Can Diabetics Eat Mango । ఇది మామిడి పండ్ల సీజన్.. మధుమేహం ఉంటే మామిడి తినవచ్చా?
22 March 2023, 14:37 IST
Can Diabetics Eat Mango: ఇది మామిడిపండ్ల సీజన్ మరి ఈ రుచికరమైన పండును మధుమేహం ఉన్నవారు తినవచ్చా? నిపుణులు ఏమంటున్నారు? ఇక్కడ తెల్సుకోండి.
Can Diabetics Eat Mango
మధురమైన వాసన, నోరూరించే ఆకృతి, అద్భుతమైన రుచి కలిగిన పండు ఏదైనా ఉందా అంటే అదే మామిడిపండు. భారతదేశంలో ఈ పండును ఇష్టపడే వారు ఎంతో మంది. అందుకే దీనిని పండ్లలో రారాజుగా చెబుతారు. వేసవి వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్లే. మామిడి పండ్లలో అనేక రకాలు ఉన్నాయి, మన దేశంలోనే 1,500 కంటే ఎక్కువ రకాలు పెరుగుతాయి. ఒక్కొక్కటి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటాయి. వీటిలో అల్ఫోన్సో మామిడి పండ్లు, దాషేరి రకం ఎంతో ప్రసిద్ధి చెందిన రకాలు.
మామిడి పండ్లు రుచిగా ఉండటమే కాదు, అనేకమైన పోషకాలను కలిగి ఉంటాయి. మామిడిలో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K లు పుష్కలంగా ఉంటాయి. అదనంగా యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మామిడిపండ్లు తినడం ద్వారా ఈ పోషకాలన్నీ శరీరానికి ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును పొందడానికి, కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
మామిడిపండ్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తినగలం? అందుకే మనసారా మామిడిని ఆహ్వానించండి, దాని రుచిని ఆస్వాదించండి.
Can People with Diabetes Eat Mango- మధుమేహం ఉంటే మామిడిపండు తినొచ్చా?
మధుమేహం ఉన్నవారిలో మామిడి పండ్లు తినకుండా ఉండాలా అనే బాధ ఉంటుంది. మామిడిలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నందున వాటిని తినాలా ? వద్దా? అనే విషయంలో సందేహాలను కలిగి ఉంటారు. కొందరు తినమని చెబితే, కొందరు వద్దని చెబుతారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మామిడి అనేది మధుమేహం ఉన్నవారు తినాల్సిన పండు కాదు, అయినప్పటికీ పూర్తిగా తినకుండా ఉండాల్సిన పండు కూడా కాదు. మీ రక్తంలో చక్కెర స్థాయిలు సమర్థవంతంగా నిర్వహించగలిగితే, మీకు మధుమేహం సమస్య ఉన్నా మామిడిపండ్లను తినవచ్చునని అంటున్నారు. అయితే అందుకు సరైన సమయం, పండు పరిమాణం కూడా ముఖ్యం.
మామిడిలో 90% కేలరీలు చక్కెర నుండి వస్తాయి, అందుకే ఇది మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెరను పెంచడానికి దోహదం చేస్తుంది. అయినప్పటికీ, ఈ పండులో ఫైబర్, వివిధ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఈ రెండూ బ్లడ్ షుగర్ ప్రభావాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి.
మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను వ్యాయామాలు చేసిన తర్వాత, మార్నింగ్ వాక్ చేసిన తర్వాత, భోజనాల మధ్య తినవచ్చు. అదేవిధంగా, మామిడిపండుతో పాటు ప్రోటీన్ పదార్థాలు తీసుకుంటే మరింత సమతుల్యమైన ఆహారం అవుతుంది. మామిడిపండును ఉడికించిన గుడ్డు, జున్ను ముక్క లేదా కొన్ని గింజలతో కలిపి తినడానికి ప్రయత్నించండి. మరోవైపు, మేము మామిడి షేక్స్ లేదా జ్యూస్‌లను తాగకూడదు, ఎందుకంటే తెలియకుండా ఎక్కువ తాగేయవచ్చు.
ఎవరైనా సరే మామిడిపండును తినాలనుకుంటే నేరుగా పండును తినడం సంతృప్తికరంగా ఉంటుంది. దాని అసలైన రుచిని ఆస్వాదించే వీలు ఉంటుంది.