Monkeypox | గుడ్ న్యూస్.. మంకీపాక్స్ వ్యాప్తి ముప్పు చాలా తక్కువే!
23 May 2022, 21:54 IST
- Monkeypox virus | మంకీపాక్స్ వ్యాధిపై వైద్య నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి తక్కువగానే ఉంటుందని పేర్కొన్నారు
మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి తక్కువే!
Monkeypox virus | అమెరికా, యూరోప్‌లో మంకీపాక్స్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్న వేళ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కీలక వ్యాఖ్యలు చేసింది. సాధారణ జనాభాలో మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి చాలా తక్కువగానే ఉంటుందని పేర్కొంది. కేంద్ర- పశ్చిమ ఆఫ్రిక దేశాల బయట.. ఈ వ్యాధి వ్యాప్తిని సులభంగా అడ్డుకోవచ్చని స్పష్టం చేసింది.
మంకీపాక్స్ అనేది కొత్త విషయమేమీ కాదు. 40ఏళ్ల నుంచి ఈ వ్యాధి ఆఫ్రికా దేశాల్లో ఉంది. కాగా.. ఇటీవలే అమెరికా, యూరోప్‌లో దాదాపు 200కుపైగా కేసులు ఒక్కసారిగా వెలుగుచూడటం ఆందోళకరంగా మారింది. పైగా.. రోగుల్లో చాలా మందికి అసలు ఆఫ్రికాకు వెళ్లకుండానే వ్యాధి అంటుకుంది. ఇది మరో 'కొవిడ్' సంక్షోభానికి దారితీస్తుందా? అన్న అనుమానాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో.. డబ్ల్యూహెచ్ఓ వ్యాఖ్యలు ప్రపంచానికి కాస్త ఉపశమనాన్ని కలిగించాయి.
యూరోపియన్ కమిషన్‌కు చెందిన ఈసీడీసీ(యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్) సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. అధిక జనాభాను పరిగణలోకి తీసుకుంటే.. మంకీపాక్స్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాప్తి కూడా తక్కువగానే ఉంటుందని వివరించింది.
కాగా.. మరికొన్ని రోజుల పాటు కేసులు పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ, ఈసీడీసీలు అభిప్రాయపడ్డాయి. చిన్నారులు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిపై వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఈసీడీసీ పేర్కొంది. కాగా ఈ వ్యాధితో మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు వివరించింది.
Monkey pox symptoms | మంకీపాక్స్‌కు వాస్తవానికి మందులు ఉన్నాయి కానీ సరైన చికిత్స లేదు. మంకీపాక్స్ లక్షణాలు రెండువారాల్లో వాతంటత అవే పోతాయి. జ్వరం, ఖండరాల నొప్పులు, నీరసం, చర్మంపై చికెన్ పాక్స్ వంటి రాషేస్.. ఈ వ్యాధి లక్షణాలు. రోగి తుంపర్ల నుంచి వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. శృంగారం నుంచి కూడా వ్యాధి వ్యాపిస్తుందని వైద్యులు భావిస్తున్నారు.
టాపిక్