Pesarapappu Halwa:టేస్టీ పెసరపప్పు హల్వా, రోగనిరోధక శక్తిని పెంచే స్వీట్ రెసిపీ ఇది
03 December 2024, 15:30 IST
- Pesarapappu Halwa: పెసరపప్పు మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పెసరపప్పు హల్వాను ఎలా చేయాలో తెలుసుకోండి.
పెసరపప్పు హల్వా
పెసరపప్పుతో చేసే ఆహారాలను చలికాలంలో కచ్చితంగా తినాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలను కలిగి ఉంటుంది. ఒకసారి పెసరపప్పు హల్వాను కూడా ప్రయత్నించండి. నేతితో నిండిన ఈ హల్వా రుచికరంగా ఉండటమే కాదు, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అయితే మనం ఈ హల్వాలో పంచదారను వేస్తాము కాబట్టి మితంగానే తినాలి. డయాబెటిక్ పేషెంట్లు మాత్రం తినకపోవడం మంచిది. పెసరపప్పు హల్వాను ఎలా చేయాలో తెలుసుకోండి.
పెసరపప్పు హల్వా రెసిపీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - ఒక కప్పు
నెయ్యి - ముప్పావు కప్పు
పాలు - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు
యాలకుల పొడి - అర స్పూను
బాదం తరుగు - ఒక స్పూను
పిస్తా తరుగు - ఒక స్పూను
కుంకుమపువ్వు రేకులు - నాలుగు
నీళ్లు - తగినన్ని
పెసరపప్పు హల్వా రెసిపీ
1. పెసరపప్పు హల్వాను చేయడానికి ముందుగా పెసరపప్పును మూడు గంటల పాటు నానబెట్టేయాలి.
2. ఇప్పుడు దాన్ని మిక్సీలో వేసి గట్టిగా వచ్చేలా పిండిలా రుబ్బుకోవాలి.
3. నీళ్లు తక్కువగా వేస్తే ఈ పిండి గట్టిగా వస్తుంది.
4. ఒక గిన్నెలో ఒక టీ స్పూను పాలను వేసి కుంకుమపువ్వు రేకులను వేసి నానబెట్టాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
6. ఆ నెయ్యిలో ఈ పెసరపప్పు పేస్ట్ ను వేసి చిన్న మంట మీద వేయించాలి.
7. నలభై నిమిషాల పాటు మాడిపోకుండా వేయించాలి.
8. అప్పుడు పెసరపప్పు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తుంది.
9. ఇందులో కాచి చల్లార్చిన ఒక కప్పు పాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
10. ఇది మొత్తం దగ్గరగా గట్టిగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి.
11. అందులోనే యాలకుల పొడిని, పంచదారను కూడా వేసి బాగా కలపాలి.
12. పంచదార మొత్తం కరిగి హల్వాలో కలిసి దగ్గరగా అయ్యేవరకు స్టవ్ మీద ఉంచాలి.
13. ఆ తర్వాత బాదం, పిస్తా తరుగులను వేసి కలుపుకోవాలి.
14. పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు రేకులను కూడా ఇందులో వేసి కలపాలి.
15. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
16. టేస్టీ పెసరపప్పు హల్వా రెడీ అయినట్టే.
17. దీన్ని తింటేనే నోరూరిపోతుంది. నెయ్యి ఎక్కువగా వేశాము కాబట్టి ఈ స్వీట్ రెసిపీ ఘుమఘుమలాడిపోతుంది. ఒక్కసారి తిని చూడండి... మీ అందరికీ నచ్చుతుంది. సాయంత్రం వేళల్లో వేడివేడిగా ఈ పెసరపప్పు హల్వా తింటే ఆ మజాయే వేరు.
పెసరపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఈ పప్పును తినాల్సిన అవసరం ఉంది. ఈ పెసరపప్పు హల్వాను అతిథులకు వడ్డిస్తే మీకు మంచి ప్రశంసలు దక్కుతాయి. ఇందులో మనం బాదం, పిస్తా, పాలు, నెయ్యి వంటివి వాడాము. కాబట్టి శరీరానికి శక్తి కూడా అందుతుంది. అయితే చక్కెరను ఒక కప్పు వేశాము అందుకే దీన్ని మితంగా తినాలి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు ఈ స్వీటుకు దూరంగా ఉంటే మంచిది.