Mango Kheer: తీయటి మామిడిపండు పాయసం... చేయడం చాలా సులువు, ఎంతో టేస్టీ
21 March 2024, 15:26 IST
- Mango Kheer: తీయని మామిడి పండుతో చేసే పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మామిడి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పిల్లలకు మ్యాంగో ఖీర్ చేసి పెట్టండి, కచ్చితంగా నచ్చుతుంది.
మ్యాంగో ఖీర్ రెసిపీ
Mango Kheer: మామిడి పండుతో చేసే ఎన్నో టేస్టీ వంటలు చేసుకోవచ్చు. తీయని మామిడి పండుతో పాయసం చేసుకుని చూడండి, ఎంత రుచిగా ఉంటుందో. సాయంత్రం పూట పిల్లలకు స్నాక్ గా ఇచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. పిల్లలే కాదు, పెద్దలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. ఇది టేస్టీ డిజర్ట్ అనే చెప్పుకోవాలి. దీన్ని కేవలం పదినిమిషాల్లో చేసుకోవచ్చు. కానీ ఫ్రిజ్‌లో కనీసం రెండు గంటల సేపు ఉంచాలి.
మ్యాంగో ఖీర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
పాలు - ఒక లీటరు
మామిడి పండు గుజ్జు - ఒక కప్పు
యాలకుల పొడి - అర స్పూను
పంచదార - ఎనిమిది స్పూన్లు
వండిన అన్నం - అయిదు స్పూన్లు
యాలకుల పొడి - చిటికెడు
మ్యాంగో ఖీర్ రెసిపీ
1. బాగా పండిన మామిడి పండ్లను ఈ పాయసం కోసం ఎంచుకోవాలి.
2. మామిడి పండ్ల నుంచి గుజ్జును తీసి ఒక కప్పులో వేయాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి పాలు వేయాలి. చిన్న మంట మీద వాటిని ఉడికించుకోవాలి.
4. ఆ పాలల్లో ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేయాలి.
5. అందులో పంచదార కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. చిన్న మంట మీద ఉంచి దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
7. స్టవ్ కట్టేసి ఆ మిశ్రమాన్ని చల్లార్చాలి.
8. మిశ్రమం చల్లారాక అందులో మామిడి పండు గుజ్జును వేసి కలుపుకోవాలి.
9. ఆ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అయ్యాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
మామిడి పండులో రోగనిరోధక శక్తినిపెంచే లక్షణాలు ఉంటాయి. దీనిలో బీటాకెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడిపండ్లలో మన శరీరానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉంటుంది. మామిడి పండ్లు తినడం వల్ల గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు రావు. మామిడి పండు తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లను అడ్డుకోవచ్చు.
మగవారు మామిడి పండ్లు తినడం వల్ల వారిలో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మామిడి పండు తినడం వల్ల చర్మానికి మెరుపు అందుతుంది. పిల్లలకు ఈ పండును పెట్టడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అందులోనూ ఇది సీజనల్ పండు... కాబట్టి వేసవిలో కచ్చితంగా వీటిని తినాలి.
టాపిక్