Monsoon Fruits for Diabetics। మాన్‌సూన్‌లో లభించే ఈ పండ్లను.. మధుమేహం ఉన్నవారు కూడా తినొచ్చు!
13 July 2023, 12:04 IST
- Diabetic friendly fruits: మధుమేహం ఉన్నవారు, అలాగే అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఈ వర్షాకాలంలో తినడానికి కొన్ని ఆరోగ్యకరమైన, పోషకభరితమైన పండ్లు ఉన్నాయి. వారు ఈ పండ్లు తినడం సురక్షితం
Diabetic friendly fruits
Diabetic friendly fruits: మాన్‌సూన్ రాకతో మళ్లీ పచ్చదనం నిండుగా చిగురించింది. చెట్లన్నీ పువ్వులు, పండ్లతో విరబూస్తున్నాయి. అయినప్పటికీ మనకు ఏడాది పొడుగునా అనేక రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. ఏ సీజన్‌లో లభించే పండ్లను ఆ సీజన్‌లో తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతారు. అయితే మధుమేహం ఉన్నవారికి మాత్రం కొన్ని మినహాయింపులు ఉంటాయి.
మధుమేహం, ఊబకాయం మొదలైన జీవక్రియ సమస్యలు కలిగిన వారు పండ్లు తినకూడదని మనం వినడం చాలా సాధారణం. ఎందుకంటే పండ్లలో కార్బోహైడ్రేట్లు, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి, ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను మరింత పెంచడానికి కారణమవుతాయి. పండ్లలోని అధిక కేలరీల కారణంగా బరువు పెరిగే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇలా రెండు రకాలుగా వారి ఆరోగ్యానికి పండ్లు చేటు చేయవచ్చు. పండ్లు ఆరోగ్యకరమైన ఆహారమే అయినా కూడా మధుమేహులు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అన్ని పండ్లు కావు, కొన్ని పండ్లు తినడం ద్వారా మధుమేహం ఉన్నవారికి కూడా మేలు జరుగుతుంది.
మధుమేహం ఉన్నవారు, అలాగే అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఈ వర్షాకాలంలో తినడానికి కొన్ని ఆరోగ్యకరమైన, పోషకభరితమైన పండ్లు ఉన్నాయి. వారు ఈ పండ్లు తినడం సురక్షితం, మితంగా తీసుకోవచ్చు.
నేరేడు పండు
నేరేడు పండ్లు (jamun) వేసవిలో విరివిగా లభిస్తాయి, వర్షాకాలంలో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా, నేరేడుపండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సురక్షితమైనది, ప్రయోజనకరమైనది.
మోసంబీలు
మోసంబీలు (Sweet lime) ఎంతో రుచికరమైనవి, ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మితమైన గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్ , ఫ్లేవనాయిడ్ కంటెంట్ కారణంగా, మోసంబి పండ్లు మధుమేహులకు, బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతమైనవి. బరువు వర్షాకాలంలో ఇవి మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
అలు బుఖారా
అలూ బుఖారా (plum) కొంచెం తీపి, కొంచెం పులుపు కలగలిసిన రుచిలో ఉండే జ్యూసీ రకమైన పండ్లు. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా 35 విలువతో, గ్లైసెమిక్ లోడ్ 3.9గా ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి, బరువు తగ్గాలనుకునే వారికి ఈ రుచికరమైన పండ్లను సంతృప్తిగా తినవచ్చు. వర్షాకాలంలో పుష్కలంగా అలు బుఖారా పండ్లు లభిస్తాయి.
బేరి పండు
బేరి పండు (pears) లేదా నష్పతి, అధిక ఫైబర్ కలిగిన పండు. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోడానికి, బరువు తగ్గడానికి ఇది అద్భుతమైనది. బేరిపండు మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ (38), తక్కువ గ్లైసెమిక్ లోడ్ ను కలిగి ఉంటుంది. వర్షాకాలంలో ఈ పండును హాయిగా తినవచ్చు.
పీచెస్
పీచెస్ అనేది వర్షాకాలానికి ప్రత్యేకమైన పండు. మంచి రుచి, సువాసనగల ఈ పండు మధుమేహులు తినడానికి అనుకూలమైనది, సురక్షితమైనది. మితమైన గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఐరన్, పొటాషియం, విటమిన్ సి మొదలైన పోషకాలు అధికంగా ఉంటాయి.
చెర్రీస్
తాజాగా కోసుకొచ్చిన లభించే చెర్రీ పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరం ఎందుకంటే వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (సుమారు 20) ఉంటుంది. చెర్రీస్ వర్షాకాలం సీజన్ మొత్తంగా విస్తృతంగా అందుబాటులో ఉంటుంది.