Makara Sankranti 2023 । ఎల్లూ బెల్లా తినండి, మంచిని మాట్లాడండి.. సంక్రాంతి స్పెషల్ రెసిపీ!
12 January 2023, 17:17 IST
- Makara Sankranti 2023: పండగ సందర్భంగా చేసుకునే సాంప్రదాయ వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి, అవి చేసుకోవడం అనవాయితీ కూడా సంక్రాంతి స్పెషల్ ఎల్లూ బెల్లా రెసిపీ ఇక్కడ చూడండి.
Makara Sankranti 2023- Ellu Bella
Makara Sankranti 2023: మకర సంక్రాంతి ఎంతో ఆనందంతో జరుపుకునే పండగ. ఈ పండగను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వివిధ రూపాల్లో జరుపుకుంటారు. పండగ సందర్భంగా వివిధ సంప్రదాయ స్వీట్లు, పిండి వంటకాలు తయారు చేస్తారు. మన తెలుగు వారు కూడా పండగ సందర్భంగా సకినాలు, గారెలు, ముర్కులు, బొబ్బట్లు, పూతరేకులు, లడ్డూలు, అరిసెలు వంటి ఎన్నో రకాల రుచికరమైన పిండి వంటలు చేసుకుంటారు. అయితే ఇక్కడ మీకో ప్రత్యేకమైన రెసిపీని పరిచయం చేస్తున్నాం.
మకర సంక్రాంతి సందర్భంగా కర్ణాటకలో ప్రతి ఇంటిలో కచ్చితంగా చేసుకునే వంటకం ఒకటి ఉంది అదే ఎల్లూ బెల్లా. ఈ రెసిపీ లేని సంక్రాంతి పండగను కర్ణాటకలో ఊహించలేము. సంక్రాంతి పండగ సందర్భంగా ఒక సామెత కూడా అక్కడ ప్రసిద్ధి. అదేమిటంటే.. "ఎల్లూ బెల్లా తిందు.. ఒల్లె మాటాడి" అంటే ఎల్లూ బెల్లా తిని, మంచిని మాత్రమే మాట్లాడండి అని అర్థం వస్తుంది. తమ కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులకు ఈ ప్రత్యేక వంటకం తినిపిస్తూ ఎల్లూ బెల్లా సామెత చెప్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు.
ఎల్లూ అంటే నువ్వులు, బెల్లా అంటే బెల్లం. సంక్రాంతి సీజన్ లో చెరుకు పంట చేతికి వస్తుంది, అలాగే నువ్వుల వినియోగం ఎక్కువ ఉంటుంది. ప్రతీచోటా సంక్రాంతి సందర్భంగా ఈ రెండు పదార్థాలను తీసుకోవడం తరాలుగా వస్తున్న ఆచారం. సరే మరి, ఎల్లూ బెల్లా రెసిపీ ఇక్కడ ఉంది, మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి.
Ellu Bella Recipe కోసం కావలసినవి
- 1/4 కప్పు - తెల్ల నువ్వులు
- 1/4 కప్పు - వేరుశెనగ
- 1/4 కప్పు - శనగపప్పు
- 1/4 కప్పు- బెల్లం
- 1/4 కప్పు- ఎండు కొబ్బరి
- 2 టేబుల్ స్పూన్లు - చక్కెర పూసిన సోపు గింజలు
ఎల్లూ బెల్లా తయారీ విధానం
- ముందుగా పాన్ వేడి చేసి మీడియం మంట మీద వేరుశనగలను వేయించండి. ఆపై ఒక గుడ్డ సహాయంతో వాటి పొట్టు తొలగించండి.
- ఆ తర్వా త నువ్వులు వేయించండి, అలాగే శనగపప్పును కూడా దోరగా వేయించాలి.
- వేయించిన వేరుశనగ, నువ్వులు, శనగపప్పును ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఈ గిన్నెలో చిన్న చిన్న బెల్లం ముక్కలు, ఎండు కొబ్బరి, షుగర్ కోటెట్ సోంఫ్ గింజలు వేసి అన్ని బాగా కలపండి.
అంతే, ఎల్లూ బెల్లా మిక్స్ రెడీ. ఈ ఎల్లూ బెల్లా తినండి, మంచిని మాత్రమే మాట్లాడండి, సంక్రాంతి శుభాకాంక్షలు!