Friday Motivation: టైమ్ మేనేజ్మెంట్ నేర్చుకోండి చాలు విజయం మీ వాకిట్లో వాలుతుంది
15 November 2024, 5:30 IST
- Friday Motivation: టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమైనది. అది లేకే ఎంతోమంది ఓటమిపాలవుతున్నారు. సమయం నిర్వహణ నేర్చుకుంటే విజయం ఈరోజు కాకపోయినా రేపైనా మీ వాకిట్లో వాలడం ఖాయం.
మోటివేషనల్ స్టోరీ
టైమ్ మేనేజ్మెంట్ అంటే సమయపాలన, సమయాన్ని నిర్వహణ, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం తెలిస్తే మీరు సగం విజయం పొందినట్టే. కానీ టైమ్ మేనేజ్మెంట్ తెలియకే ఎంతోమంది ఓటమిపాలవుతున్నారు.
టైమ్ మేనేజ్మెంట్ అనేది ఒక నైపుణ్యం. ఆయన నైపుణ్యం ఉన్నవారికి కాస్త ఆలస్యమైనా కూడా విజయం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. పనిని ప్రారంభించడం ఎంత ముఖ్యమో... ఆ పనిని అనుకున్న ప్రకారం సమయానికి పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం. మీరు అనుకున్న పనులన్నీ సమయానికి అయ్యేలా చూసుకోవడమే టైమ్ మేనేజ్మెంట్. ఏ పని ఎప్పుడు చేయాలి అనేది ఒక జాబితా రాసుకోవాలి. ఆ జాబితా ప్రకారమే ముందుకు సాగాలి. అనుకున్న పనుల ప్రకారమే వ్యూహాన్ని రచించాలి. ఆ వ్యూహం ప్రకారం అడుగు ముందుకు వేయాలి. దీన్ని టైమ్ మేనేజ్మెంట్ అని అంటారు.
టైమ్ మేనేజ్మెంట్‌కు ప్రధాన శత్రువు పనులు వాయిదా వేయడం. ఏదైనా చేయవలసి వస్తే ఆ క్షణమే పూర్తి చేసేయండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అని వాయిదా వేయడం వల్ల మీ సమయం వృధా అవుతుంది. అలాగే విజయం కూడా దూరం అవుతూ ఉంటుంది. కొంతమంది కేవలం కొన్ని గంటలే కదా వాయిదా వేసాము అనుకుంటారు, కానీ ఆ పని కొన్ని రోజులు వారాలు పాటు వాయిదా పడుతూనే ఉంటుంది.
సమయ నిర్వహణ నేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సమయాన్ని సమర్ధవంతంగా నిర్వహించినప్పుడు మీరు ఎంత పెద్ద లక్ష్యాలనైనా సులువుగా సాధించగలుగుతారు. సమయపాలన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. గడువు మీరే వరకు వేచి ఉండి... అప్పుడు పనులు చేయడం వల్ల తీవ్రంగా ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఆందోళన కూడా వస్తుంది. కాబట్టి సమయపాలన నేర్చుకున్న వారికి ఇలాంటి ఒత్తిడి, ఆందోళనలు రాకుండా ఉంటాయి. వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం మధ్య సమతుల్యత తీసుకురావడానికి టైమ్ మేనేజ్మెంట్ ఎంతో ఉపయోగపడుతుంది.
సమయ నిర్వహణ అలవరచుకుంటే మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రావు. ఎంతో మంది తమ పనులు కారణంగా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయినట్టు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. సమయపాలన వచ్చిన వారికి అలాంటి సమస్యలు రావు. ఒక వ్యక్తి ఎదుగుదలకు అవసరమైన ప్రాథమిక అంశాలలో సమయపాలన ముఖ్యమైనది. ఏ రోజు చేయాల్సిన పనులు ఆరోజే పూర్తి చేస్తే మీకు ఎంత పెద్ద లక్ష్యమైనా రోజురోజుకీ చిన్నదిగా మారిపోతుంది. అలాగే కుటుంబం, స్నేహితులతో గడిపే సమయాన్ని కూడా ఏర్పరుచుకోవాలి. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే సాగాలి. పని జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని విడదీసుకోవాలి. సమయానికి తగ్గట్టు ఆ పనులు చేసుకుంటూ వెళ్తే మీకు ఎలాంటి సమస్యలు రావు.
అంతేకాదు సమయపాలన వల్ల వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవితంలో కూడా సంతృప్తి ఉంటుంది. అలాగే స్వేచ్ఛా, ఆనందం కూడా దక్కుతాయి. ఒక ప్రొఫెషనల్ కి తప్పనిసరిగా ఉండాల్సిన టాప్ సాఫ్ట్ స్కిల్స్‌లో టైమ్ మేనేజ్మెంట్ అనేది ప్రధానమైనది. ఈరోజు నుంచి సమయపాలన పాటించండి. మీకే రోజులో ఎంతో ఉత్పాదకత కనిపిస్తుంది. అలాగే ఖాళీ సమయము మిగులుతుంది. దీనివల్ల మీరు వ్యక్తిగతంగాను, వృత్తిగతంగానూ ముందుకు సాగుతారు.