Foods for testosterone: మగవాళ్లలో టెస్టోస్టిరాన్ పెంచే.. ఉత్తమ ఆహారాలు..
04 September 2023, 16:11 IST
Foods for testosterone: అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్ ఒక ముఖ్యమైన హార్మోన్. సంతానోత్పత్తి విషయంలోనే కాకుండా ఇతర విషయాల్లో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ నియంత్రణలో ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారాలేంటో తెలుసుకోండి.
టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెంచే ఆహారాలు
శుక్ర కణాల ఉత్పత్తిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ కీలక పాత్ర పోషిస్తుంది. కండరాల పెరుగుదల, కొవ్వు పంపిణీ, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా ఈ హార్మోన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. వయస్సుతో పాటూ ఈ హార్మోన్ స్థాయుల్లో మార్పు ఉండవచ్చు. కానీ చిన్న వయస్సులోనే కొంతమంది ఈ హార్మోన్ లేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అధిక బరువు, థైరాయిడ్ సమస్యలతో పాటూ మరికొన్ని కారణాల వల్ల ఈ హార్మోన్ లేమి రావచ్చు. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి కొన్ని ఆహారాల వల్ల సహజంగానే పెరుగుతుంది.
టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెంచే ఆహారాలు:
1. దానిమ్మ:
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. దీనివల్ల టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది.
2. ఫ్యాటీ ఫిష్:
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లున్న సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్ గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెంచుతుంది. పూర్తి ఆరోగ్యానికి సాయం చేస్తుంది.
3. గుడ్లు:
దీంట్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఎసెన్షియల్ అమైనో యాసిడ్లు, విటమిన్ డి ఉంటాయి. ఇవి టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి అవసరం. రోజూ ఉదయాన్నే గుడ్లతో చేసిన ఎలాంటి అల్పాహారమైనా తీసుకోవడం చాలా మేలు చేస్తుంది.
4. అరటిపండ్లు:
వీటిలో పొటాషియం ఉంటుంది. ఇది వర్కవుట్ల తర్వాత వచ్చే కండరాల నొప్పుల్ని తగ్గిస్తుంది. కండరాల ఎదుగుదలకు సాయపడుతుంది. దీనివల్ల పరోక్షంగా టెస్టోస్టిరాన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది.
5. ఆలివ్ నూనె:
ఎక్ట్స్రా వర్జిన్ ఆలివ్ నూనె వాడటం చాలా మంచిది. దీంట్లో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడానికి సాయపడుతాయి.
6. ఉల్లిపాయలు:
వీటిలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆహారంలో ఉల్లిపాయల్ని చేర్చుకోవడం మేలు చేస్తుంది.
7. ఆకు కూరలు:
పాలకూర లాంటి ఆకుకూరల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని నియంత్రణలో ఉంచుతుంది. కండరాల పనితీరుకు సాయపడుతుంది.
వీటన్నింటినీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజంగానే టెస్టోస్టిరాన్ ఉత్పత్తి పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర వల్ల మరింత మంచి ఫలితాలు పొందవచ్చు.