Gold Types: 916 ఆభరణాలంటే ఏంటి? 24, 22, 18 క్యారెట్ల బంగారంలో తేడా తెలియాల్సిందే
05 October 2024, 10:30 IST
- Gold Types: బంగారం స్వచ్ఛతను బట్టి దాంట్లో 24 క్యారట్లతో పాటే అనేక రకాలుంటాయి. క్యారెట్ అంటే ఏమిటి? ఎలాంటి బంగారాన్ని దేనికోసం వాడతారో తెల్సుకోండి.
బంగారంలో రకాలు
జ్యువెలరీ షాపుకు సంబంధించిన ఏ యాడ్ చూసినా కొన్ని పదాలు రాసి ఉంటాయి. 916 గోల్డ్ ఆభరణాలు అని, లేదా 22క్యారట్, 24 క్యారట్ ఆభరణాలు అని.. ఇలా రకరకాలుగా రాసి ఉంటాయి. 24 క్యారట్ల బంగారం నుంచి 18 క్యారట్ల బంగారం దాకా తేడా ఏంటో తెల్సుకోండి.
క్యారెట్ అంటే ఏమిటి:
18K, 20K, 22K, 24K లలో K అక్షరం క్యారెట్ ను సూచిస్తుంది. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారట్ల బంగారం అంటే 100 శాతం స్వచ్ఛమైందని అర్థం. క్యారెట్ నంబర్ తగ్గినా కొద్దీ బంగారం స్వచ్ఛత తగ్గుతోందని తెలియజేస్తుంది. అంటే బంగారాన్ని వేరే లోహాలతో కలిపారన్నమాట. బంగారం బలంగా మార్చడం కోసం, ఆభరణాల తయారీ కోసం, రంగులో మార్పు తీసుకురావడం కోసం ఇలా చేస్తారు. సాధారణంగా ఎక్కువగా కనిపించే 18K,22K,24K బంగారం మధ్య తేడా తెల్సుకుందాం.
24 క్యారెట్ల బంగారం:
ఇది వందశాతం స్వచ్ఛమైన బంగారం. ఇందులో ఎలాంటి కల్తీ ఉండదు. కాకపోతే ఇది మెత్తగా ఉండటం వల్ల దీంతో ఆభరణాలు చేయడం అసాధ్యం. కాబట్టి దీన్ని ఎక్కువగా నాణాలు, గోల్డ్ బార్స్, కొన్ని రకాల పరికరాల తయారీ కోసం వాడతారు.
22 క్యారెట్ల బంగారం:
దీంట్లో బంగారం 91.67 శాతం ఉంటుంది. దీన్నే ఆభరణాల తయారీకి ఎక్కువగా వాడతారు. అందుకే 916 గోల్డ్ ఆభరణాలని సాధారణంగా చెబుతారు. మిగతా 8 శాతం దాకా సిల్వర్, జింక్, నికెల్ లాంటి లోహాలు కలుపుతారు. ఈ బంగారంతో క్లిష్టమైన నగలు కూడా తయారు చేయడం సులవవుతుంది. దీని ధర 24 క్యారెట్ బంగారం కన్నా తక్కువుంటుంది.
18 క్యారట్ బంగారం:
18 క్యారట్ల బంగారంలో 75 శాతం బంగారం ఉంటే మిగతా 25 శాతం సిల్వర్, కాపర్ లాంటి లోహాలు కలుపుతారు. ఈ బంగారాన్ని ఎక్కువగా స్టోన్స్, వజ్రాలు పొదిగిన ఆభరణాలు తయారు చేయడానికి వాడతారు. మిగతా వాటికంటే దీని ధర తక్కువుంటుంది. అయితే దీని మన్నిక, దీనికుండే రంగు వల్ల రోజూవారీ ఉపయోగానికి సౌకర్యంగా ఉంటుంది. అందుకే ఎంగెజ్ మెంట్ ఉంగరాలు, వాచీల్లాంటివి మన్నిక ఎక్కువుండేలా ఈ బంగారంతో తయారు చేస్తారు.
వీటితో పాటే 10 క్యారెట్లు, 14 క్యారెట్లు బంగారం కూడా అందుబాటులో ఉంటుంది. వాటి స్వచ్ఛత ప్రకారం వాటి ధర ఉంటుంది.
ఇవి గమనించండి:
- బంగారం ధర దాని నాణ్యత బట్టి మారుతుంది. మీరు కొనే బంగారానికి సంబంధించిన పక్కా వివరాలు తెల్సుకుంటే లాభ పడొచ్చు. లేదంటే 22 క్యారెట్ల బంగారు నగలకు కూడా 24 క్యారట్ల ధర చెల్లించాల్సి వస్తుంది. వీటి మధ్య ధర వ్యత్యాసం గమనించుకోవాలి.
- హాల్ మార్క్ లేని ఆభరణాలను కొనుగోలు చేయడం సరికాదు. దాంతో భవిష్యత్తులో నాణ్యత విషయంలో సమస్యలు రావచ్చు. మీరు అనుకున్న నాణ్యత మీరు కొన్ని బంగారంలో ఉండకపోవచ్చు.
టాపిక్