Monkeypox: మంకీపాక్స్ పై వైద్యారోగ్య శాఖ అలర్ట్… మార్గదర్శకాలు ఇవే
16 July 2022, 12:01 IST
- monkeypox cases: మంకీపాక్స్ వ్యాధిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించిన శుక్రవారం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. రెండ్రోజుల్లో గాంధీ ఆస్పత్రితో నిర్ధారణ పరీక్షలు మొదలుకానున్నాయి.
మంకీపాక్స్‌పై టీ సర్కార్ అప్రమత్తత
telangana govt alert on monkeypox cases: దేశంలోకి మంకీపాక్స్ కేసు నమోదు కావటంతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది.వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు పంపారు.
మార్గదర్శకాల్లో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా వ్యాధి లక్షణాలను వివరించారు. శరీరంపై దద్దుర్లు రావడం మంకీపాక్స్ ప్రధాన లక్షణమని పేర్కొన్నారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, చలి వంటి తదితర లక్షణాలున్న వారి నుంచి నమూనాలను సేకరించాల్సి ఉంటుందని వెల్లడించారు. మంకీపాక్స్ అనుమానిత నమూనాలను పరీక్షించడానికి దేశం మొత్తమ్మీద 15 ప్రయోగశాలలకు అనుమతివ్వగా.. రాష్ట్రంలో గాంధీలోని ప్రయోగశాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మరో రెండు రోజుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించున్నారు.
మంకీపాక్స్‌పై ఏవైనా అనుమానాలుంటే 90302 27324 నంబరుకు వాట్సప్ ద్వారా సమాచారాన్ని పంపించవచ్చు. నేరుగా కాల్ చేయాలనుకుంటే 040 24651119 నంబరుకు ఫోన్ చేయాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.
కేంద్రం గెడ్ లైన్స్…
Monkeypox guidelines | మంకీపాక్స్ సోకకుండా ఉండాలంటే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం పౌరులకు సూచించింది. చనిపోయిన జంతువులకు, ఆడవి జంతువులకు దూరంగా ఉండాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
అంటువ్యాధుల లక్షణాలతో అస్వస్థతకు లోనైన వ్యక్తులకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని, వారికి దగ్గరగా ఉండాల్సిన సందర్భంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులను, వారు ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలుంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. అలాగే, మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తులకు దగ్గరగా మసిలినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచించింది.
తొలి కేసు…
భారతదేశంలో తొలి monkeypox కేసును కేరళలోని కొల్లాంలో గుర్తించిన విషయం తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్లు గురువారం నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, కేంద్ర ఆరోగ్య శాఖ నిపుణులైన వైద్యుల బృందాన్ని కేరళకు పంపించింది. వారు రాష్ట్ర ఆరోగ్య అధికారులతో సమన్వయంతో మంకీపాక్స్ వ్యాప్తిని నిరోధించే చర్యలు చేపట్టనున్నారు. భయపడాల్సిన అవసరం లేదని, మంకీపాక్స్‌ను నిరోధించే చర్యలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలను పంపించామని అధికారులు తెలిపారు.