Surya Namaskar | ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి.. ఆయురాగ్యాలతో వర్ధిల్లండి!
29 May 2022, 12:51 IST
- ఉదయం లేవగానే సూర్యోదయం అవుతున్న సమయంలో సూర్య నమస్కారాలు చేస్తే పరిపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షు లభిస్తుంది. ఇక్కడ ఆచరించాల్సిన కొన్ని సూర్య నమస్కారాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోండి..
surya namaskaram
సూర్యోదయం అవుతున్న సమయాన పరగడుపున (ఖాళీ కడుపుతో) సూర్యనమస్కారాలు చేయడం ద్వారా మనస్సుపై, శరీరంపై ఎన్నో సానుకూల ప్రభావాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే సూర్యనమస్కారాలు చేయడం అలవాటుగా చేసుకుంటే పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది.
సూర్యనమస్కారం యోగాలో ఒక భాగం. ఇందులో శరీరాన్ని విల్లులా వంచి చేతులు జోడించి సూర్యునికి నమస్కరించాలి. ఈ రకమైన తేలికపాటి ఆసనాలు ఆచరిస్తూ సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే రోగాలు దరి చేరవు, బరువు తగ్గించుకోవచ్చు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.
సూర్య నమస్కారాలలో వివిధ రకాలు ఉంటాయి. ఈ ఆసనాలు వేసే ముందుగా కొద్దిగా వార్మప్ చేయాలి. చేతులు, మెడ, కాళ్లను సాగదీయండి. దీంతో మీ శరీరం తేలికగా మారుతుంది. ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన సూర్య నమస్కారాలు అందించాము. సూర్యుడిని నమస్కరిస్తూ ఈ యోగాసనాలను ప్రయత్నించి చూడండి.
ప్రార్థనాసనం
పాదాలు రెండు దగ్గరగా ఉంచి మీ శరీర బరువును రెండు పాదాల మీద సమానంగా ఉంచినట్లు నిర్ధారించుకోండి. ఛాతీని ముందుకు చాచి నిటారుగా నిలబడండి. మీ ఛాతిమీద రెండు చేతులు ఉండేలా నమస్కరించండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులను రెండు పక్కల నుండి ఎత్తి, శ్వాస వదులుతూ రెండు చేతులను కలుపుతూ ఛాతి ముందుకు తీసుకురండి.
హస్త ఉత్తనాసనం
శ్వాస తీసుకుంటూ నమస్కార ముద్రలో రెండు చేతులను పైకి ఎత్తి వెనుకకు తీసుకురండి. ఛాతిని ముందుకు జరపండి. రెండువైపులా భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురండి. ఈ ఆసనంలో మీ మడమలనుండి చేతి వేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగతీయాలి.
హస్తపాదాసనం
శ్వాసను వదిలండి, ముందుగా నిలబడండి ఆ తర్వాత వెన్నుపూసను నిటారుగా ఉంచి నడుమును ముందుకు వంచాలి. శ్వాసను వదులుతూ మీ చేతులతో మీ పాదాలను తాకండి. కొన్ని సెకన్లపాటు ఇలాగే ఉండండి. ఆసనం పూర్తయ్యే వరకు మోకాళ్లు వంచకూడదు, చేతులు కదపకూడదు.
అశ్వ సంచలనాసనం
శ్వాస తీసుకుంటూ కాళ్లపై బరువు ఉండేలా కూర్చోవాలి. పాదాల పక్కన ఇరువైపులా మీ రెండు చేతులు ఉంచాలి. ఇప్పుడు ఎడమకాలును మాత్రమే వెనకకు ఎంత వీలైతే అంత సాగదీయండి. ఇప్పుడు మీ చేతులు కుడిపాదం మూడు ఒకే వరుసలో ఉంటే ఎడమకాలు మాత్రం వెనకకు సాగినట్లు ఉంటుంది. తలపైకెత్తి చూడండి. ఇలా కొన్ని సెకన్లు చేసిన తర్వాత ఎడమకాలును యధాస్థానానికి తీసుకువచ్చి కుడికాలును సాగదీయండి. ఈ ఆసనంలో ఒక పాదం సరిగ్గా భూమికి ఆనించించిన రెండు అర చేతులకు మధ్యలో ఉంటుంది.
చతురంగ దండకాసనం
శ్వాస తీసుకుంటూ రెండు అరచేతులు భూమికి సమానంగా ఆనించి, ఇప్పుడు రెండు కాళ్లను వెనకకు చాచండి. శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకేలా ఉంచండి. పుషప్ చేస్తున్నట్లుగా. భుజాలను నిటారుగా ఉంచండి, వంచకండి. ఈ ఆసనంలో మీ శరీరం బరువు భుజాలపై, కాళ్లపై సమానంగా విస్తరిస్తుంది. కొంత సేపు ఈ ఆసనంలో ఉండండి. ఇది మీ కాళ్లతో పాటు చేతులు, భుజాలను బలపరుస్తుంది.