Monkeypox । మంకీపాక్స్ లైంగికంగా సంక్రమిస్తుందా? లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే!
25 July 2022, 13:25 IST
- మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది. ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా నివారించవచ్చు. మొదలైన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోండి.
Monkeypox
కరోనా మహమ్మారి ఇంకా ముగియనేలేదు, మంకీపాక్స్ పేరుతో మరో కొత్తరకం వ్యాధి ఇప్పుడు జనాలను హడలెత్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు ఈ వ్యాధి విస్తరించింది. అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను 'గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ' గా ప్రకటించింది. భారతదేశంలోనూ 4 కేసులు నమోదయ్యాయి, తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురికి లక్షణాలు కనిపించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి.
అయితే ఈ వ్యాధి గురించి మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇదేమి కొత్తరకం వ్యాధికాదు. 1970లో ఒకసారి, 2013లోనూ ఆ తర్వాత ఈ తరహా లక్షణాలు ఉన్న కేసులు వెలుగులోకి వచ్చాయి. వైద్యుల పర్యవేక్షణలో వ్యాధి లక్షణాలను నయం చేసుకోవచ్చు. ముందుగా ఈ వ్యాధి ఎలా సోకుతుంది? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎలా నివారించవచ్చు మొదలైన అంశాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యం.
మంకీపాక్స్ ఇంకొకరికి వ్యాప్తి ఇలా
- మంకీపాక్స్ అనేది ఒక వైరల్ జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్ ఇన్ఫెక్షన్. మశూచి రోగులలో కనిపించేటువంటి లక్షణాలు కనిపిస్తాయి.
- మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తి లేదా జంతువు ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది.
- వైరస్ ద్వారా కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.
- వైరస్ సోకిన వ్యక్తి శరీర ద్రవాలు, ముక్కు, నోటి నుంచి వచ్చే ద్రవాలు, తుంపరలు గాయాల ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించినపుడు. అలాగే వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన పరుపు, దుస్తులు ఉపయోగించినపుడు మంకీపాక్స్ బారిన పడవచ్చు.
మంకీపాక్స్ లైంగికంగా సంక్రమిస్తుందా?
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు.. 95 శాతం మంకీపాక్స్ కేసులు లైంగిక కార్యకలాపాల ద్వారా సంక్రమించాయని, వైరస్ సోకిన వారిలో 98 శాతం మంది స్వలింగ సంపర్కులు ఉన్నట్లు తేలింది. వారి నుంచి ఇతరులకు వ్యాప్తి జరిగింది. ముఖ్యంగా మగవారితో మగవారే లైంగిక సంపర్కంలో పాల్గొనడం, ఇలా ఎక్కువ మందితో అసహజ లైంగిక సంపర్కం పాల్గొనడం ద్వారా మంకీపాక్స్ వైరస్ సోకిందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు.
మంకీపాక్స్ అంటువ్యాధినా? ప్రారంభ లక్షణాలు
WHO ప్రకారం మంకీపాక్స్ అనేది మశూచి వంటి లక్షణాలను కనబరుస్తుంది కానీ, ఇది అంటువ్యాధి కాదు, అలాగే తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగించదు.
ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీరంలో వైరస్ చేరితే వైరస్ పొదిగే కాలం లేదా సంక్రమణ జరిగిన తర్వాత సుమారు 6 నుంచి 13 రోజులలో లక్షణాలు బయటపడతాయి. ఈ వ్యవధి కొన్నిసార్లు 5 మరియు 21 రోజుల మధ్య ఉంటుంది.
వైరస్ సోకిన వ్యక్తికి జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి, మైయాల్జియా (కండరాల నొప్పులు), తీవ్రమైన అస్తెనియా (శక్తి లేకపోవడం), లెంఫాడెనోపతి లేదా శోషరస కణుపుల వాపును అనుభవించవచ్చు. ఈ లక్షణాలు ఐదు రోజుల వరకు ఉండవచ్చు.
సాధారణంగా జ్వరం కనిపించిన ఒకటి నుండి మూడు రోజుల తర్వాత చర్మం విస్ఫోటనం జరిగి దద్దుర్లు ఏర్పడతాయి.
నివారణ, ముందుజాగ్రత్తలు
-వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. లక్షణాలు ఉన్నవారితో సన్నిహితంగా ఉండకూడదు.
-సరిగ్గా ఉడికని మాంసం, ఇతర జంతు ఉత్పత్తులను తినడం మానుకోవాలి.
-వైరస్ సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధంలో ఉండకుండా ఉండండి.
-వైరస్ సోకిన వారితో భౌతిక దూరం పాటించాలి.
- వైరస్‌తో కలుషితమయ్యే సోకిన వ్యక్తి యొక్క పరుపు, ఇతర వస్తువులను ఉపయోగించవద్దు. పైన పేర్కొన్న కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.
పరిశుభ్రమైన అలవాట్లు కలిగి ఉండటం, ఆరోగ్యకరమైన పోషకాహారం తీసుకోవడం, ఇమ్యూనిటీ పెంచుకోవడం చేస్తే మంకీపాక్స్ వ్యాప్తిని నిరోధించవచ్చు.