Mango nuvvula pachadi: పచ్చిమామిడి తురుము నువ్వుల పచ్చడి రెసిపీ, స్పైసీగా చేసుకుంటే ఎంతో మంచిది
Mango nuvvula pachadi: పచ్చి మామిడికాయతో చేసే మరో రెసిపీ ఇది. పచ్చి మామిడికాయ, నువ్వుల గింజలు చేసే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీని స్పైసీగా చేసుకుంటే అన్నంలో అదిరిపోతుంది. రెసిపీ కూడా చాలా సులువు.
Mango nuvvula pachadi: పచ్చి మామిడికాయలతో చేసే రెసిపీలను వేసవిలోనే ప్రయత్నించాలి. ఇక్కడ మరో రెసిపీ ఇచ్చాము. పచ్చిమామిడి నువ్వులు కలిపి చేసే పచ్చడి ఇది. దీన్ని స్పైసీగా చేసుకుంటే వేడివేడి అన్నంలో అదిరిపోతుంది. ఈ పచ్చడి ఇడ్లీ, దోశెల్లో తినవచ్చు. ఒక్కసారి చేసుకొని తినండి. మీకు నచ్చడం కాదు. ముఖ్యంగా పచ్చిమామిడి వేసవిలోనే తాజాగా లభిస్తాయి. కాబట్టి దీన్ని సీజనల్ గా వండుకొని తినాల్సిందే. కేవలం 20 నిమిషాల్లో ఈ వంట రెడీ అయిపోతుంది. నోరు చేదుగా అనిపించినప్పుడు లేదా చప్పగా అనిపించినప్పుడు పుల్లపుల్లగా, కారం కారంగా ఈ పచ్చడి తింటే మీ అందరికీ నచ్చుతుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

మామిడి తురుము నువ్వుల పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమామిడి - ఒకటి
నువ్వుల గింజలు - అరకప్పు
పసుపు - చిటికెడు
ఆవాలు - అర స్పూను
మెంతులు - పావు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - నాలుగు స్పూన్లు
జీలకర్ర - ఒక స్పూను
ఎండుమిర్చి - ఆరు
ఇంగువ - చిటికెడు
కరివేపాకులు - గుప్పెడు
మామిడికాయ నువ్వుల పచ్చడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
2. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
3. అందులోనే తురిమిన మామిడికాయను వేసి వేయించాలి.
4. అలాగే పసుపును కూడా వేయాలి.
5. మూత పెట్టకుండా ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించుకోవాలి.
6. ఆ తర్వాత నువ్వులను ఒకసారి వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
7. ఆ నువ్వుల పొడిని కళాయిలోని మామిడికాయ తురుము మిశ్రమంలో వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
8. తర్వాత పొడి చేసుకున్న మెంతులు, పొడి చేసుకున్న ఆవాలను కూడా వేసి వేయించుకోవాలి.
9. ఉప్పును వేసి కలుపుకోవాలి.
10. ఇదంతా చిన్న మంట మీద చేయాలి.
11. పచ్చడి ఘుమఘుమలాడుతూ వాసన రావడం మొదలవుతుంది.
12. అప్పుడు స్టవ్ ను ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ మామిడి తురుము నువ్వుల పచ్చడి రెడీ అయినట్టే.
13. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని ఒక స్పూను నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూడండి. మీకు బాగా నచ్చుతుంది. రెండు రోజులపాటు తాజాగా ఉంటుంది. అదే ఫ్రిజ్లో పెట్టుకుంటే వారం పాటు టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి కోసం పుల్లని మామిడి పండ్లను ఎంచుకోవద్దు. కాస్త తీపి, పులుపు కలిపిన మామిడికాయలను ఎంచుకుంటే మంచిది.
పచ్చి మామిడికాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాబట్టి వీటిని కచ్చితంగా తినాలి. ఇవి సీజనల్ గా దొరికేవి కాబట్టి తినాల్సిన అవసరం కూడా ఉంది. ఇక నువ్వులు మనకి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా మహిళలు నువ్వులతో చేసిన వంటకాలను ప్రతిరోజూ తినడం ముఖ్యం. ఇది నెలసరి సమస్యలను దూరం పెడుతుంది. ఓసారి స్పైసీగా మామిడి తురుము నువ్వుల పచ్చడిని చేసుకొని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం.