meal maker dosa: హై ప్రొటీన్ మీల్ మేకర్ దోశ
09 May 2023, 6:30 IST
meal maker dosa: మీల్ మేకర్ తో దోసెలు ఎలా రుచిగా, సులువుగా తయారు చేసుకోవచ్చో తెలుసుకోండి.
మీల్ మేకర్ దోశ
ఒకేరకం దోసెలు కాకుండా కాస్త విభిన్నంగా ప్రయత్నిద్దాం అనుకుంటే మీల్ మేకర్ తో ప్రయత్నించొచ్చు. ఉదయాన్నే తీసుకోగలిగే ప్రొటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం సిద్దమవుతుంది. మీల్ మేకర్, టమాటా వాడి దీన్ని చేస్తాం కాబట్టి రుచిలో మార్పు ఉంటుంది. కొత్త రుచి చూసినట్టుంది.
కావాల్సిన పదార్థాలు:
మీల్ మేకర్ - 1 కప్పు
టమాటా - 1 పెద్దది
ఎండుమిర్చి - రెండు
అల్లం - అంగుళం ముక్క
బియ్యం పిండి - 3/4 కప్పు
గోదుమ పిండి - 1 కప్పు
ఉప్పు - తగినంత
పెరుగు - పావు కప్పు
జీలకర్ర - సగం టేబుల్ స్పూన్
ఉప్పు- తగినంత
నీళ్లు - 1 కప్పు
ఉల్లి పాయ- 1 చిన్నది
క్యారట్ తురుము- సగం కప్పు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
step 1: ముందుగా ఒక పాత్రలో మీల్ మేకర్, ఎండుమిర్చి, టమాటా, అల్లం ముక్క, ఉప్పు వేసి మీల్ మేకర్ మునిగేఅంత నీళ్లు పోసుకోవాలి. పాత్రను పొయ్యిమీద పెట్టుకుని 5 నిమిషాలు మూత మూసుకుని ఉడికించుకోవాలి.
step 2: కాస్త చల్లారాక టమాట తొక్కతీసేసి, మిక్సీలో వేసుకోవాలి. దీంతోపాటే మీల్‌మేకర్, టమాటా, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
step 3: మిశ్రమాన్ని పెద్ద పాత్రలో తీసుకుని అందులో కప్పు గోదుమపిండి, అర కప్పు బియ్యం పిండి, పెరుగు వేసుకోవాలి. నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
step 4: దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, క్యారట్ తురుము కూడా వేసుకుని కలుపుకోవాలి.
step 5: ఇప్పుడు కాస్త లోతుగా, అడుగు మందంగా ఉన్న పెనం తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక స్పూను నూనె వేసుకొని ఒక గరిటె నిండా పిండి తీసుకుని వేసుకోవాలి. ఇది కాస్త మందంగా వేసుకోవాలి.
step 6: కాసేపయ్యాక దోసెను తిప్పుకుని మరోవైపు కాల్చుకోవాలి. అంతే!