తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fertile Soil: ఇంటితోట మట్టిలో ఇవి కలిపితే.. ఏ మొక్క అయినా వేగంగా పెరుగుతుంది

Fertile Soil: ఇంటితోట మట్టిలో ఇవి కలిపితే.. ఏ మొక్క అయినా వేగంగా పెరుగుతుంది

10 October 2024, 10:30 IST

google News
    • Fertile Soil: ఇంట్లో మొక్కలు పెంచే నేల సారవంతంగా ఉండాలి. అయితేనే ఏవైనా ఏపుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. అందుకోసం చేయాల్సిన పనులు ఇవే.
ఇంటి తోట మట్టిని సారవంతం చేసే మార్గాలు
ఇంటి తోట మట్టిని సారవంతం చేసే మార్గాలు (freepik)

ఇంటి తోట మట్టిని సారవంతం చేసే మార్గాలు

ఈ మధ్య ఇళ్లలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు చాలా మంది పండించుకుంటున్నారు. అయితే పెంచుకునే మొక్కలు చీడ పీడల్లేకుండా చక్కగా ఏపుగా పెరగాలంటే ముందు నేల బలంగా ఉండాలి. కావాల్సిన పోషకాలు అన్నీ నేల నుంచి మొక్కలకు దొరుకుతూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అవి ఎక్కువ కాపును మనకు అందిస్తాయి. మరి అలా నేల బలంగా ఉండేందుకు మనం ఇంటి దగ్గర పాటించాల్సిన కొన్ని చిట్కాలు చదివేయండి.

ఎరువులు:

నేలను సారవంతంగా ఉంచుకోవడానికి పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్‌ని రెండు మూడు నెలలకు ఒకసారి అయినా ఇచ్చుకోవాలి. అలా చేయడం వల్ల నేలలో సూక్ష్మ పోషకాలు పెరుగుతాయి. అలాగే ఇంట్లో వంట చేసుకునేప్పుడు వచ్చే చెత్తను అంతా నేలలో అక్కడక్కడా గొయ్యి తీసి పాతేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉడటం వల్ల అది క్రమంగా కంపోస్ట్‌గా మారి నేల సారవంతం కావడం మొదలవుతుంది. ఇలా ఉన్న నేలలో వాన పాములు కూడా ఎక్కువగా పెరుగుతాయి. వాన పాములు బాగా పెరిగితే ఆ నేల చాలా గుల్లగా మారుతుంది. గాలి అందులోకి చొరబడి మరిన్ని సూక్ష్మ జీవులు పెరిగిపోతాయి. మొక్కలకు ఉపయుక్తమైన మైక్రో ఆర్గానిజమ్‌లు పెరగడం వల్ల మొక్కలు చాలా ఏపుగా ఎదుగుతాయి.

ఆవు పేడ:

నేలను సారవంతం చేయడంలో ఆవు పేడ ఎంతో బాగా పనికి వస్తుంది. దానిలో నేలను సారవంతంగా మార్చేందుకు సహాయ పడే అనేక రకాల సూక్ష్మ జీవుల ఫ్లోరా ఉంటుంది. కాబట్టి అవి నేలలోకి వెళ్లి ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. ఆ ప్రాంతాన్ని సారవంతంగా మార్చేందుకు సహకరిస్తాయి.

చెత్త తగలబెట్టడం:

ఇంటి తోటలో ఎండుటాకులు, చెత్త లాంటివి చాలా వస్తుంటాయి. అలాంటి వాటిని కొంత మంది తెలియక తగలబెట్టేస్తూ ఉంటారు. అలా మంట పెట్టడం వల్ల అక్కడున్న భూమికి నష్టం వాటిల్లుతుంది. అక్కడి సూక్ష్మ జీవులు చనిపోతాయి. అలా కాకుండా ఈ చెత్త, ఎండుటాకుల్ని అలా ఓ గుంటలో వేసి ఉంచినా కొన్ని రోజులకు కంపోస్ట్‌గా మారిపోతాయి. అది భూమిని సారవంతంగా మార్చేందుకు చక్కగా సహకరిస్తుంది.

కలుపు కోసం మందులు:

నేల మీద మొక్కలు, సూక్ష్మ జీవులు అనేది ఒకదానిపై ఒకటి ఆధార పడి బతుకుతూ ఉంటాయి. అయితే ఇంటి తోటల్లో కలుపు అనేది ప్రధానమైన సమస్యగా ఉంటోంది. అందుకనే కొంత మంది దాన్ని నిర్మూలించేందుకు కలుపు మందులను కొడుతున్నారు. ఇలా చేయడం వల్ల కలుపుతో పాటు, నేలలో మన మొక్కల ఎదుగుదలకు సహకరించే అనేక సూక్ష్మ జీవులు కూడా చనిపోతాయి. దీంతో నేల సారం పూర్తిగా తగ్గిపోతుంది. క్రమంగా ఇలా చేసే కొద్దీ ఆ నేల ఎందుకూ పనికి రాకుండా తయారవుతుంది. కాబట్టి కలుపు మందులను స్ప్రే చేయడం అనేది ఎప్పుడూ చేయకూడదు. బదులుగా కలుపు రాకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడాలి.

టాపిక్

తదుపరి వ్యాసం