Gut Health in Monsoon | వర్షాకాలంలో జీర్ణ సమస్యలు రాకుండా ఈ చిట్కాలు పాటించండి!
13 July 2023, 14:40 IST
- Gut Health in Monsoon: వర్షాకాలంలో మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు తీసుకోవాలి. మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Gut Health in Monsoon
Gut Health in Monsoon: వర్షాకాలంలో చాలా మందికి వేడివేడిగా, రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ కు ఎక్కువ టెంప్ట్ అవుతారు. నూనెలో వేయించిన పకోడిలు, సమోసాలు తినడానికి ఇష్టపడతారు. కానీ, ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, జీర్ణసమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉంటుంది. అదనంగా ఈ సీజన్ లో నీటి ద్వారా, వాతావరణ మార్పుల ద్వారా, దోమల ద్వారా అనేక సీజనల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో జబ్బు పడకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.
వర్షాకాలంలో మీరు తీసుకునే ఆహారాలే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అపరిశుద్ధమైన ఆహారాలు తినడం ద్వారా కడుపులో ఇన్‌ఫెక్షన్, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు కలుగుతాయి తద్వారా మీ పేగు ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, మీ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాలు తీసుకోవాలి. మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తినండి
వర్షాకాలంలో వ్యాధులను నివారించటానికి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మీ ఆహారంలో పసుపు, వెల్లుల్లి, అల్లం వంటి సుగంధ ద్రవ్యాలతో వండుకోండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జీర్ణ ఆమ్లంను సమతుల్యంగా ఉంచుకోండి
ఆహారం తిన్నప్పుడు జీర్ణాశయంలో ఆ ఆహారాన్ని జీర్ణం చేసే జీర్ణ ఆమ్లం విడుదలవుతుంది. ఈ గ్యాట్రిక్ యాసిడ్ ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా సమతుల్య స్థాయిలో ఉంచుకోవాలి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారిలో కడుపులో జీర్ణ ఆమ్లం తక్కువగా ఉంటుంది. అల్లం, యాపిల్ సిడర్ వెనెగర్ వంటివి గ్యాస్ట్రిక్ జ్యూస్ పెంచుతాయి. నెమ్మదిగా నములుతూ తినడం, అతిగా తినకపోవడం ఇతర చర్యల ద్వారా ఆసిడిటీ వంటి సమస్యలను నివారించవచ్చు.
సీజనల్ ఆహారాలు తీసుకోండి
కాలానుగుణంగా లభించే పండ్లు, కూరగాయలను తినడం ద్వారా మీ జీర్ణ ఆరోగ్యాన్ని తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నేరేడు, చెర్రీ, బేరీ, దానిమ్మ వంటి పండ్లు అలాగే కూరగాయలలో కాకరకాయ, సోరకాయ, బీరకాయ, టమోటా వంటి కూరగాయలను తినాలి. వీటిలోని పోషకాలు మీ రోగనిధకశక్తిని పెంచుతాయి. పేగు ఆరోగ్యానికి మంచిది.
హైడ్రేటెడ్ గా ఉండండి
వర్షాకాలంలో దాహం ఎక్కువ వేయదు, అయినప్పటికీ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు, ఆరోగ్యకరమైన ద్రవాలు తీసుకోండి, సరిపడా నీరు తాగితే అది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, శరీరంలోని టాక్సిన్స్‌ని కూడా బయటకి పంపడానికి సహాయపడుతుంది.
వేయించిన ఆహారాలను తగ్గించండి
వర్షాకాలంలో మీ పొట్టను భారంగా మార్చే వేయించిన ఆహార పదార్ధాలను తగ్గించండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్ నివారించండి. ఇవి జీర్ణ సమస్యలను కలిగించడంతో పాటు మీ ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి.
శారీరక శ్రమ చేయండి
జీర్ణక్రియను మెరుగుపరచడానికి మీకు కొంత శారీరక శ్రమ కూడా అవసరం. కాబట్టి వ్యాయామాలు చేయండి. మీరు ఇంట్లో కూడా చేయగలిగే అనేక ఇండోర్ వ్యాయామాలు ఉన్నాయి. దీనితో పాటు ఒత్తిడి నివారించండి. ఒత్తిడి కూడా మీకు మలబద్దకం వంటి సమస్యలకు కారణం అవుతుంది.