Cake in Cooker: రైస్ కుక్కర్ ఉంటే చాలు, ఇలా బనానా కేక్ చేసేయొచ్చు
27 October 2024, 15:30 IST
Cake in Cooker: ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కేక్ ఎలా చేయాలో తెల్సుకోండి. చాలా సింపుల్‌గా బ్యాచిలర్లు కూడా చేయగలిగే బనానా కేక్ రెసిపీ చూసేయండి. తయారీ కూడా సులభమే.
బనానా కేక్
కేక్ ఇంట్లో చేయాలంటే చాలా పెద్ద పని అనిపిస్తుంది. ఓవెన్ ఉండాలి, లేదా ప్రెజర్ కుక్కర్లో ఉప్పు వేసి మీద బేక్ చేసే పద్ధతి కూడా కాస్త కష్టమే. కేక్ ఒక్కోసారి సరిగ్గా కుదరదు. కానీ బ్యాచిలర్లు కూడా సింపుల్‌గా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కేక్ చేసుకోవచ్చు. మీకు వంటల్లో నైపుణ్యం ఉంటే మరింత ఈజీగా అయిపోతుంది. దానికోసం కావాల్సిన పదార్థాలు, కొన్ని చిట్కాలతో సహా తెల్సుకోండి. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కుక్కర్లో బనానా కేక్ ఎలా చేయాలో చూద్దాం.
బనానా కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
2 బాగా పండిన అరటిపండ్లు
4 గుడ్లు
సగం కప్పు పంచదార
100 గ్రాముల అన్ సాల్టెడ్ బటర్ (కరిగించుకోవాలి)
1 టీస్పూన్ వెనీలా ఎసెన్స్
1 కప్పు మైదా
1 టీస్పూన్ బేకింగ్ పౌడర్
పావు టీస్పూన్ ఉప్పు
ఎలక్ట్రిక్ కుక్కర్లో బనానా కేక్ తయారీ విధానం:
1. ముందుగా మిక్సీ లేదా ఫుడ్ ప్రాసెసర్లో వేసి అరటిపండ్లు వేసి మెత్తగా చేసుకోవాలి.
2. మీరు వాడే రైస్ కుక్కర్ పాత్రకు నాన్ స్టిక్ కోటింగ్ ఉంటే పర్లేదు. లేదంటే కొద్దిగా నూనె రాసుకోవాలి. మీద పిండితో కోటింగ్ వేసుకోవాలి.
3. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్డు తెల్లసొన మాత్రమే తీసుకోవాలి. సొనను బాగా గిలకొట్టాలి. ఇలా గిలకొడుతున్నప్పుడు పంచదారను కొద్దికొద్దిగా కలుపుతూ ఉండాలి.
4. ఇప్పుడు పచ్చ సొన, మెత్తగా చేసుకున్న అరటిపండు గుజ్జు, కరిగించుకున్న బటర్, వెనీలా ఎసెన్స్ ..అన్నీ ఒక్కోటీ వేసుకుంటే కలుపుతూ ఉండాలి. 5. దీంట్లో బేకింగ్ పౌడర్, మైదా, ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. అన్నీ బాగా కలిస్తే చాలు. ఎక్కువగా కలిపేయకూడదు.
6. ఈ మిశ్రమాన్ని ముందుగా నూనె రాసి పెట్టుకున్న రైస్ కుక్కర్ గిన్నెలో పోసుకోవాలి.
7. కుక్ బటన్ స్టార్ట్ చేయాలి. అయిపోగానే కుక్కర్ వార్మ్ మోడ్ లోకి వచ్చేశాక మరో పది నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత మళ్లీ కుక్ బటన్ నొక్కాలి. మళ్లీ వార్మ్ మోడ్ లోకి వచ్చేదాకా ఆగాలి. ఇలా 3 సార్లు చేయాలి. అప్పుడే కేక్ ఉడుకుతుంది.
8. ఇప్పుడు కాసేపయ్యాక మూత తీసి ఏదైనా స్పూన్ గుచ్చి చూడాలి. స్పూన్ కి పిండి అంటుకోకపోతే కేక్ ఉడికిందని అర్థం. లేదంటే కేక్ పూర్తిగా ఉడికేదాకా మళ్లీ కుక్కర్ కుక్ మోడ్‌లో పెట్టుకుని వార్మ్ మోడ్ లోకి వచ్చేదాకా ఆగాలి.
9. ఇప్పుడు కేక్ ఒక ప్లేట్ లోకి బోర్లించుకోవాలి. మీద మీకిష్టమైన చాకోలేట్ కోటింగ్ ఏదైనా వేసుకోవచ్చు. ఏవైనా పండ్లతో అలంకరించొచ్చు. అంతే.. కేక్ రెడీ అయినట్లే.