Cow Manure Power Station: ఆవు పేడ నుంచి విద్యుదుత్పత్తి..
ఆవు పేడ నుంచి విద్యుదుత్పత్తి తయారుచేసే విద్యుత్త ప్లాంటు నిర్మాణాన్ని జపాన్‌లో చేపడుతున్నారు. ఆవు పేడ ద్వారా ఉత్పన్నమయ్యే మీథేన్ ఉద్గారాలను నివారించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్‌ను అదుపులో పెట్టేందుకు ఈ చర్య చేపడుతున్నారు.
ఆవు పేడ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్ ప్లాంట్ నిర్మించేందుకు వీలుగా జపనీస్ ప్రాపర్టీ గ్రూప్ టోయో అనుబంధ పునరుత్పాదక ఇంధన విభాగంతో ఓ కెనడా కంపెనీ జట్టు కట్టింది. గ్లోబల్ వార్మింగ్‌పై మీథేన్ శక్తిమంతమైన ప్రభావాన్ని ఎదుర్కోవడానికి తాజాగా ఈ ప్రయత్నం మొదలైంది.
రోజుకు 250 మెట్రిక్ టన్నుల ఆవు పేడను బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం చేసి బయోగ్యాస్ ద్వారా 1.2 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఇది 2,200 ఇళ్లకు ఏడాది పాటు విద్యుత్తు సరఫరా చేసేందుకు సరిపోతుందని అనేర్జియా కంపెనీ వెల్లడించింది. దక్షిణ జపాన్‌లోని తీర ప్రాంత పట్టణం కసావోకాలో టోయో ఎనర్జీ సొల్యూషన్ కంపెనీ కోసం అనేర్జియా కంపెనీ విద్యుత్తు ప్లాంట్‌ను డిజైన్ చేసి ఇన్‌స్టాల్ చేయబోతోంది. ఈ కాసవోకా నగరం సీఫుడ్‌కు, గుర్రపు డెక్క పీతలకు ప్రసిద్ధి.
వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి చేసే 1,700లకు పైగా ప్లాంట్లను అనేర్జియా నిర్మించినప్పటికీ, కాసావోకాలోని ఈ ప్లాంటు ప్రధానంగా పశువుల పేడ ద్వారా ఉత్పన్నమయ్యే మీథేన్ వల్ల పర్యావరణానికి ముప్పును తప్పించడంపై దృష్టిపెడుతుంది.
హ్యూమన్ యాక్టివిటీ ద్వారా ఉత్పన్నమయ్యే మీథేన్‌లో వ్యవసాయం, పశు సంపదదే ఎక్కువ వాటా ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్‌తో పోల్చితే 84 రెట్లు ఎక్కువ వేడెక్కించే గ్రీన్ హౌజ్ వాయువుగా మీథేన్‌ను అభివర్ణిస్తారు. పశువులు విడుదల చేసే వాయువుల్లో ఉండే మీథేన్‌ను క్యాప్చర్ చేసే మాస్క్‌ల నుంచి మొదలుకుని, మీథేన్‌ను తగ్గించే సముద్రపాచి డైట్ వరకు.. పశువుల నుంచి మీథేన్ ఉద్గారాలను పరిమితం చేసే సాంకేతికతను పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు.
తొలిసారిగా పశువుల మంద నుంచి వెలువడిన మీథేన్ ఉద్గారాలను అంతరిక్షం నుంచి హై రిజల్యూషన్ శాటిలైట్ల ద్వారా కనుగొన్నట్టు జీహెచ్‌జీశాట్ సంస్థ వెల్లడించింది.
వ్యవసాయం, ఆహార వ్యర్థాల నుంచి పునరుత్పాదక ఇంధనాన్ని తయారు చేసే ప్లాంటును ఇప్పటికే టోయో కోసం యాబూలో అనేర్జియా కంపెనీ నిర్మించింది. టోయో కోసం అనేర్జియా ఇప్పుడు రెండో ప్రాజెక్టును కాసావోకాలో నిర్మిస్తోంది.