తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fertilizers From Kitchen: వీటిని చెత్తబుట్టలో కాదు.. మొక్కలకు వేస్తే తొందరగా పెరుగుతాయి..

Fertilizers from kitchen: వీటిని చెత్తబుట్టలో కాదు.. మొక్కలకు వేస్తే తొందరగా పెరుగుతాయి..

28 June 2024, 19:00 IST

google News
  • Fertilizers from kitchen: వర్షాకాలం వచ్చిందంటే చాలా మొక్కలు పెంచేస్తాం. అయితే అవి ఆరోగ్యంగా ఎదిగి ఫలాలు ఇవ్వాలంటే మంచి ఎరువులు వేయాల్సిందే. ఈ ఆర్గానిక్ ఎరువులతో రెట్టింపు లాభాలు.

కిచెన్ గార్డెన్
కిచెన్ గార్డెన్ (shutterstock)

కిచెన్ గార్డెన్

వర్షాకాలంలో మొక్కలకు కావాల్సిన పోషణ ఇస్తే మరింత వేగంగా పెరుగుతాయి. బాల్కనీల్లో, టెర్రాస్ మీద పెంచుకునే మొక్కలకు ఎరువులు సరిగ్గా వేస్తే పూలూ, పండ్ల తొందరగా వస్తాయి. ముఖ్యంగా మీరు ఇంట్లో కిచెన్ గార్డెన్ పెంచుకుంటే ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలను ఎరువులుగా వేయొచ్చు. కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి లాంటి మొక్కలు పెంచితే వాటికి సేంద్రీయ ఎరువును వేయొండి. అవి బాగా తొందరగా పెరిగిపోతాయి. అలాగే ఈ ఎరువుల వల్ల ఆరోగ్యం మీద దుష్ప్రభావం ఉండదు.

టీ ఆకులు:

టీ వడగట్టాక మిగిలిపోయే టీపొడిని బయటపడేయకండి. ఒక పాత్రలోకి దాన్ని రోజూ తీసి పెట్టండి. మొక్కలకు ఇది మంచి ఎరువుగా పనికొస్తుంది. నేల సారాన్ని టీపొడి పెంచుతుంది.

ఉల్లిపాయ తొక్క:

ఒక సీసాలో ఉల్లిపాయ తొక్కలను నింపి దాంట్లో నీరు కలపాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత వాడాలి. సల్ఫర్ అధికంగా ఉండే ఈ ఎరువు వల్ల మొక్కలు నేల నుండి అన్ని పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయ తొక్కలు నానబెట్టిన ఎరువును దాదాపు అన్ని మొక్కలకు వేయవచ్చు.

అరటి తొక్కలు:

అరటి తొక్కను ఒక పాత్రలో ఉంచి పది రోజుల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత మట్టిలో కలిపేయాలి. అరటి తొక్కల్లో ఫాస్పరస్, ఇతర సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి మొక్క వేగంగా పెరగడానికి సహాయపడతాయి. నిల్వ చేయకుండా అలాగే తొక్కను మొదళ్ల దగ్గర కాస్త మట్టి తవ్వి పాతి పెట్టినా మంచి పోషణ అందుతుంది.

గుడ్డు పెంకులు:

మొక్కలు తొందరగా పండ్లు, పూలు ఇవ్వాలంటే వాటి మొదళ్లలో గుడ్డు పెంకులను వేయొచ్చు. వీటిలో కొద్ది మొత్తంలో పొటాషియం ఉంటుంది. గుడ్డు పెంకులను మెత్తగా వీలైనంత సన్నటి పొడిలాగా చేసి మట్టిలో వేయాలి. దీంతో మట్టి సారం పెరిగి మొక్కలు వేగంగా పెరుగుతాయి. లేదంటే గుడ్డు పెంకులను సన్నటి ముక్కల్లాగా చేసి నీళ్లలో నాననివ్వాలి. ఈ నీళ్లను మొక్కలకు పోయాలి. టమాటా మొక్కకు ఈ ఎరువు బాగా పనిచేస్తుంది.

బంగాళదుంప తొక్క:

బంగాళదుంప తొక్కల్ని మొక్కలకు నేరుగా వేయకూడదు. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. కాబట్టి వాటిని కొన్ని రోజులు కంపోస్ట్ చేసి మొక్కల్లో వేయాలి. అలాగే ఉడికించిన బంగాళదుంప నీటిని కూడా మొక్కలకు పోయొచ్చు.

వీటితో పాటే కూరగాయల తొక్కల్ని, కుళ్లిపోయిన పండ్లు, కూరగాయల్ని కూడా కాస్త జాగ్రత్తగా మట్టిలో పూడ్చేయాలి. దాంతో అవి కుళ్లిపోయి మంచి ఎరువుగా మారతాయి. కాబట్టి కిచెన్ నుంచి వచ్చే వృధా ఏదైనా పడేయకుండా ఎలా ఉపయోగించొచ్చో చూడండి.

టాపిక్

తదుపరి వ్యాసం