Biryani Leaves Tea : బిర్యానీ ఆకుల టీ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇక అస్సలు వదలరు
03 March 2024, 10:30 IST
- How To Make Biryani Leaves Tea : బిర్యానీ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనితో చేసే టీ కూడా మంచి ఉపయోగాలను ఇస్తుంది. బిర్యానీ ఆకుల టీ తాగితే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
బిర్యానీ ఆకుల టీ
పలావ్‌లో మనం సాధారణంగా బే ఆకులను(బిర్యానీ ఆకులను) ఉపయోగిస్తాం. అయితే దీన్ని మరిగించి తయారుచేసిన టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పటికే చాలా రకాల టీలు ఉండగా ఈ బిర్యానీ ఆకుల టీ ఎందుకు? అని ఆలోచిస్తున్నారా? ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. మరే ఇతర టీలో ఈ స్థాయిలో పోషకాలు లేవు. అలాగే ఇందులోని ఫోలిక్ యాసిడ్, కాపర్, సెలీనియం, ఐరన్, జింక్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి.
బిర్యానీ ఆకుల టీ తాగితే ఈ పోషకాలే కాదు.. కొన్ని ఇత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ టీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాత్రలో మూడు గ్లాసుల నీళ్లు పోసి పది బే ఆకులను మరిగించాలి. అది ఉడకడం ప్రారంభించిన తర్వాత మంటను తగ్గించాలి. బాగా మరిగించుకోవాలి.
ఈ నీరు ఒక గ్లాసు వరకు ఉండేలా చేసుకోవాలి. తర్వాత ఈ నీటిని వడకట్టి ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు తాగాలి. ఇది ప్రధానంగా రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. ఈ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం..
బిర్యానీ ఆకుల టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో సహజసిద్ధమైన ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.
బిర్యానీ ఆకుల్లోని పోషకాలు గుండె సామర్థ్యాన్ని పెంచి గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి. ఇందులోని కెఫిక్ యాసిడ్, సాలిసైలేట్, రుటిన్ వంటి ఫైటోన్యూట్రియెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఆర్థరైటిస్, బెణుకు మొదలైన కారణాల వల్ల ఎముకల కీళ్లలో నొప్పిని తగ్గించడంలో బిర్యానీ ఆకుల టీ సహాయపడుతుంది. ఈ ఆకుల నూనెను ప్రభావిత ప్రాంతంలో రాస్తే నొప్పి తగ్గుతుంది. అలాగే ఈ టీని రెగ్యులర్‌గా తాగడం వల్ల నొప్పి త్వరగా తగ్గుతుంది.
బిర్యానీ ఆకుల టీ తాగడం ద్వారా దగ్గు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందవచ్చు. ఫలితంగా జలుబు, ఫ్లూ కూడా తగ్గుతాయి.
మీరు కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంటే ఈ టీ ఉత్తమ ఎంపిక. కానీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత కొనసాగించడం అవసరం. ఈ టీని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి సమతుల్యంగా ఉండి, దీనివల్ల ఎదురయ్యే సమస్యలు దూరమవుతాయి.
మలబద్ధకం సమస్య ఉంటే బిర్యానీ ఆకుల టీ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకు రెండు గ్లాసుల టీ తాగడం దీనికి ప్రభావవంతంగా ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల అధిక రక్తపోటు సాధారణ స్థాయికి వస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది.
బిర్యానీ ఆకులతో ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని కచ్చితంగా ఉపయోగిస్తే మీరు అనేక ఉపయోగాలను పొందుతారు. అయితే కొందరి ఇలాంటి టీతో అలెర్జీలాంటిది ఉండవచ్చు. వారు మాత్రం నిపుణుల సలహా మేరకు తీసుకోవాలి.