Moong dal Soup: శీతాకాలంలో బరువు తగ్గించే పెసరపప్పు సూప్, వేడివేడిగా తాగితే ఎంతో ఆరోగ్యం
Moongdal Soup: పెసరపప్పు సూప్‌ను తరచూ తాగడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. శీతాకాలంలో కచ్చితంగా తినాల్సిన రెసిపీ పెసరపప్పు సూప్.
మూంగ్ దాల్ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా పిల్లలకు తినిపిస్తూ ఉంటారు. చంటి పిల్లలకు దీన్ని తినిపించడం వల్ల పరిపూర్ణ ఆహారాన్ని పెట్టినట్టే అవుతుంది. అయితే శీతాకాలంలో పిల్లలకే కాదు, పెద్దలకు కూడా ఈ సూప్ తినాల్సిన అవసరం ఉంది. దీనిలో మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు నిండుగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి. ఇక బరువు తగ్గాలనుకునే వారికి ఈ సూప్ ఎంతో ముఖ్యమైనది. దీనిలో ప్రోటీన్లు, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. కాబట్టి త్వరగా ఆకలి వేయదు. బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది. పెసరపప్పు సూప్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
పెసరపప్పు సూప్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పెసరపప్పు - నాలుగు స్పూన్లు
క్యారెట్ తరుగు - అరకప్పు
బంగాళదుంప - ఒకటి
నెయ్యి - అర స్పూను
నీరు - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
బఠానీలు - గుప్పెడు
పెసరపప్పు సూప్ రెసిపీ
1. క్యారెట్ ను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
2. అలాగే బంగాళదుంపలు కూడా ఉడికించి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
3. పెసరపప్పును శుభ్రంగా కడగాలి.
4. ఇప్పుడు ఒక కుక్కర్‌లో కూరగాయలు, పెసరపప్పు వేసి సరిపడా నీళ్లు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
5. ఆ తర్వాత విజిల్ తీసేసి ఆ మొత్తం మిశ్రమాన్ని మెత్తగా కలుపుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వెయ్యాలి.
7. ఆ నెయ్యిలో ఈ పెసరపప్పు మిశ్రమాన్ని వేసేయాలి.
8. అందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.
9. ఇది పలుచగా ఉండేలా చూసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి వేడివేడిగా తినాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.
శీతాకాలంలో సాయంత్రం పూట పెసరపప్పు సూప్ తింటే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో ఈ మూంగ్ దాల్ సూప్‌ను ఆరోగ్యానికి మంచిదే. ఆహారం తక్కువగా తింటారు. కాబట్టి బరువు కూడా తగ్గుతారు.
పెసరపప్పును తినడం వల్ల మన శరీరానికి మంచి పోషణ దొరుకుతుంది. దీనిలో ఉండే ప్రోటీన్, విటమిన్ b6, నియాసిన్, ఫోలేట్, ఐరన్, పొటాషియం వంటివన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. పెసరపప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బరువు కూడా త్వరగా తగ్గుతారు. అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. పెసరపప్పులో ఉండే కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి పెసరపప్పును ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
టాపిక్