తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Punganur Cows: ఇది దూడ కాదు ఆవు.. ఈ మరుగుజ్జు ఆవుల గురించి తెలుసా మీకు?

Punganur cows: ఇది దూడ కాదు ఆవు.. ఈ మరుగుజ్జు ఆవుల గురించి తెలుసా మీకు?

21 September 2024, 16:30 IST

google News
  • Punganur cows: పొట్టిగా, చిన్నగా, ముద్దుగా ఉండే పుంగనూరు ఆవులు చిత్తూరు జిల్లాకు చెందినవి. అంతరిస్తున్న ఈ ఆవు జాతి ప్రత్యేకతలేంటో చూడండి.

పుంగనూరు అవులు
పుంగనూరు అవులు (punganurucows/instagram)

పుంగనూరు అవులు

నరేంద్రమోదీ దాదాపు వారం క్రితం తన ఎక్స్ ఖాతాలో పుంగనూరు జాతికి చెందిన దూడ పుట్టిందని దానికి ఆహ్వానం చెబుతూ పోస్ట్ చేశారు. ఈ పుంగనూరు జాతికి చెందిన ఆవులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రాంతీయ గోవు రకాలు. పుంగనూరు ఊరు పేరు మీదుగానే ఈ గోవులకూ ఆ పేరొచ్చింది. చూడ్డానికి మరుగుజ్జు ఆవుల్లా ఉండే ఇవి చాలా ప్రత్యేకమైనవి. కానీ వీటి సంఖ్య ఇప్పుడు వందల్లో మాత్రమే ఉంది. అంతరిస్తున్న వీటిని రక్షించడానికి ఏపీ ప్రభుత్వం మిషన్ పుంగనూరు కూడా మొదలుపెట్టింది. అసలు ఈ ఆవుల ప్రత్యేకత ఏంటో చూద్దాం.

ప్రధానీ మోదీ చేతిలో పుంగనూరు లేగదూడ

పుంగనూరు ఆవులు:

మొదటిసారి చూస్తే తప్పకుండా వీటిని దూడలనే అనుకుంటారు. అంత చిన్నగా ఉంటాయివి. కానీ పూర్తిగా ఎదిగిన పుంగనూరు ఆవు కూడా కేవలం 2 నుంచి 3 అడుగుల ఎత్తుంటుంది అంతే. అంటే దీన్ని నిమరాలన్నా, గడ్డి పెట్టాలన్నీ మోకాళ్ల మీద కూర్చోవాల్సిందే. అపార్ట్‌మెంట్లు, చిన్న ఇళ్లలోనూ వీటిని పెంచుకునేంత ముద్దుగా ఉంటాయివి. చూడగానే దగ్గరికి తీసుకోవాలి అనిపించే ఈ అందమైన ఆవులు చాలా చిన్నగా ఉంటాయి. ఆరోగ్యకరంగా ఎదిగిన ఈ ఆవు ధర గరిష్టంగా 200 కిలోల దాకా ఉంటుందంతే. అదే సాధారణ ఆవుల బరువు వెయ్యి కిలోలకు తక్కువుండదు. ఇక ఇంత చిన్న ఆవులైనా సరే వీటికి మూపురం ఉంటుంది. అదే వీటికి ప్రత్యేక ఆకర్షణ. చిన్న కొమ్ములు, నేలను తాకే తోక ఉంటాయి వీటికి.

ఏమిటీ ప్రత్యేకత:

ఈ ఆవు పాలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. చాలా చిక్కటి పాలు ఇస్తాయి ఈ దూడల్లాంటి ఆవులు. మామూలు పాలలో కొవ్వు శాతం 3 నుంచి 5 దాకా ఉంటే వీటి పాలలో అది 8 శాతం. చాలా క్రీమీగా ఉంటాయి ఈ పాలు. పుంగనూరు గోవు పాలు గరిటెడు తాగినా చాలేమో. అన్ని పోషకాలుంటాయి వీటిలో. ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు, పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.

అంతరిస్తున్నాయి:

ఈ ఆవులు రోజుకు మూడు లీటర్ల దాకా పాలు ఇవ్వగలవు. వ్యాపార దృష్ట్యా ఎక్కువ పాలిచ్చే ఆవులకు ప్రాముఖ్యత పెరగడంతో వీటి మనుగడకు భంగం ఏర్పడింది. వీటికి రక్షణ కరువై క్రమంగా అంతరించిపోతున్నాయ్. కేవలం వందల్లో మాత్రమే మిగిలి ఉన్నాయివి.

 

తదుపరి వ్యాసం