తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Crying Without Reason: కారణం లేకుండా ఏడ్చేస్తున్నారా? ఇలా చేస్తే ఏడుపు ఆగుతుంది

Crying without reason: కారణం లేకుండా ఏడ్చేస్తున్నారా? ఇలా చేస్తే ఏడుపు ఆగుతుంది

26 August 2024, 12:30 IST

google News
  • Crying without reason: ఇంతసేపు ఏడిస్తే ఎక్కువ ఏడ్చినట్లు, అంత ఏడిస్తే మామూలే అని చెప్పడానికి ప్రత్యేక నియమాలేమీ లేవు. కానీ కారణం లేకుండా ఏడవడం మాత్రం సాధారణం కాదు. కారణం లేకుండా ఏడవడానికీ కొన్ని కారణాలుంటాయి. అవేంటో చూడండి.

కారణం లేకుండా ఏడవడం
కారణం లేకుండా ఏడవడం (freepik)

కారణం లేకుండా ఏడవడం

కొంతమంది కష్టం వచ్చినప్పుడు ఏడుస్తారు, మరికొంత మంది సినిమా చూస్తూ, మరికొందరు పుస్తకం చదువుతూ.. ఇలా ఏడుపుకు రకరకాల కారణాలుంటాయి. కానీ ఏ కారణమూ లేకుండా కొందరు అలా ఊరికే ఏడ్చేస్తారు. చెప్పాలంటే ఏడుస్తూ అలా దిగాలుగానే ఉంటారు.

ఒక సర్వే ప్రకారం మహిళలు నెలకు 5.3 సార్లు ఏడిస్తే పురుషులు 1.3 సార్లు ఏడుస్తారట. ఒక్కసారి ఏడిచే సమయం సరాసరి 8 నిమిషాలుంటుందట. కానీ మీరు తరచూ ఊరికే ఏడుస్తున్నట్లు అనిపిస్తున్నా, ఏడుపు కారణం లేకుండా వచ్చేస్తున్నా, మీ నియంత్రణలో లేకున్నా వైద్యుల్ని సంప్రదించాలి.

కారణాలు:

డిప్రెషన్

ఏదైనా కష్టం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లి ఉండొచ్చు. కొన్ని రోజుల పాటూ దాన్నుంచి బయటకు రాలేకపోతే మీ బాధ మరింత ఎక్కువవుతుంది. మానసికంగా బలహీన పడతారు. మీరేమీ సాధించలేరనే ఆలోచనల్లోకి వెళ్తారు. బలహీనంగా అనిపిస్తుంది. ఏ విషయం మీదా శ్రద్ధ పెట్టలేరు. చిన్న విషయాలనే అనవసరంగా ఏడ్చేస్తారు. అసలు మీరు ఆపేద్దామన్నా కన్నీళ్లు ఆగవు. ఇవన్నీ డిప్రెషన్ సంకేతాలు.

ఆందోళన, ఒంటరితనం

చిన్న విషయాలకే కొందరిలో కంగారు వచ్చేస్తుంది. కొంతమందికి పరీక్షలంటే కంగారు, కొందరికి ఇంటర్వ్యూలంటే, కొందరికి ఇంకోటి. ఇవి కూడా మీరు ఏడవడానికి కారణాలు అవ్వొచ్చు. నిద్ర పట్టకపోవడం, ప్రతి దానికి చిరాగ్గా అనిపించడం, ఎక్కువగా కంగారు పడిపోవడం, ఏ పనీ కుదురుగా చేయలేకపోవడం దీని లక్షణాలు. అలాగే మీకెవరూ లేరనే భావన వల్ల ఒంటరిగా ఫీలవుతారు. ఈ ఒంటరితనం కూడా మిమ్మల్ని బలహీనులుగా చేస్తుంది. మీరిలా ఏడవడానికి కారణం అవుతుంది.

సూడో బల్బర్ ఎఫెక్ట్

ఇదొక నరాల సంబంధిత వ్యాధి అనుకోవచ్చు. మెదడులో ఏదైనా దెబ్బతింటే నవ్వు, ఏడుపు అదుపులో ఉండవు. కోపం కూడా నియంత్రణలో ఉండదు. అయితే ఈ సమస్య అల్జీమర్స్, పాక్రిన్సన్ డిసీజ్, డిమెన్షియా.. లాంటి సమస్యలు ఇదివరకు ఉన్నవాళ్లలోనే ఎక్కువ కనిపిస్తుంది.

జెండర్

సాధారణంగానే అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఎక్కువగా ఏడుస్తారు. వాళ్లలో ఉండే టెస్టోస్టిరాన్ ఏడుపును నియంత్రిస్తుంది. వీటితో పాటే ఆందోళన, డిప్రెషన్ ఎక్కువైతే దీర్ఘాకలికంగా దాని ప్రభావం పడి కారణం లేకుండా ఏడ్చే సమస్య మొదలవ్వొచ్చు.

ఏడుపు ఎలా ఆపుకోవాలి?

1. శ్వాస సంబంధించిన వ్యాయామాలు చేయండి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ముక్కుతో శ్వాస తీసుకుని మెల్లగా నోటితో వదలండి. దీంతో ఒత్తిడి తగ్గినట్లనిపిస్తుంది. ఏడవటం ఆపేస్తారు.

2. ముఖ కండరాలను కదిలించండి.

3. మీకిష్టమైన పాట పాడటమో, పద్యమో, పుస్తకమో, ఏదైనా సంఘటన గురించే ఆలోచిస్తూ ఉండటమో చేయండి. దీంతో మీ దృష్టి వాటి మీదకు వెళ్తుంది.

4. మీకిష్టమైన పనిలో నిమగ్నం అవ్వండి.

5. మీ ముక్కును శ్వాస తీసుకోకుండా కాసేసు అలా చేత్తో గట్టిగా పట్టి ఉంచండి.

వైద్య సలహా తీసుకోవాలా?

మీరు తాత్కాలికంగా లోనయిన భావోద్వేగాల వల్ల ఏడుపు అదుపు తప్పితే పైన చెప్పిన చిట్కాలతో నయం అయిపోతుంది. మీ అదుపులోకి వస్తుంది. కానీ ఏం చేసినా మిమ్మల్ని మీరు నియంత్రించుకోలేకపోతే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి. కొన్ని హార్మోన్ల అసమతుల్యతల వల్ల, మెదడు సంబంధిత ఇబ్బందుల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం