ బీచ్ కో వెళ్ళినప్పుడు చేతిలో చెయ్యేసి నడవడం, సాయంత్రం వేళ టీ తాగుతూ కూర్చున్నప్పుడు ముందుకు పడిన తన జుట్టును వెనక్కి సర్దడం, ఊహించని సమయంలో వెనుక నుంచి ఒక కౌగలింత, ఇంటి పనుల్లోనూ, ఆఫీసు పనుల్లోనూ అలసి ఉన్నప్పుడు తన కష్టానికి గుర్తింపుగా ఓ చిన్న థాంక్యూ ముద్దు.. ఇవి చాలు వారు మీ ప్రేమ అర్థం చేసుకోవడానికి. అన్నట్టు ఓ విషయం మనిషి సగటున రోజుకి 12 కౌగిలింతలు కోరుకుంటాడంట.. మరి మీరు మీ భాగస్వామిని ఎన్నిసార్లు కౌగిలించుకున్నారో చెక్ చేసుకోండి. 20 సెకన్ల కౌగిలింత శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇవండీ ఐదు ప్రేమ భాషలు.. భాగస్వామి ప్రతి ఒక్కరికి ఒక ప్రైమరీ ఒక సెకండరీ భాష ఉంటుంది. అవేంటో తెలుసుకుని ఆ భాషలో తరచూ వారితో సంభాషిస్తూ ఉంటే మీ బంధం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది.
- బి.కృష్ణ, సైకాలజిస్ట్
అధ్యక్షులు, ఏపీఏ ఇండియా
మొబైల్ నెంబర్: 99854 28261