Mutton Masala fry: నోరూరించే మటన్ టిక్కా మసాలా ఫ్రై, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేస్తారు, రెసిపీ ఇదిగో
09 September 2024, 17:30 IST
- Mutton Masala fry: మటన్ కూర, మటన్ ఫ్రై మాత్రమే కాదు. మటన్ టిక్కా మసాలా ఫ్రై వంటి కొత్త వంటకాలు కూడా ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం ఎంతో సులువు. రెసిపీ ఇక్కడ ఇచ్చాము, ఫాలో అయిపోండి.
మటన్ టిక్కా మసాలా వేపుడు
Mutton Masala fry: మీరు మటన్ ప్రియులు అయితే ఇక్కడ మటన్ టిక్కా మసాలా ఫ్రై రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. రెస్టారెంట్లో ఆర్డర్ ఇస్తే ఇది ఎక్కువ ఖరీదు ఉంటుంది. ఇంట్లోనే వండుకుంటే అరకిలో మటన్ తో ఇంటిల్లిపాది తినవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు. ఒక్కసారి చేసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. బిర్యానీతో పక్కన మసాలా మటన్ టిక్కా మసాలా ఫ్రై కూడా ఉంటే ఆ జోడి అదిరిపోతుంది. దీన్ని ఎలా చేయాలో ఒకసారి తెలుసుకోండి.
మటన్ టిక్కా మసాలా ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు
బోన్ లెస్ మటన్ ముక్కలు - అరకిలో
ఉప్పు - రుచికి సరిపడా
బటర్ - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - రెండు
నీరు - సరిపడినన్ని
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
పెరుగు - అర కప్పు
కారం - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
మటన్ మసాలా - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
కసూరి మేతి - ఒక స్పూను
జీలకర్ర పొడి - అర స్పూను
నూనె - ఒక స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
కాశ్మీరీ కారం పొడి - అర స్పూను
మటన్ టిక్కా మసాలా ఫ్రై రెసిపీ
1. మటన్ టిక్కా మసాలా ఫ్రై కోసం ముందుగా బోన్ లెస్ మటన్ ముక్కలను తీసుకోవాలి.
2. అరకిలో మటన్ తీసుకుంటే నలుగురు ఉన్న ఫ్యామిలీకి సరిపోతుంది.
3.మటన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయాలి.
4. ఆ కుక్కర్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, పసుపు, కారం, కాశ్మీరీ కారం, మటన్ మసాలా, ధనియాల పొడి వేసి తగిన నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టాలి.
5. నాలుగు విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. మటన్ మెత్తగా ఉడికేస్తుంది.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూన్ నూనె, ఒక స్పూన్ బటర్ వేయాలి.
7. అందులో కుక్కర్లో ఉడికించుకున్న మటన్ నీటితో సహా వేసేయాలి.
8. చిన్న మంట మీద నీరు తగ్గే వరకు ఉడికించుకోవాలి.
9. నీరు తగ్గుతున్నప్పుడు మిరియాల పొడి, కసూరి మేతి, ఉప్పు సరిపోకపోతే మరి కాస్త ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి.
10. చిన్న మంట మీదే అరగంటసేపు ఉడికించాలి.
11. ఇది దగ్గరగా అవుతున్నప్పుడు పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
12. అంతే టేస్టీ మటన్ టిక్కా మసాలా ఫ్రై రెడీ అయినట్టే. దీన్ని బిర్యానితో జతగా తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఫోర్క్ తో గుచ్చుకొని స్నాక్స్ లా కూడా తినొచ్చు. ఒకసారి తిని చూడండి. దీని రుచి మీకు తెలుస్తుంది.
మటన్ ఇష్టంగా తినేవారు మటన్ టిక్కా మసాలా ఫ్రై కూడా ట్రై చేయండి. దీన్ని చేయడం చాలా సులువు. పేరు విని చాలా మంది కష్టమేమో అనుకుంటారు. నిజానికి మటన్ కూర వండినంత సులువుగా మటన్ టిక్కా మసాలా ఫ్రై కూడా వండవచ్చు. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీన్ని పులావు, బగారా రైస్ తోను, ప్లెయిన్ బిర్యానితోనూ, మటన్ టిక్కా మసాలా జోడి అదిరిపోతుంది.