తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Pulao: పాలకూర పలావ్ ఇలా చేసి చికెన్ కర్రీతో కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది, ఇదిగో రెసిపి

Palak Pulao: పాలకూర పలావ్ ఇలా చేసి చికెన్ కర్రీతో కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది, ఇదిగో రెసిపి

Haritha Chappa HT Telugu

10 March 2024, 11:40 IST

google News
    • Palak Pulao: పాలకూర అనగానే ముఖం ముడుచుకుంటుంది చాలామందికి. నిజానికి పాలకూరతో పలావు చేస్తే గిన్నె మొత్తం చేస్తారు. ఈ రెసిపీ చాలా సులువు.
పాలకూర పలావ్ రెసిపీ
పాలకూర పలావ్ రెసిపీ (Youtube)

పాలకూర పలావ్ రెసిపీ

Palak Pulao: పోషకాల ఆకుకూర పాలకూర. పాలకూరను ప్రతిరోజూ తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ పాలకూరను తినేందుకు ఇష్టపడే వారి సంఖ్య చాలా తక్కువ. పాలకూరతో చేసే వంటకాలు పెద్దగా రుచిగా ఉండవని అనుకుంటారు. నిజానికి పాలకూరతో ఒకసారి పలావ్ చేసి చూడండి. గిన్నె ఊడ్చి మరీ తినేస్తారు. ముఖ్యంగా పాలకూర పలావ్‌లో చికెన్ కర్రీ కలుపుకొని తింటే ఆ రుచి మామూలుగా ఉండదు. ఒక్కసారి ఈ పాలకూర పలావ్ తిని చూడండి. మళ్లీమళ్లీ మీరే చేసుకుంటారు. దీన్ని వండడం చాలా సులువు. పాలకూర పలావ్ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

పాలకూర పలావ్ రెసిపీకి కావలసిన పదార్థాలు

పాలకూర - మూడు కట్టలు

బియ్యం - ఒక కప్పు

టమోటా - ఒకటి

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - మూడు

నూనె - మూడు స్పూన్లు

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు - సరిపడినన్ని

లవంగాలు - రెండు

దాల్చిన చెక్క - చిన్న ముక్క

యాలకులు - రెండు

అనాసపువ్వు - ఒకటి

షాజీరా - అర స్పూను

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

పుదీనా తరుగు - రెండు స్పూన్లు

గరం మసాలా - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

పాలకూర పలావ్ రెసిపీ

1. పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి.

3. నూనెలో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా వంటి మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి.

4. అవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని వేసి వేయించాలి.

5. ఉల్లిపాయల రంగు మారిన తరువాత సన్నగా తరిగిన టమోటా ముక్కలను వేసి కలుపుకోవాలి.

6. కాస్త ఉప్పు చల్లితే టమోటాలు త్వరగా ఉడుకుతాయి. పైన మూత పెట్టి టమోటాలు మెత్తగా అయ్యేవరకు ఐదు నిమిషాలు ఉంచాలి.

7. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి.

8. ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూరను కూడా వేసి బాగా కలపాలి. మూత పెట్టి మధ్యస్థ మంట మీద ఉడికించాలి.

9. పాలకూరల్లో నీరంతా దిగి ఇగిరిపోయేదాకా ఉంచాలి. పాలకూర మిశ్రమం ఇగురులాగా అవుతుంది.

10. అప్పుడు బియ్యాన్ని కడిగి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు వేసి కలుపుకోవాలి.

11. బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి.

12. తర్వాత మూత తీస్తే పాలకూర పలావ్ రెడీ అయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీతో దీన్ని తింటే రుచి మామూలుగా ఉండదు.

పాలకూరని తినడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తం శుద్ధి అవ్వడం వల్ల ఎన్నో రకాల సమస్యలు రాకుండా ఉంటాయి. చర్మ ఎలర్జీలను కూడా అడ్డుకునే శక్తి పాలకూరకు ఉంది. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం వంటివి అధికంగా ఉంటాయి. తరచూ పాలకూర తినే వారిలో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ను అడ్డుకునే శక్తి పాలకూరకి ఉంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకోవడంలోనూ పాలకూర ముందుంటుంది. పిల్లలకు ఇలా పాలకూర పలావు చేసి పెట్టండి. వారు ఇష్టంగా తింటారు.

తదుపరి వ్యాసం