తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloo Bukhara Jam: పుల్లగా తియ్యగా ఆలూ బుఖారా జామ్.. చాలా సింపుల్‌గా రెడీ

Aloo bukhara jam: పుల్లగా తియ్యగా ఆలూ బుఖారా జామ్.. చాలా సింపుల్‌గా రెడీ

23 July 2024, 15:27 IST

google News
  • Aloo bukhara jam: ఆలూ బుఖారా జామ్ రెసిపీ పది నిమిషాల్లో రెడీ అవుతుంది. దాన్నెలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలేంటో చూసేయండి.

ఆలూ బుఖారా జామ్
ఆలూ బుఖారా జామ్

ఆలూ బుఖారా జామ్

ఆలూ బుఖారా సీజన్ వచ్చేసింది. మార్కెట్లో కుప్పలుకుప్పలుగా తాజాగా దొరుకుతున్నాయివి. వాటిని మామూలుగా పండులాగే తింటాం. కానీ ఒకసారి ఈ తియ్యటి, పుల్లటి రుచితో ఉండే పండ్లతో జామ్ లేదా చట్నీ చేసి చూడండి. భలే రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ గా రెడీ అయిపోయే దీని తయారీ చూసేయండి.

ఆలూ బుఖారా జామ్ కోసం కావాల్సిన పదార్థాలు:

250 గ్రాముల ఆలూ బుఖారా

1 పచ్చి మామిడికాయ

1 చెంచా అల్లం తురుము

సగం కప్పు పంచదార

చెంచాన్నర చిల్లీ ఫ్లేక్స్

చెంచాడు ఉప్పు

తాలింపు కోసం:

1 చెంచా వంటనూనె

1 టీస్పూన్ జీలకర్ర

2 లవంగాలు

2 చెంచాల ఎండుద్రాక్ష

ఆలూ బుఖారా జామ్ తయారీ విధానం:

1. ముందుగా ఆలూ బుఖారాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

2. పచ్చి మామిడి కాయను కూడా చెక్కుతీసి ముక్కలుగా చేసుకోవాలి.

3. ఇప్పుడు కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి.

4. జీలకర్ర చిటపటమన్నాక లవంగాలు, అల్లం తురుము వేసుకోవాలి.

5. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలూ బుఖారా ముక్కలు, పచ్చి మామిడి ముక్కలు, పంచదార, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కలియబెట్టాలి.

6. రెండు నిమిషాలు ఆగి ఉప్పు, రెండు చెంచాల నీళ్లు కూడా పోసుకుని ముక్కలు బాగా మగ్గనివ్వాలి.

7. సన్నం మంట మీద మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి.

8. ముక్కలు బాగా మెత్తబడ్డాక, గరిటెతో నొక్కుతూ ముక్కలను మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు ఎండుద్రాక్ష కూడా వేసుకోవాలి.

9. మరో అయిదు నిమిషాలు సన్నం మంట మీద మగ్గనివ్వాలి. కాసేపటికి జామ్ లాగా దగ్గరికి అవుతుంది. దీన్ని చల్లారాకా గాజు డబ్బాలో వేసుకుని భద్రపర్చుకోవడమే. ఆలూ బుఖారా చట్నీ రెడీ.

పచ్చి మామిడి వల్ల ఈ చట్నీకి పులుపుదనం వస్తుంది. మీకు దొరక్కపోతే సాస్ రెడీ అయ్యాక చివర్లో నిమ్మరసం పిండుకోవచ్చు. లేదంటే కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకుని ఉడికించుకోవచ్చు. ఎండు ద్రాక్ష వల్ల ఈ చట్నీకి పుల్లగా, తియ్యగా రుచి వస్తుంది. అలాగే ఈ చట్నీలో ముక్కలు ఉండాలంటే వాటిని మెదపకండి. మీ ఇష్టం ప్రకారం అలాగే ఉంచేయొచ్చు. మామిడి ముక్కలు ఉడికిపోయి చిక్కదనం ఎలాగో వస్తుంది. అది చట్నీలో గ్రేవీలాగా ఉంటుంది. కొన్ని పండ్ల ముక్కలు నొటికి తగిలితేనే రుచి బాగుంటుంది. దీన్ని చట్నీ అంటున్నా కూడా బ్రెడ్ లాంటి వాటిల్లోకి జామ్ లాగా పెట్టేసుకుని తినేయొచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం