Poha cutlet: పోహా కట్లెట్.. అయిదు నిమిషాల్లో సిద్దం..
10 July 2023, 6:30 IST
Poha cutlet: అటుకులు, బంగాళదుంప కలిపి చేసే కట్లెట్ తయారుచేసుకోవడం చాలా సులభం. అదెలాగో చూసేయండి.
పోహా కట్లెట్ (Unsplash)
పోహా కట్లెట్
ఉదయాన్నే అల్పాహారంలోకి పోహాతో చేసిన కట్లెట్లు తింటే కడుపు నిండిపోతుంది. పోహా, బంగాళదుంపతో కలిపి చేసే ఈ కట్లెట్లు బయట క్సిస్పీగా ఉంటాయి. లోపల అన్ని మసాలాలు, కూరగాయల రుచితో పోషకాలు అందిస్తాయి. అయిదే అంటే అయిదే నిమిషాల్లో ఇది తయరీ చేయడం పూర్తయిపోతుంది.
కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల మందం అటుకులు
3 బంగాళదుంపలు
1 కప్పు క్యారట్ తురుము
సగం కప్పు క్యాప్సికం ముక్కలు
1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు
2 పచ్చిమిర్చి సన్నని తరుగు
సగం కప్పు సన్నం రవ్వ
1 చెంచా నూనె
తగినంత ఉప్పు
1 చెంచా కారం
సగం చెంచా ధనియాల పొడి
సగం చెంచా చాట్ మసాలా
సగం చెంచా గరం మసాలా
తయారీ విధానం:
- ఒక గిన్నెలో ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకుని మెదుపుకోవాలి. పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చూసుకోవాలి.
- ఇప్పుడు అటుకుల్ని నీళ్లలో ఒక నిమిషం నానబెట్టుకుని నీళ్ల నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అటుకులతో పాటూ మిగతా పదార్థాలన్నీ కూడా వేసుకుని గట్టిగా కలుపుకోవాలి. నీళ్లు లేకుండానే బంగాళదుంప ముద్దవల్ల పదార్థాలన్నీ బాగా కలిసిపోతాయి.
- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లాగా ఒత్తుకుని కట్ లెట్ ప్యాటీల్లాగా చేసుకోవాలి.
- ఒక పెనం మీద ఒక చెంచా నూనె వేసుకొని అంతటా రాసుకోవాలి. ఇప్పుడు కట్లెట్లు పెనం మీద సర్దుకోవాలి. రంగు మారేదాకా రెండు వైపులా కాల్చుకోవాలి.
- ఈ కట్లెట్లను ఏదైనా చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే రుచిగా ఉంటాయి.