Monsoon Diseases। వర్షాకాలంలో జబ్బుపడితే అందుకు కారణాలు ఈ రెండే, తెలుసుకోండి!
03 August 2024, 22:39 IST
- Monsoon Diseases: వర్షాకాలంలో ప్రధానంగా దోమలు, ఈగలు, కీటకాలు మొదలైన వెక్టర్‌ల ద్వారా సంక్రమించే వ్యాధులు, అలాగే నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలంగా ఉంటాయి.
Monsoon Diseases
Monsoon Diseases: మాన్‌సూన్ సీజన్‌లో కురిసే ఎడతెగని వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుంది, అధిక తేమతో కూడిన వాతావరణం కారణంగా దోమల వృద్ధికి అవకాశం ఏర్పడుతుంది, ఈ దోమలు అనేక వైరల్ ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. మరోవైపు వర్షాకాలంలో నీరు కూడా కలిషితం అవుతుంది. దీంతో కలుషితమైన నీరు తాగడం ద్వారా టైఫాయిడ్, కలరా, లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధులు వస్తాయి.
ఈ ప్రకారంగా, వర్షాకాలంలో ప్రధానంగా దోమలు, ఈగలు, కీటకాలు మొదలైన వెక్టర్‌ల ద్వారా సంక్రమించే వ్యాధులు, అలాగే నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ప్రబలంగా ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఈ సీజన్‌లో జబ్బు పడినట్లయితే అది వెక్టర్‌ల ద్వారా కలిగిన అనారోగ్యమా, లేక నీటి ద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యనా? అనేది తెలుసుకోవడం ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. లక్షణాలలో వ్యత్యాసం తెలిసినపుడు చికిత్స సులభం అవుతుంది, వేగంగా కోలుకోవచ్చని చెబుతున్నారు.
నవీ ముంబయిలోని అపోలో హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ వైశాలి లోఖండే, మాన్‌సూన్ సీజన్‌లో సాధారణంగా సంక్రమించే వ్యాధుల లక్షణాలు, సంకేతాల గురించి వివరించారు.
వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు
దోమలు, ఈగలు, ఇతర కీటకాల ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా వ్యాధులకు కారణమయ్యే పరాన్నజీవులను మోసుకొస్తాయి. దోమ కుట్టినపుడు లేదా కీటకం కాటు వలన ఈ పరాన్న జీవులు మన శరీరంలోకి చేరతాయి. అప్పుడు మలేరియా, డెంగ్యూ జ్వరం, జికా వైరస్, లైమ్ వ్యాధి, చికున్‌గున్యా వంటివి అనారోగ్యాలను కలిగిస్తాయి. ఇవి వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులకు ఉదాహరణలు.
వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధుల లక్షణాలు
- నిర్దిష్ట వ్యాధిని బట్టి లక్షణాలు మారవచ్చు, కానీ కొన్ని సాధారణ లక్షణాలు మాత్రం ఒకేలా ఉంటాయి:
- జ్వరం వస్తుంది, అనేక వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులు అధిక జ్వరంను కలిగిస్తాయి.
- శరీర నొప్పులు, కీళ్ల నొప్పులు ఉంటాయి. కండరాలు, కీళ్లలో నొప్పి తరచుగా గమనించవచ్చు.
- చర్మపు దద్దుర్లు కనిపిస్తాయి, ఇతర చర్మ సమస్యలకు కారణం కావచ్చు.
- తలనొప్పి ఉంటుంది. తరచుగా వచ్చే తలనొప్పి ఒక సాధారణ లక్షణం.
- అలసట లేదా బలహీనమైన అనుభూతి కలుగుతుంది, శోషరస కణుపులు ఉండవచ్చు.
- కొన్ని సందర్భాల్లో జీర్ణశయాంతర లక్షణాలు సంభవించవచ్చు. అంటే వికారం,వాంతులు ఉండవచ్చు.
- కొన్ని సందర్భాల్లో, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి శ్వాసకోశ లక్షణాలు ఉండవచ్చు.
నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు
బ్యాక్టీరియా, వైరస్‌లు లేదా పరాన్నజీవులు వంటి వ్యాధికారక సూక్ష్మజీవుల ద్వారా కలుషితమైన నీటిని తాగడం లేదా ఆ నీటిలో ఆడటం వంటివి చేయడం వల్ల నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు వస్తాయి. ఈ కలుషితాలు త్రాగునీరు, కలుషితమైన నీటిలో ఈత కొట్టడం లేదా కలుషితమైన నీటితో కడిగిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. కలరా, టైఫాయిడ్ జ్వరం, గియార్డియాసిస్, హెపటైటిస్ A. మొదలైనవి నీటి ద్వారా వచ్చే వ్యాధులకు ఉదాహరణలు.
సంకేతాలు, లక్షణాలు
- నీటి ద్వారా సంక్రమించే హెపటైటిస్ కేసులలో, కొద్దికాలం పాటు జ్వరం, అనారోగ్యం, ఒళ్లు నొప్పులతో పాటు చర్మం, కళ్ళు, మూత్రం పసుపు రంగులోకి మారడం, వికారం, వాంతులు, ఆకలిని కోల్పోవడం వంటివి ఉండవచ్చు. అయితే, టైఫాయిడ్‌లో జ్వరం, తలనొప్పి, బలహీనత మాత్రమే లక్షణాలు కనిపిస్తాయి.
- నిర్దిష్ట వ్యాధిని బట్టి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల సంకేతాలు, లక్షణాలు మారవచ్చు, కానీ కొన్ని సాధారణ లక్షణాలను బట్టి అది కలుషిత నీరు వలన కలిగిన అనారోగ్యంగా నిర్ధారించవచ్చు.
- నీటి ద్వారా వచ్చే వ్యాధులు సాధారణంగా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి, ఇది అతిసారం, కడుపు నొప్పి, తిమ్మిరి, వికారం వంటి లక్షణాలకు దారితీస్తుంది. కొన్నిసార్లు వాంతులు, విరేచనాలు కూడా కలిగిస్తాయి.