Rava kudumulu: రవ్వ ఆవిరి కుడుములు.. చుక్క నూనె వాడకుండా టేస్టీ అల్పాహారం..
01 July 2024, 6:00 IST
Rava kudumulu: ఆవిరి మీద ఉడికించి తయారు చేసే రవ్వ కుడుములు రుచిలో బాగుంటాయి. వీటిని మీ ఇష్టానికి అనుగుణంగా ఎలా మార్చుకుని చేసుకోవచ్చో తెల్సుకోండి.
రవ్వ కుడుములు
నూనె లేకుండా హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ రవ్వ కుడుములు మంచి ఎంపిక. అసలు నూనె అవసరం లేకుండా నీళ్లు లేదా ఆవిరి మీద ఉడికించి వీటిని తయారు చేసుకోవచ్చు. కూరగాయలు చేర్చి వండటం వల్ల రుచి పెరుగుతుంది. మీ ఇష్టాన్ని బట్టి దీంట్లో పదార్థాలు మార్చుకోవచ్చు. నానబెట్టిన పెసరపప్పుకు బదులుగా నానబెట్టిన శనగపప్పు వేసుకోవచ్చు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
రవ్వతో ఆవిరి కుడుముల తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు రవ్వ
సగం కప్పు పెరుగు
2 చెంచాలు నానబెట్టుకున్న పెసరపప్పు
1 క్యారట్, తురుము
సన్నగా తరిగిన కొత్తిమీర
పచ్చిమిర్చి, సన్నటి ముక్కలు
1 కరివేపాకు రెమ్మ, తరుగు
తగినంత ఉప్పు
సగం చెంచా బేకింగ్ సోడా
తాలింపు కోసం: (ఆప్షనల్)
1 చెంచా నూనె
పావు టీస్పూన్ ఆవాలు
సగం చెంచా కారం
రవ్వతో ఆవిరి కుడుముల తయారీ విధానం:
- ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో రవ్వ వేసుకోవాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి.
- అరగంట సేపు రవ్వను నీళ్లలో నాననివ్వాలి.
- ఇప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకును సన్నగా కట్ చేసుకోవాలి. క్యారట్‌ను తురుముకోవాలి.
- మీకు కూరగాయలు ఇష్టం అయితే ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, క్యాప్సికం కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. ఏ కూరగాయముక్కలైనా వేసుకోవచ్చు.
- అరగంటయ్యాక రవ్వ బాగా నాని నీళ్లు పీల్చుకుని మెత్తగా అవుతుంది. అందులోనే పెరుగు వేసుకుని కలపుకోవాలి.
- దాంతో పాటే బాగా సన్నగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి.
- అన్నీ కలిపి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి.
- తర్వాత అందులో సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసుకుని మరోసారి కలుపుకోవాలి.
- అన్నీ వేసుకుని కలుపుకున్నాక పిండితో ఉండలు చేసేంత గట్టిగా ఉండాలి. లేకపోతే మరికొద్దిగా పొడి రవ్వ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి.
- వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని స్టీమర్ మీద పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. స్టీమర్ లేకపోతే ఎలా చేసుకోవచ్చో చూడండి.
- కాస్త లోతు ఎక్కువున్న పాత్ర స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో సగం దాకా నీళ్లు పోసుకుని మరిగేదాకా ఆగాలి.
- నీళ్లు మరగుతున్నప్పుడు అందులో ముందుగా చేసి పెట్టుకున్న ఉండలు ఒక్కోటి వేసుకోవాలి.
- మీడియం మంట మీద ఈ రవ్వ ఉండల్ని ఉడకనివ్వాలి. కాసేపటికి అవి పైకి తేలుతాయి. పైకి తేలితే అవి ఉడికిపోయాయని అర్థం. వీటిని ఒక్కోటి ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. రవ్వ కుడుములు రెడీ అయినట్లే.
- వీటికి తాలింపు ఇష్టముంటే పెట్టుకోవచ్చు. లేదంటే అలాగే తినేయొచ్చు. తాలింపు కోసం ఒక కడాయిలో చెంచా నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు, కరివేపాకు, కారం వేసుకుని కలిపి వీటిలో ముందుగా ఉడికించుకున్న కుడుముల్ని వేసుకోవాలి. ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే సరి.