Steamed Spinach Rolls: పాలకూర ఆవిరి కుడుములు.. చుక్క నూనె లేని అల్పాహారం..
05 October 2023, 6:30 IST
Steamed Spinach Rolls: చుక్క నూనె లేకుండా పాలకూరతో చేసే స్టీమ్డ్ స్పినాచ్ రోల్స్ తప్పకుండా తినాల్సిందే. వాటిని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.
పాలకూర ఆవిరి కుడుములు
అల్పాహారంలోకి ఆరోగ్యంగా తినాలనుకుంటే ఈ స్టీమ్డ్ స్పినాచ్ రోల్స్ మంచి ఆప్షన్. పక్కాగా చెప్పాలంటే పాలకూర ఆవిరి కుడుములు అనుకోవచ్చు. చుక్క నూనె లేకుండా వీటిని చేసుకోవచ్చు. మీకిష్టమైన కూరగాయలు కింద చెప్పిన వాటితో పాటూ సన్నగా తురిమి ఈ రోల్స్ కోసం వాడుకోవచ్చు. వీటిని మంచి ఫ్లేవర్ ఉన్న షెజ్వాన్, మింట్ లేదా చింతపండు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి.
కావాల్సిన పదార్థాలు:
1 కట్ట పాలకూర
సగం కప్పు క్యారట్ తురుము
పావు కప్పు ఉల్లికాడల తరుగు
1 కప్పు గోధుమపిండి
సగం చెంచా మిరియాల పొడి
సగం చెంచా చిల్లీ ఫ్లేక్స్
తగినంత ఉప్పు
పావు టీస్పూన్ బేకింగ్ సోడా
తయారీ విధానం:
- ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు పాలకూరను ఆకులు, కాడలతో సహా ఆ నీళ్లలో వేసేయాలి.ఒక రెండు నిమిషాలు అలా ఉంచి కాస్త మెత్తబడ్డాక వెంటనే ఆకును చల్లటి నీళ్లలో వేసేయాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో గోధుమపిండి, పాలకూర సన్నని తరుగు, ఉల్లికాడలు, క్యారట్ తురుము, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, బేకింగ్ సోడా వేసుకుని నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి.
- ఇడ్లీలు ఉడికించుకునే పాత్రలో లేదా ఆవిరి మీద వీటిని ఉడికించుకోవాల్సి ఉంటుంది. దాని కోసం కలుపుకున్న పిండిని మీకిష్టమైన ఆకారంలో ఉండలుగా, లేదా వడల్లాగా, కుడుముల్లాగా ఒత్తుకోవాలి.
- ఆవిరి మీద పదినిమిషాలు ఉడికించుకుంటే చాలు. పాలకూర స్టీమ్డ్ రోల్స్ సిద్ధం. వీటిని మీకిష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోవడమే.