Old bangles DIY: పాతగాజులు బయటకు తీయండి.. ఆకర్షణియమైన వస్తువులు తయారు చేసేయండిలా
09 July 2024, 14:00 IST
Old bangles DIY: ప్రతి ఒక్కరి దగ్గర పాత గాజుల కుప్ప ఒకటి ఉంటుంది. అటు వాడలేము, పడేయలేము అన్నట్లుగా ఉంటాయవి. వాటితో తక్కువ శ్రమతో ఏమేం తయారు చేయొచ్చో చూడండి.
పాతగాజులతో అలంకరణ వస్తువులు
పాతగాజులు, పనికిరాని గాజులు లేని ఇల్లు ఉండదు. అసలు సంవత్సరాలుగా వాడని గాజులు ఒక డబ్బాలోనే, సంచీలోనే ఓ సెల్ఫులో మూలన పెట్టేసి ఉంటాయి. మీ ఇంట్లోనూ అలాంటి గాజుల కుప్ప ఉంటే బయటికి తీయండి. వాటితో అందమైన పనికొచ్చే అలంకరణ వస్తువులు తయారు చేయొచ్చు. అవేంటో చూడండి.
ఆర్గనైజర్ చేసేయండి:
చిన్న చిన్న కమ్మలు, క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు వేటికవే పెట్టుకునేలా చిన్న ఆర్గనైజర్ తయారు చేయొచ్చు. కాస్త దళసరిగా ఉంటే అట్ట ముక్క ఒకటి తీసుకోండి. దాన్ని పెద్ద ప్లేటు సైజులో గుండ్రంగా కట్ చేయండి. ఇప్పుడు పోపు డబ్బాలో లోపలి గిన్నెలు ఎలా ఉంటాయో అదే ఆకారంలో ఒక్కో గాజు పెట్టి అతికించండి. వాటిమీద ఎత్తు పెరిగేలా ఏడెనిమిది గాజులు అతికించేయండి. అవి డబ్బాల్లాగా అయిపోతాయి. వాటిలో మీకిష్టమైన వస్తువులు వేసుకోవచ్చు. చంకీలు, స్టోన్స్ లాంటివి వేరువేరుగా పెట్టుకోడానికి కూడా వాడొచ్చు.
క్యాండిల్ హోల్డర్లు:
దీనికి పెద్ద పనేం అక్కర్లేదు. కొన్ని ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న గాజుల్ని ఎంచుకోండి. కేవలం సీసం గాజుల్నే వాడండి. ప్లాస్టిక్ గాజులు క్యాండిల్ వేడికి కరిపోతాయి. ఇప్పుడు మీరెంచుకున్న గాజుల్ని గమ్ సాయంతో ఒకదాని మీద ఒకటి అతికించుకుంటూ వెళ్లండి. లోపల క్యాండిల్ పట్టేంత ఎత్తుండాలి. అంతే.. క్యాండిల్ వెలిగించాక దీన్ని పెట్టేస్తే సరిపోతుంది. క్యాండిల్ ఆరిపోకుండా కాపాడుతుంది. ఆకర్షణీయంగానూ కనిపిస్తుంది.
కొత్త గాజులుగా మార్చేయొచ్చు:
ఎంబ్రాయిడరీ గాజులు, సిల్క్ త్రెడ్ గాజుల ట్రెండ్ ఇంకా నడుస్తోంది. మీ పాత గాజులతో వీటిని చేయొచ్చు. మీకు నచ్చిన సిల్క్ దారం తెచ్చుకుని ఒక డజను గాజులకు గమ్ అతికిస్తూ చుట్టేయండి. లేదంటే రెండు మూడు గాజులు ఒకదానితో ఒకటి పక్కపక్కన అతికిస్తే కాస్త మందంగా ఉండే గాజు తయారు అవుతుంది. దీనికి సిల్క్ దారం చుట్టి అతికించాలి. మీద ముత్యాలు, స్టోన్స్ పెట్టుకుంటే చాలు. ఫ్యాన్సీ గాజులు రెడీ అవుతాయి.
ఫోటో ఫ్రేములు:
పాత గాజులతో చాలా అందమైన ఫోటో ఫ్రేమ్ లను కూడా తయారు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా పాత కార్డ్ బోర్డు ఏదైనా ఉంటే దాన్ని ఫోటో ఫ్రేమ్ ఆకారంలో కత్తిరించడమే. మీకు ఇష్టమైన రంగుతో దానికి పెయింట్ వేయండి. ఇప్పుడు జాగ్రత్తగా పాత గాజులను చిన్న చిన్న ముక్కలుగా విరగొట్టండి. ఇప్పుడు ఈ ముక్కలను మీ ఫ్రేమ్ మీద అతికించి అలంకరించండి. ఈ ఫ్రేమ్ చాలా కలర్ ఫుల్ గా, అందంగా కనిపిస్తుంది. మంచి రంగుల గాజులను నప్పేట్లు ఎంచుకుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
వాల్ హ్యాంగింగ్:
మీ సృజనాత్మకతతో ఇంటికి డిఫరెంట్ లుక్ ఇవ్వాలనుకుంటే గాజులతో చేసిన ఈ వాల్ హ్యాంగింగ్ ప్రయత్నించడం మంచిది. ఇది మీ ఇంటి మొత్తానికి కొత్త లుక్ తీసుకొస్తుంది. ఇందుకోసం 10-15 గాజులు తీసుకుని వాటిపై సిల్క్ దారాన్ని బాగా చుట్టుకోవాలి. ఇప్పుడు వాటిపై మీకు ఇష్టమైన ముత్యాలు, అద్దాలను అతికించండి. ఈ గాజులన్నింటిని ఆకర్షణీయమైన లేసులు, దారం సహాయంతో వేళాడదీయండి. మీ ఇష్టానుసారం రకరకాల ఆకారాల్లో ఈ గాజుల్ని వేళాడదీస్తే వాల్ హ్యాంగింగ్ రెడీ అయినట్లే.
టాపిక్