తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Navaratri Colours: నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందో తెలుసుకోండి

Navaratri Colours: నవరాత్రుల్లో ఏ రోజు ఏ రంగు చీర కట్టుకొని పూజ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందో తెలుసుకోండి

Haritha Chappa HT Telugu

02 October 2024, 9:00 IST

google News
    • Navaratri Colours: దుర్గాదేవిని ప్రతిష్టించే సమయం వచ్చేసింది. నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేసేవారు ఎంతోమంది. పూజ చేసే సమయంలో ఏ రంగు చీరను కట్టుకుంటే ఎక్కువ ఫలితం వస్తుందో తెలుసుకోండి.
దేవీ నవరాత్రులు
దేవీ నవరాత్రులు (Pixabay)

దేవీ నవరాత్రులు

భారతదేశంలో దసరా రాకతో దుర్గాదేవి మండపాలు చాలా చోట్ల కొలువుదీరేందుకు సిద్ధమయ్యాయి. దసరాకి తొమ్మిది రోజులు ముందు నవరాత్రులు ప్రారంభమైపోతాయి. మన దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. దసరా ముందు వచ్చే నవరాత్రులను ఎంతోమంది ఘనంగా నిర్వహించుకుంటారు. ఆ నవరాత్రులను దుర్గాదేవి ఆరాధనకు అంకితం చేస్తారు. ఆ దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో కొలుస్తారు. ఈ పండుగ తొమ్మిది రాత్రుల పాటు వైభవంగా కొనసాగుతుంది. ఆ తొమ్మిది రోజుల్లోనూ ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులను వేసుకొని అమ్మవారిని పూజిస్తే ఆ దుర్గాదేవి కటాక్షం మీపై కలుగుతుందని చెబుతారు. ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసుకోండి.

మొదటిరోజు

నవరాత్రుల్లో మొదటి రోజు పర్వతాల దేవత అయిన శైలపుత్రిగా అమ్మవారిని కొలుస్తారు. ఆరోజు పసుపు రంగు దుస్తులు వేసుకొని అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచిది. ఇది పండుగ ప్రారంభాన్ని, కొత్త శక్తిని సూచిస్తుంది.

రెండో రోజు

నవరాత్రి రెండో రోజున బ్రహ్మచారినిగా అమ్మవారిని కొలుస్తాం. బ్రహ్మచారిణి జ్ఞానాన్ని చూపుతుంది. ఆరోజు ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకొని అమ్మవారిని పూజిస్తే ఎంతో మంచిది. ఆకుపచ్చ ప్రకృతిని, సంతానోత్పత్తిని, శ్రేయస్సును సూచిస్తుంది. కాబట్టి జీవితమంతా సుఖంగా సాగుతుంది. ఆకుపచ్చ రంగు మీకు ఎంతో ప్రకాశాన్ని కూడా అందిస్తుంది. ఆకుపచ్చని షేడ్స్ ఉన్న దుస్తులను అయినా ధరించవచ్చు.

మూడవరోజు

నవరాత్రుల్లో మూడవ రోజు ధైర్య దేవతగా వెలిసిన చంద్రఘంట రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఆరోజు బూడిద రంగు దుస్తులు వేసుకుంటే మంచిది. ఇది బలమైన రంగు శక్తిని సూచిస్తుంది. స్థిరత్వాన్ని సూచిస్తుంది. చంద్రఘంటా అమ్మవారు శక్తివంతమైన వారిగా చెప్పుకుంటారు. అందుకే బూడిద రంగులో ఉన్న దుస్తులను ధరించేందుకు ప్రయత్నించండి.

నాలుగవ రోజు

నవరాత్రుల్లో నాలుగవ రోజున కూష్మాండ రూపంలో దుర్గాదేవిని పూజిస్తారు. ఆమె శక్తికి, సృజనాత్మక చిహ్నం. కూష్మాండ అమ్మవారిని పూజించేందుకు నారింజరంగ దుస్తులు వేసుకుంటే మంచిది. నారింజరంగు గాజులు వేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. మీ ఇంటిని బంతి పువ్వులతో అలంకరించండి. ఆరంజ్ కలర్ థీమ్‌లో అమ్మవారిని పూజించండి.

ఐదవరోజు

నవరాత్రుల్లో అయిదవ రోజును కార్తికేయుని తల్లి అయిన స్కంధమాతకు అంకితం చేశారు. ఆమెను తెలుపు రంగు వస్త్రాల్లో పూజించాలి. తెలుపు రంగు స్వచ్ఛతకు, శాంతికి ప్రతీక. సామరస్యాన్ని సూచిస్తుంది. పండుగ సమయంలో శాంతి కోసం పిలుపునివ్వడం అనే అర్థాన్ని కూడా ఇది ఇస్తుంది.

ఆరవ రోజు

నవరాత్రుల్లో ఆరవ రోజును కాత్యాయనిగా పూజిస్తారు. కాత్యాయని మాత శక్తికి, శౌర్యానికి ప్రతిరూపం లాంటివారు. ఆ రోజు ఎరుపు రంగు దుస్తులు వేసుకొని పూజలు చేస్తే మంచిది. ఇది శక్తిని, అభివృద్ధిని, ప్రేమను అందిస్తుంది.

ఏడవ రోజు

నవరాత్రుల్లో ఏడవ రోజును మహా గౌరీ రూపంలో అమ్మవారిని పూజిస్తాము. ఆమె ప్రశాంతతను, స్వచ్ఛతను అందించే దేవత. ఆరోజు రాయల్ బ్లూ కలర్ దుస్తులు వేసుకుంటే మంచిది. రాయల్ బ్లూ అనేది నమ్మకాన్ని, ప్రశాంతతను సూచించే రంగు.

ఎనిమిదో రోజు

నవరాత్రుల్లో ఎనిమిదో రోజును సిద్ధిధాత్రి కి అంకితం చేశారు. ఆరోజు గులాబీ రంగు వస్త్రాలను వేసుకుంటే ఎంతో ఉత్తమం. పింక్ అనేది ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. కాబట్టి గులాబీ రంగు దుస్తులు ధరించి గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజించండి.

తొమ్మిదవ రోజు

నవరాత్రుల్లో చివరి రోజును దుర్గాదేవి రూపంలోనే కొలుస్తాము. ఆమె ఆధ్యాత్మికతకు, ఆశయానికి చిహ్నం. ఆరోజు లావెండర్ కలర్ దుస్తులు వేసుకొని దుర్గాదేవిని పూజిస్తే ఎంతో మంచిది. దీన్ని ఊదా రంగు అని కూడా పిలుచుకోవచ్చు. ఊదా రంగు దుస్తులు అధికంగానే మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంటిని ఊదా రంగు అలంకరణలతో నింపేయండి. అమ్మవారి కరుణాకటాక్షాలను పొందండి.

తదుపరి వ్యాసం