Aloe Vera For Weight Loss: కలబందతో బరువు తగ్గేందుకు 5 అద్భుత మార్గాలు..
09 November 2023, 18:30 IST
Aloe Vera For Weight Loss: కలబంద బరువు తగ్గించడంలో ఉపకరిస్తుంది. దాన్ని కొన్ని రకాలుగా మన ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గడం మరింత సులువు అవుతుంది. ఆ మార్గాలేంటో చూసేయండి.
బరువు తగ్గించే కలబంద
బరువు పెరిగిపోవడం అనేది ఆ తర్వాత ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతూ ఉంటుంది. అందుకనే చాలా మంది మళ్లీ తగ్గేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా బరువు తగ్గడం అనేది ఎవరికైనా సరే పెద్ద సమస్యే. రకరకాలుగా శారీరక శ్రమ చేయడం, డైట్లు పాటించడం, ఆహరం మానేయడం.. లాంటి ఎన్నో రకాల పద్ధతులను ఇందుకోసం పాటిస్తూ ఉంటారు. అయినా పెరిగినంత తేలికగా అయితే బరువు తగ్గరనే చెప్పాలి. అయితే ఈ విషయంలో కలబంద ఎంతో ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకు దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కలబందతో బరువు తగ్గే మార్గాలు :
1. కలబంద మొక్క దాదాపుగా ఎక్కడైనా సరే అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీంతో ఏం చేసుకోవడం అయినా తేలికగానే ఉంటుంది. దీన్ని ఒక దాన్నే తాగాలంటే కాస్త చేదుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే దీన్ని మీ వెజిటెబుల్ జ్యూస్‌తో కలుపుకుని తాగేందుకు ప్రయత్నించండి. అందువల్ల అటు కూరగాయల నుంచి ఇటు అలోవెరా నుంచి వచ్చే మంచి పోషకాలు అన్నీ మీకు కలుగుతాయి. బరువు తగ్గడంలో సహకరిస్తాయి.
2. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూను అలోవెరా జెల్‌ని వేసి కలపండి. ఆ జ్యూస్‌ని పరగడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే తాగొచ్చు. అంటే ఉదయం, మళ్లీ సాయంత్రం ఖాళీ కడుపుతో ఉంటాం కదా. ఆ సమయాల్లో దీన్ని తాగి అరగంట వరకు ఇంకేమీ తినకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం తేలిక అవుతుంది.
3. బరువు తగ్గాలని ఆలోచనలో ఉన్న వారు భోజనం తినడానికి ముందు ఒక పెద్ద స్పూనుడు అలోవెరా గుజ్జును లోపలికి తీసుకోవాలి. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తద్వారా జీవ క్రియ మెరుగుపడుతుంది. అందువల్ల కొవ్వులు కరిగి క్యాలరీలు అధికంగా ఖర్చవుతాయి. దీంతో బరువు తగ్గుతారు.
4. దీనిలో ఉన్న విటమిన్ బీ మనలోని కొవ్వుల్ని ఎక్కువగా శక్తి రూపంలోకి మారుస్తుంది. అందువల్ల కొవ్వులు శరీరంలో పేరుకుపోకుండా కరిగి మనకు శక్తిని ఇస్తాయి.
5. బరువు తగ్గాలనుకునే వారి కోసం నిపుణులు సిఫార్సు చేసే డ్రింక్ ఏమిటంటే.. కలబందతో నిమ్మకాయను కలిపిన జ్యూస్. ఒక కలబంద రెమ్మ నుంచి గుజ్జును సేకరించి దానికి కాసిన్ని నీటిని పోసి మిక్సీలో వేయండి. దాన్ని గ్లాసులోకి తీసుకుని ఓ చెక్క నిమ్మ రసం పిండండి. ఆ రెండింటినీ బాగా కలిపిన తర్వాత సేవించండి. ఇది మీ బరువు తగ్గే ప్రయత్నాన్ని మరింత వేగవంతం చేస్తుంది.