Mango Methi Pachadi: మామిడికాయ మెంతి పచ్చడి, వేడి వేడి అన్నంలో కలిపి తింటే ఆ రుచే వేరు
10 July 2024, 12:00 IST
- Mango Methi Pachadi: పచ్చి మామిడికాయలు, మెంతులు వేసి చేసే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. దీని రెసిపీ ఎంతో సులువు.
మామిడికాయ మేతి పచ్చడి
Mango Methi Pachadi: పచ్చి మామిడికాయలు వేసవిలోనే దొరుకుతాయి. అవి సీజనల్ ఆహారంగా చెప్పుకుంటారు. అందుకే వాటితోనే వేసవిలోనే రకరకాల రెసిపీలు వండుకుని తినేయాలి. దీని వల్ల అనేక పోషకాలు అందుతాయి. ఈ పచ్చిమామిడికాయతో ఒకసారి మామిడికాయ మెంతి పచ్చడి చేసి చూడండి... ఈ చట్నీ అదిరిపోతుంది. మెంతుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ చట్నీ పెరుగన్నంతో నంజుకుని తింటే రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకుని తిన్నా టేస్టీగానే ఉంటుంది.
మామిడికాయ మెంతి పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమామిడి కాయలు - రెండు
కారం - రెండు
మెంతి పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - అర స్పూను
నువ్వుల నూనె - అరకప్పు
మామిడికాయ మెంతి పచ్చడి
1. ఈ రెసిపీ కోసం పుల్ల మామిడిని ఎంచుకోవాలి. మామిడిని సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా కోసుకున్నా ఫర్వాలేదు.
2. ఆవాల పొడి కోసం స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలను వేసి అవి చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ కట్టేయాలి. వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
3. అదే కళాయిలో మెంతి గింజలు వేసి వేయించుకుని, పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక స్టవ్ ఆఫ్ చేయండి. ఆ వేడెక్కిన నూనెలో ఇంగువ వేసి అలా ఉంచండి.
5. ఇప్పుడు మరో మందపాటి గిన్నెను తీసుకుని అందులో మామిడి తరుగు లేదు ముక్కలు వేయాలి. కారం, ఉప్పు, ఆవాల పొడి, మెంతి పొడి వేసి గరిటెతో కలుపుకోవాలి. ఇంగువను నూనెతో సహా వేసి కలుపుకోవాలి.
6. ఈ మొత్తం మిశ్రమాన్ని గది ఉష్ణోగ్రత వద్ద పన్నెండు గంటల పాటూ వదిలేయాలి. ఆ తరువాత ఇది తినేందుకు సిద్ధమైనట్టే.
7. తేమలేని ఒక గాజు సీసాలో వేసి ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవాలి. దీని రుచి చాలా బాగుంటుంది.
ఈ పచ్చడి చేసే ముందు ఆవాలను ఎండలో ఎండబెట్టి కూడా పొడి చేసుకోవచ్చు. ఈ పచ్చడిలో కారం ముఖ్యమైనది. కాబట్టి మంచి ఎర్ర కారాన్ని వినియోగించాలి. దీన్ని నువ్వుల నూనెతో వండితే రుచిగా ఉంటుంది. లేదా వేరుశెనగ నూనెతో వండినా మంచిదే.