Meal maker Manchurian: పది నిమిషాల్లో మీల్ మేకర్ మంచూరియా ఇలా చేసేయండి, వేడివేడిగా తింటే రెసిపీ అదిరిపోతుంది
18 December 2024, 15:30 IST
- Meal maker Manchurian: చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుందా? పది నిమిషాల్లో మీల్ మేకర్‌తో టేస్టీ మంచూరియా ట్రై చేయండి. రెసిపీ ఇదిగో.
మీల్ మేకర్ మంచూరియన్ రెసిపీ
సాయంత్రం అయితే చాలు పకోడీలు, బజ్జీలు, మిక్చర్లు కోసం షాపుల ముందు బారులు తీరుతారు. అలా బయట ఫుడ్స్ తినే కన్నా ఇంట్లోనే ఏదో ఒకటి తయారు చేసుకొని తింటే అన్ని విధాలా ఆరోగ్యకరం. ఇక్కడ మేము కేవలం 10 నిమిషాల్లో రెడీ అయిపోయే టేస్టీ మీల్ మేకర్ మంచూరియా రెసిపీ ఇచ్చాము. ఒక్కసారి దీన్ని తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది. చేయడం కూడా చాలా సులువు. మీల్ మేకర్లు మార్కెట్లో దొరుకుతాయి. వాటిని కొని తెచ్చుకుంటే చాలు...కువ సమయంలో మంచూరియా రెడీ అయిపోతుంది.
మీల్ మేకర్ మంచూరియా రెసిపీకి కావలసిన పదార్థాలు
మీల్ మేకర్లు - రెండు కప్పులు
నీళ్లు - సరిపడినన్ని
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
షెజ్వాన్ సాస్ - ఒక స్పూను
సోయాసాస్ - ఒక స్పూను
మైదా పిండి - రెండు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ - మూడు స్పూన్లు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - మూడు
పచ్చిమిర్చి - మూడు
ఉల్లికాడలు తరుగు - మూడు స్పూన్లు
టమాటో సాస్ - రెండు స్పూన్లు
వెనిగర్ - ఒక స్పూను
మిరియాల పొడి - అర స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
మీల్ మేకర్ మంచూరియా రెసిపీ
1. మార్కెట్లో పెద్ద సైజులో మీల్ మేకర్లు దొరుకుతాయి. వీటిని సోయా చంక్స్ అని కూడా పిలుస్తారు. సోయా పిండితో తయారు చేసే ఉత్పత్తులు ఇవి.
2. వీటిని తీసుకొని ఒక గిన్నెలో వేయాలి. అందులో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి.
3. ఐదు నిమిషాలకి ఇవి మెత్తగా ఉడికిపోతాయి. వేడి నీటిలో ఉన్న ఈ మీల్ మేకర్ ను తీసి చల్లని నీటిలో వేయాలి.
4. తరువాత చేత్తోనే పిండి నీళ్లు లేకుండా చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
5. ఇప్పుడు అదే గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, మైదా పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ షెజ్వాన్ సాస్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి.
6. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
7. ఆ నూనెలో ఈ మీల్ మేకర్లను వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద మరొక కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
9. ఆ నూనెలో వెల్లుల్లి తరుగును వేసి వేయించుకోవాలి.
10. అందులోనే పచ్చిమిర్చి తరుగు, ఉల్లికాడల తరుగు కూడా వేసి వేయించాలి.
11. పావు స్పూను ఉప్పు, అర స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూను షెజ్వాన్ సాస్, రెండు స్పూన్ల టమోటా కెచప్, ఒక స్పూన్ సోయా సాస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
12. అలాగే వెనిగర్ ను కూడా వేసి బాగా కలపాలి.
13. ఇప్పుడు ఒక స్పూను కార్న్ ఫ్లోర్‌ను ఒక చిన్న గిన్నెలో వేసి అరకప్పు నీళ్లు వేసి బాగా గిలక్కొట్టి దాన్ని కూడా కళాయిలో వేసి బాగా కలపాలి.
14. అది దగ్గరగా అవుతున్నప్పుడు ముందుగా వేయించుకున్న మీల్ మేకర్‌ను అందులో వేసి బాగా కలుపుకోవాలి.
15. పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అంతే టేస్టీ మీల్ మేకర్ మంచూరియా రెడీ అయినట్టే. వండుతున్నప్పుడే దీని సువాసన తినాలన్న కోరికను పెంచేస్తుంది.
మంచూరియా బయట తినేందుకే ఎక్కువ మంది ఇష్టపడతారు. అలా బయట తినే కన్నా ఇంట్లోనే తినడం చేసుకొని తినడం వల్ల ఆరోగ్యకరం. పైగా పరిశుభ్రంగా కూడా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మీల్ మేకర్ మంచూరియా చేసుకొని తినేందుకు ప్రయత్నించండి. ఇది మీకు బాగా నచ్చుతుంది.