Oats Upma Recipe । ఓట్స్ ఉప్మాతో బ్రేక్‌ఫాస్ట్.. తేలికైనది, ఆరోగ్యకరమైనది!
07 November 2022, 8:37 IST
- తేలికగా అనిపించే ఏదైనా అల్పాహారం చేయాలనుకుంటున్నారా? అయితే ఓట్స్ ఉప్మా సిద్ధం చేసుకోండి. ఇక్కడ Oats Upma Recipe అందిస్తున్నాం. ఇలా తింటే రుచికరం, ఆరోగ్యకరం.
Oats Upma Recipe
వీకెండ్‌లో పార్టీలు, విందులు ఎంజాయ్ చేసి ఉంటారు. రాత్రి తిన్నదే సరిగ్గా జీర్ణం అయి ఉండదు. కానీ ఉదయం అల్పాహారం చేయకుండా ఉంటే అదీ మంచిది కాదు. ఇలాంటి సందర్భంలో ఏది తిన్నా కడుపు ఇంకా కఠినంగా మారుతుంది. కాబట్టి తేలికైన అల్పాహారం తీసుకోవాలి. ఇందుకు ఓట్స్ ఉప్మా మంచి ఛాయిస్ అవుతుంది.
క్యారెట్, పచ్చిబఠానీ వంటి ఆరోగ్యకరమైన వెజిటెబుల్స్ కలుపుకొని ఓట్స్ ఉప్మా వండుకుంటే, అది ఎంతో రుచికరంగా ఉండటం మాత్రమే కాకుండా చాలా ఆరోగ్యకరం కూడా. మరి సులభంగా ఓట్స్ ఉప్మా ఎలా చేసుకోవాలి, కావలసిన పదార్థాలేమిటి తెలుసుకోవాలంటే ఈ కింద ఓట్స్ ఉప్మా రెసిపీ అందించాం, చూడండి.
Oats Upma Recipe- కోసం కావలసినవి
- 1 కప్పు ఇన్‌స్టంట్ ఓట్స్
- 1/2 టీస్పూన్ నూనె
- 1/4 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
- 1/4 కప్పు సన్నగా తరిగిన క్యారెట్లు
- 1/4 కప్పు సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్
- 1/4 కప్పు పచ్చి బఠానీలు
- 7-8 కరివేపాకు
- 1 టీస్పూన్ ఆవాలు
- 1 టీస్పూన్ జీలకర్ర
- 1 టీస్పూన్ శనగపప్పు
- 1 టీస్పూన్ మినపపప్పు (ఐచ్ఛికం)
- 8-జీడిపప్పు లేదా కాల్చిన వేరుశెనగ
- 1/2 టీస్పూన్ అల్లం
- 1 లేదా 2 పచ్చిమిర్చి
- 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
- 1.5 కప్పుల నీరు
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- ఉప్పు అవసరం మేరకు
ఓట్స్ ఉప్మా రెసిపీ- తయారీ విధానం
- ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేడి చేసి 1 కప్పు ఇన్‌స్టంట్ ఓట్స్ వేయించండి. తక్కువ మంటమీద తేలికగా రోస్ట్ చేసి పక్కనపెట్టుకోండి.
- ఇప్పుడు బాణాలిలో మరికొద్దిగా నూనె పోసి ఆవాలు, జీలకర్ర, శనగ పప్పు, మినపపప్పు, జీడిపప్పు వేసి వేయించాలి.
- ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అర నిమిషం పాటు వేయించాలి.
- ఇప్పుడు సన్నగా తరిగిన క్యారెట్లు, సన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ , పచ్చి బఠానీలు వేసి వేయించి, నీరు పోసి మూతపెట్టి ఉడికించాలి.
- ఇప్పుడు ముందుగా వేయించుకున్న ఓట్స్ వేసి, సరిపడా ఉప్పు కలిపి కలుపుతూ, ఆపై మూతపెట్టి ఆవిరి మీద ఉడికించండి.
అంతే ఓట్స్ ఉప్మా రెడీ అయినట్లే పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని, నిమ్మరసం పిండుకొని తింటే అద్భుతంగా ఉంటుంది.
ఓట్స్ ఉప్మా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తింటే రుచికరంగా ఉంటుంది.