తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Uti Prevention: ఈ తప్పులు చేస్తే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ..

UTI prevention: ఈ తప్పులు చేస్తే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ..

HT Telugu Desk HT Telugu

16 July 2023, 23:18 IST

google News
  • UTI prevention: మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పులేంటో నిపుణులు ఇచ్చిన సలహాలు చూడండి. 

మూత్రనాళ ఇన్ఫెక్షన్ నివారణ జాగ్రత్తలు
మూత్రనాళ ఇన్ఫెక్షన్ నివారణ జాగ్రత్తలు (Freepik)

మూత్రనాళ ఇన్ఫెక్షన్ నివారణ జాగ్రత్తలు

మూత్రనాళ ఇన్ఫెక్షన్ చాలా మందిలో కనిపించే సమస్య. మూత్రనాళంలోకి బ్యాక్టీరియా చేరినప్పుడు ఈ సమస్య కొన్ని లక్షణాలతో మొదలవుతుంది. క్రమంగా అసౌకర్యం పెరుగుతూ ఉంటుంది. వీటికి చికిత్స ఉంటుంది కానీ రాకుండా చూసుకోవడమే చాలా ఉత్తమం. శుభ్రత విషయంలో కొన్ని జాగ్రత్తలు, తగినన్ని నీళ్లు తాగడం, తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం వల్ల ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. అలాగే సెక్స్ తర్వాత సరైన శుభ్రత పాటించడం, కాటన్ లోదుస్తులు వేసుకోవడం వంటివన్నీ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

తగినన్ని నీళ్లు తాగడం:

శరీరానికి అవసరమైనన్ని నీళ్లు తాగడం మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నిరోధించే ఉత్తమ మార్గం. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం మర్చిపోవద్దు. శారీరక వ్యాయామాలు చేసేవాళ్లు, వేడి వాతావరణంలో ఉండేవాళ్లు నీళ్లు మరిన్ని ఎక్కువగా తాగాలి.

వ్యక్తిగత శుభ్రత:

టాయిలెట్లు వాడేటపుడు సరైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. మల విసర్జన చేశాక వెనక నుంచి ముందు వైపుకు కాకుండా, ముందు నుంచి వెనకకు శుభ్రం చేసుకోవాలి. దానిద్వారా బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది.

మూత్రవిసర్జణ:

మూత్రం ఎక్కువ సేపు ఆపుకోకుండా వెళ్తూ ఉండాలి. దీనివల్ల బ్యాక్టీరియా తయారవ్వకుండా ఉంటుంది. ఎక్కువ సేపు మూత్రం వెళ్లకుండా ఉండటం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది.

సెక్స్ తర్వాత:

శృంగారం ముందూ, తరువాత తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. దానివల్ల బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఈ శుభ్రత పాటించడం తప్పనిసరి. మహిళల్లో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

లోదుస్తులు:

కాటన్ తో చేసిన లోదుస్తుల్ని వాడాలి. ఇవి చర్మం పొడిగా ఉండేలా చూస్తాయి. బిగుతుగా ఉండేవి, సింతటిక్ వస్త్రంతో చేసిన లోదుస్తులు అంత మంచివి కాదు. ఇవి తేమగా ఉండి, బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి.

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే చేయకూడని తప్పులు:

సరైన ఉత్పత్తులు వాడటం:

గాఢత ఎక్కువగా ఉన్న సబ్బులు, సువాసనలున్న వాష్ లు శుభ్రం చేసుకోవడానికి వాడకూడదు. ఇవి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెంచుతాయి. ఎలాంటి సుగంధ రసాయనాలు లేని, తక్కువ గాఢత ఉన్న వాటినే శుభ్రత కోసం వాడాలి.

శృంగారం తర్వాత:

లైంగిక సంపర్కం తర్వాత మూత్ర విసర్జన వెళ్లడం వల్ల బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. మూత్రనాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశించకుండా ఉంటుంది. కనీసం అరగంట లోపే మూత్రానికి వెళ్లడం ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

యాంటీ బయాటిక్స్ వాడకం:

మూత్రనాళ ఇన్ఫెక్షన్లు నయం అవ్వడానికి యాంటీ బయాటిక్స్ వాడకం అవసరమే. అయితే వైద్యుల సలహా మేరకు అవసరమైనన్ని రోజులు, సరైన మోతాదులోనే వాడాలి. వైద్య సలహా, ఎలాంటి టెస్టులు చేయించుకోకుండా యాంటీ బయాటిక్స్ వేసుకుంటే ఎలాంటి ఫలితం లేకపోగా, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

టాపిక్

తదుపరి వ్యాసం