Stage 0 cancer: క్యాన్సర్ జీరో స్టేజ్ లక్షణాలు ఇవే.. చికిత్స, బతికే అవకాశాలు ఇవీ
08 January 2024, 20:36 IST
- Stage 0 cancer: క్యాన్సర్ జీరో స్టేజ్ లక్షణాలు, చికిత్స, ఎంతకాలం బతుకుతారు వంటి వివరాలను వైద్య నిపుణుల ద్వారా ఇక్కడ తెలుసుకోండి.
క్యాన్సర్ 0 స్టేజ్ గురించి వైద్య నిపుణులు అందించిన వివరాలు
క్యాన్సర్ భయంకరమైన వ్యాధి. ఈ పదం ఉచ్చరించడానికే వెన్నులో వణుకు పడుతుంది. అయితే ప్రాథమిక దశలో గుర్తిస్తే బతికే ఛాన్సెస్ గణనీయంగా పెరుగుతాయి. అలాగే జీవన నాణ్యత కూడా పెరుగుతుంది. క్యాన్సర్‌లో విభిన్న దశలు ఉంటాయి. క్యాన్సర్ ఎంత వృద్ధి చెందింది? చుట్టుపక్కల సంక్రమణ ఎలా ఉందన్న స్థితిని ప్రతి దశా చెబుతుంది. స్టేజ్ జీరో దశలో క్యాన్సర్ వాస్తవానికి ప్రి-క్యాన్సరస్ స్టేజ్‌లో ఉంటుంది. క్యాన్సర్‌లా కనిపించే అసాధారణమైన కణాలను గుర్తించినప్పుడు క్యాన్సర్ జీరో స్టేజ్‌గా నిర్ధారించవచ్చు. అప్పటికి ఇంకా క్యాన్సర్‌గా గుర్తించపోయినా అవి ప్రాణాంతకం కావొచ్చు. స్టేజ్ జీరో దశలో క్యాన్సర్‌ను విజయవంతంగా ట్రీట్ చేయొచ్చు. నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ గణాంకాల ప్రకారం స్టేజ్ జీరో క్యాన్సర్ దశ నుంచి ఐదేళ్ల పాటు జీవించవచ్చు.
What is Stage 0 cancer: స్టేజ్ జీరో క్యాన్సర్ అంటే..
‘వైద్య పరిభాషలో కార్సినోమా ఇన్ సిటుగా పిలిచే క్యాన్సర్ ఒక నిర్ధిష్ట ప్రాంతంలో ఉండి, ఇతర భాగాలకు సోకకుండా ఉంటుంది. క్యాన్సర్‌కు ఇది ప్రాథమిక దశ. ముందుగా గుర్తిస్తే తక్కువ చికిత్సతోనే నయమవుతుంది. వీటిలో తప్పనిసరిగా ప్రాణాంతకమైన కణితి ఉండాలని ఏమీ లేదు. క్యాన్సర్‌కు ప్రారంభ దశ. అంటే అసాధారణమైన కణాలు క్యాన్సర్‌గా రూపాంతరం చెందడానికి అవకాశం ఉందని అర్థం. అంటే క్యాన్సర్‌గా రూపాంతరం చెందడానికి కొంత కాలం పట్టొచ్చు..’ అని అపోలో క్యాన్సర్ సెంటర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ తేజిందర్ సింగ్ వివరించారు.
Warning signs of Stage 0 cancer: స్టేజీ జీరో క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు
1. ఒక గడ్డ లేదా కణిత కనిపించడం
2. చర్మంలో మార్పులు.. అంటే మానని పుండ్లు, పుట్టు మచ్చ మారడం
3. యోని నుంచి అసాధారణంగా రక్తస్రావం
4. చనుమొనలు (నిపుల్స్) నుంచి అసాధారణమైన స్రావాలు
5. ఆహారం మింగడంలో ఇబ్బందులు
6. మూత్రాశయం (బ్లాడర్)లో మార్పులు లేదా మల విసర్జన అలవాట్లలో మార్పులు
స్టేజ్ 0 క్యాన్సర్: బతికే అవకాశాలు
‘త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే స్టేజ్ 0 క్యాన్సర్ నయమైపోతుంది. బతికే అవకాశాలు చాలా ఎక్కువ. నేషనల్ క్యాన్సర్ ఇనిసిట్యూట్ గణాంకాల ప్రకారం స్టేజ్ 0 క్యాన్సర్ గుర్తించిన సమయం నుంచి 99 శాతం కేసుల్లో ఐదేళ్లపాటు జీవించి ఉంటారు..’ అని డాక్టర్ సింగ్ చెప్పారు.
Treatment options for Stage 0 cancer: స్టేజ్ 0 క్యాన్సర్‌కు ట్రీట్మెంట్
‘స్టేజ్ 0 క్యాన్సర్‌కు చికిత్సగా వైద్యులు సర్జరీ చేస్తారు. ప్రభావిత ప్రాంతం నుంచి క్యాన్సర్ కారక కణాలు తొలగిస్తారు. కొన్ని కేసుల్లో హార్మోనల్ థెరపీ, లేదా రేడియేషన్ థెరపీ చేస్తారు..’ అని డాక్టర్ సింగ్ వివరించారు.