Beauty Parlour: బ్యూటీ పార్లర్‌లో ఈ 5 తప్పులు చేయొద్దు, ఇవి మీ చర్మ అందాన్ని పాడు చేస్తాయి
11 October 2024, 10:30 IST
Beauty Parlour: అందం పెంచుకోవడం కోసం మహిళలు బ్యూటీ పార్లర్లకు వెళ్తారు. అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే అందం పెరగకపోగా చర్మ సమస్యలు మొదలవుతాయి. బ్యూటీ పార్లర్ లో మీరు చేయకూడని తప్పులు ఇవే.
బ్యూటీ పార్లర్ లో చేయకూడని తప్పులు
థ్రెడింగ్, ఫేషియల్స్, వ్యాక్స్, హెయిర్ కట్, పెడిక్యూర్స్, మానిక్యూర్స్ లేదా మేకప్ ఇలా ఎన్నింటి కోసమో మహిళలు తరచూ పార్లర్ కు వెళ్తుంటారు. ప్రతి మహిళ తన అందాన్ని మరింత పెంచుకోవాలని పార్లర్ కు వెళ్తుంది.అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అందం పక్కన పెడితే మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి.
పార్లర్ లో తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్లు మీ ఆరోగ్యానికి, చర్మానికి తీవ్ర హాని కలిగిస్తాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్ రానుంది. ఇప్పుడు తప్పకుండా పార్లర్లకు వెళ్లాల్సిందే. అలాంటప్పుడు ఈ తప్పుల గురించి ముందే తెల్సుకుని జాగ్రత్త పడండి.
ఉత్పత్తులు:
99% మంది మహిళలు పార్లర్ లో ఉపయోగించే ఉత్పత్తులను గమనించరు. చాలా మంది మహిళలు చర్మంపై ఏ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారో చూస్తారు కాని దాని గడువు తేదీని తనిఖీ చేయరు. ఈ పొరపాటు మీ చర్మానికి చాలా హానికరం. ఎందుకంటే కొన్ని పార్లర్లలో ఎక్స్పైరీ డేట్ పూర్తయిన వాటినీ వాడతారు. కాబట్టి మీ ముఖానికి, చర్మానికి ఏం రాస్తున్నా సరే ముందు దానిమీద ఉన్న గడువు తేదీ ఏంటో చూడండి.
టవెళ్లు
పార్లర్ లేదా సెలూన్ కు వచ్చే కస్టమర్ ముఖం, చేతులు మొదలైన వాటిని తుడుచుకోవడానికి చాలాసార్లు అందరూ ఒకే టవల్ ను వాడతారు. ఇది సరైన పద్ధతి కాదు. చాలా మందికి దీని మీద అవగాహన ఉంటుంది. కొందరు మాత్రం పట్టించుకోరు. వీలైతే టవెల్ బదులు టిష్యూ పేపర్, పేపర్ టవెళ్లు ఇవ్వమని అడగండి. మీరెళ్లే చోట అలా ఉండకపోతే మీ వెంట మీరే తీసుకెళ్లండి. లేదంటే ఒకరికున్న చర్మ వ్యాధులు మీకూ అంటుకునే ప్రమాదం ఉంది.
మేకప్ బ్రష్
చాలా పార్లర్లలో కస్టమర్స్ అందరి కోసం మేకప్ కోసం ఒకే బ్రష్ ను ఉపయోగిస్తారు. కొన్ని పార్లర్లలో పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని బ్రష్ ను శుభ్రపరిచి మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ కొన్ని పార్లర్లలో మాత్రం ఇవన్నీ సరిగ్గా పట్టించుకోరు. అదే బ్రష్ ను అందరి మేకప్ కోసం ఉపయోగించడం ద్వారా ఎవరి చర్మంలోనైనా సమస్య ఉంటే అది మరొకరి చర్మానికి సోకుతుంది. కాబట్టి మీరు మేకప్ కోసం పార్లర్ కు వెళ్లినప్పుడల్లా ఖచ్చితంగా బ్రష్ ను శుభ్రం చేయమని లేదా మార్చమని అడగండి.
నీరు
మానిక్యూర్, పెడిక్యూర్ కోసం పార్లర్ వెళ్లినప్పుడు అక్కడ నీళ్లు, వాటర్ టబ్ లేదా దానికి ఉపయోగించే ఇతర ఉత్పత్తుల పరిశుభ్రతపై దృష్టి పెట్టరు. దీని వల్ల కలిగే నష్టాన్ని వారి చర్మం భరించాల్సి ఉంటుంది. కాబట్టి పార్లర్ లో మెనిక్యూర్, పెడిక్యూర్ కోసం వెళ్లినప్పుడల్లా దానికి ఉపయోగించే నీరు పూర్తిగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
చేతి శుభ్రత
థ్రెడింగ్ లేదా ఫేషియల్స్ చేసేటప్పుడు అక్కడి బ్యూటీషియన్ మీ చర్మాన్ని తాకాల్సిందే. అయితే దానికి ముందు తప్పకుండా చేతులు కడుక్కోమని అడగండి. మురికి చేతులతో, ఇతరులను తాకిన చేతులతో మిమ్మల్ని తాకితే లేనిపోని సమస్యలు, యాక్నె, మొటిమల్లాంటి సమస్యలు మొదలవుతాయి.