Vinayaka Chavithi 2024: వినాయకుడి కోసం ఇలా ఇంట్లోనే ధూపం తయారుచేయండి, ఈ ధూపంతో ఇంట్లోని నెగిటివిటీ తొలగిపోతుంది
06 September 2024, 14:00 IST
- Vinayaka Chavithi 2024: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజ సమయంలో ధూపం సమర్పించడం జరుగుతుంది. ఇంట్లో ధూపాన్ని వేయడం వల్ల నెగిటివీ పోతుందనే నమ్మకం ఉంది. ఇంట్లోనే మీరు ధూపాన్ని స్వయంగా తయారుచేసి ధూపం వేయండి. ఎంతో మేలు జరుగుతుంది.
వినాయక చవితి పూజ
దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ గణపతిని తమ ఇంటికి ఆనందంగా తీసుకువచ్చే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్లపక్షం నాల్గవ రోజున జరుగుతుంది. ఈ రోజున భక్తులు గణేషుడి ఆరాధనలో మునిగిపోతారు. పూజ సమయంలో గణపతికి ధూపం సమర్పించి ఇళ్లంతా ఆ ధూపం వ్యాపించేలా చేయడం చాలా ముఖ్యం. అయితే ఆ ధూపాన్ని మీరే ఇంటి దగ్గర తయారుచేసుకుంటే మంచిది.
ధూపం ఎందుకు వేయాలి?
ప్రతి ఇంట్లో ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది. దాన్ని పొగొడితేనే ఆ ఇంట్లోని వారంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. అందుకే గణపతికి దీపధూపాలు సమర్పించడం అనేది ఎంతో ముఖ్యమైన క్రతువుగా మారింది. చాలా చోట్ల వినాయక చవితి రోజున నాలుగు ధూప కుండల్లో ధూపం వెలిగించి గణపతికి ధూపం సమర్పిస్తారు. ఆ ధూపాన్ని కొనేకన్నామీరు ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ ధూపం మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీలతో పోరాడి బయటికి పంపిస్తుంది.
ధూపం తయారీ
ధూపం తయారు చేయడానికి మీకు కొన్ని పదార్థాలు అవసరం. దీనికోసం రెండు మూడు కర్పూరం బిళ్లలు, గుగ్గిలం, చిన్న పిడక ముక్కలు, గంధం పొడి, దేశీ నెయ్యి, నువ్వుల నూనె, ఎండిన పూలు, సాంబ్రాణి పొడి తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఐదారు ఎండిన పువ్వులు, రెండు మూడు కర్పూరం బిళ్లలు, చిన్న ఆవు పేడ ముక్క, గుగ్గిలం, సాంబ్రాణీ మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. ఇప్పుడు పొడిని జల్లెడ సహాయంతో జల్లెడ పట్టండి. ఆ పొడిని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో ఈ మెత్తటి పొడి వేసి దేశీ నెయ్యి, నువ్వుల నూనె, ఒక టీస్పూన్ తేనె వేసి చేత్తోనే పిండిలా కలుపుకోవాలి. అది మీకు నచ్చిన ఆకారంలోకి వచ్చేలా తయారు చేసుకోవాలి. ధూపం స్టిక్స్ లా కూడా తయారుచేయవచ్చు. లేదా చిన్న గిన్నెలాంటి ఆకృతి ఇవ్వండి. రెండు మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. మీరు వాటిని ఫ్యాన్ గాలిలో ఇంటి లోపల కూడా ఆరబెట్టవచ్చు. అంతే గణపతి బప్పా ధూపం రెడీ అయినట్టే. ఈ ధూపం వెలిగించగానే, మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడటం ప్రారంభమవుతుంది.
సాధారణంగా కూడా వారానికి ఒకట్రెండు సార్లు ఇంట్లో ధూపం వేసుకోవాలి. ఇవి మీ ఇంట్లోని చెడు శక్తులను, నెగిటివిటీనికి బయటికి పంపుతాయి. తాజా వాతావరణం, కొత్త ఉత్సాహం ఇంట్లోని వారికి వస్తుంది. కాబట్టి ప్రతి వారం ఇంట్లో ధూపాన్ని వేయడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ దీపం పెట్టే అలవాటు ఉన్నవారికి ఒక ధూప్ స్టిక్ వెలిగించడం అలవాటు చేసుకోండి.