DIY Moisturizer: మాయిశ్చరైజర్ ఇంట్లోనే తయారు చేసేద్దామా?
06 November 2023, 12:00 IST
DIY Moisturizer: మాయిశ్చరైజర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. శీతకాలంలో పొడిబారిన చర్మం కోసం రసాయనాలున్న మాయిశ్చరైజర్ వాడకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
ఇంట్లోనే మాయిశ్చరైజర్ తయారీ
శీతాకాలంలో మన శరీరం పొడిబారిపోకుండా ఉండేందుకు మనం ఎక్కువగా వేసలీన్ని రాసుకుంటూ ఉంటాం. ఇది మంచి మాయిశ్చరైజర్‌లా పని చేస్తుంది. దీంతో మన చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే ఇందుకోసం మనం చాలా డబ్బులు పెట్టి బజార్లో దొరికే రకరకాల మాయిశ్చరైజర్ క్రీముల్ని కొనుక్కోవల్సిన అవసరం లేదు. చక్కగా దీన్ని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. అందుకు కావాల్సిన సామాగ్రి కూడా చాలా తక్కువే. అదెలాగో ఏంటో తెలుసుకుందాం రండి.
రెండు పదార్థాలతోనే మాయిశ్చరైజర్:
చాలా తేలికగా మాయిశ్చరైజర్ తయారు చేసుకోవడానికి.. అరకప్పు ఆలివ్ ఆయిల్, 28 గ్రాముల బీ వ్యాక్స్ (మైనం) ఉంటే సరిపోతుంది. అందుకు ముందుగా స్టౌ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ముందుగా మైనం వేయండి. అది పూర్తిగా కరిగి ద్రవ రూపంలోకి వచ్చే వరకు వేచి ఉండండి. తర్వాత అందులో ఆలివ్ ఆయిల్‌ని కలిపి మిశ్రమాన్ని బాగా కలియ తిప్పండి. కావాలనుకుంటే ఇందులో ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్‌ని రెండు, మూడు చుక్కలు వేసుకోవచ్చు. లేకపోతే ఇలాగే ప్రాసెస్‌ని పూర్తి చేయవచ్చు. ఇలా ఉన్న దాన్ని తీసుకెళ్లి ఒక మాయిశ్చరైజర్ కంటైనర్‌లో వేసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత అది కాసేపటికి గడ్డకట్టి మాయిశ్చరైజర్ మాదిరిగా తయారవుతుంది.
ఎక్కువ మాయిశ్చరైజింగ్ కోసం మరో మాయిశ్చరైజర్:
కొందరికి మరీ ఎక్కువ పొడి చర్మం ఉంటుంది. చర్మంపై గీతలు పడిపోయి పొట్టు రాలిపోతూ ఉంటుంది. ఇలాంటి వారు కాస్త ఎక్కువ ప్రభావవంతంగా పనిచేసే మాయిశ్చరైజర్‌ని రాసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పావు కప్పు కొబ్బరి నూనె, పావు కప్పులో సగం ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల మైనం, టీట్రీ ఆయిల్‌లు కావాలి. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టౌ వెలిగించి గిన్నె పెట్టుకోండి. అది వేడయ్యాక అందులో ముందుగా బీ వ్యాక్స్ వేసి కరిగించుకోండి. అందుకు ఇంచు మించుగా ఐదు నుంచి పది నిమిషాల సమయం పడుతుంది. తర్వాత అందులో ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, టీట్రీ ఆయిల్‌లను వేసి కలుపుకోవాలి. ఇక్కడ టీ ట్రీ ఆయిల్‌కి బదులుగా మీకు ఏ వాసన నచ్చితే ఆ ఎనెన్షియల్ నూనెను వాడుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి మరుగుపట్టాక తీసి ఒక మంచి కంటైనర్‌లో వేసుకోవాలి. చల్లారాక అది చక్కగా మాయిశ్చరైజర్ క్రీములా తయారవుతుంది. ఇలా ఇంట్లో తయారు చేసుకునే వాటిలో ఎలాంటి రసాయనాలూ ఉండవు. కాబట్టి చర్మానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అందువల్ల చర్మం చక్కగా నిగారింపుగా ఉంటుంది.
టాపిక్