తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dahi Cauliflower: పెరుగు గ్రేవీతో కమ్మని క్యాలీఫ్లవర్, మీల్ మేకర్ కూర.. సింపుల్ గా చేసేయొచ్చు

Dahi Cauliflower: పెరుగు గ్రేవీతో కమ్మని క్యాలీఫ్లవర్, మీల్ మేకర్ కూర.. సింపుల్ గా చేసేయొచ్చు

07 July 2024, 11:30 IST

google News
  • Dahi Cauliflower: క్యాలీఫ్లవర్‌ కర్రీని పెరుగు గ్రేవీలో చేస్తే కమ్మగా, పుల్లగా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దాన్ని పక్కా కొలతలతో ఎలా చేయాలో వివరంగా చూసేయండి.

దహీ క్యాలీఫ్లవర్ కూర
దహీ క్యాలీఫ్లవర్ కూర

దహీ క్యాలీఫ్లవర్ కూర

క్యాలీఫ్లవర్‌తో ఎక్కువగా మంచూరియా, స్నాక్స్ లేదంటే క్యాలీఫ్లవర్ 65 లాంటివి చేస్తాం. ఫూల్ గోబీతో కూర చేసుకుని ఇష్టంగా తినేవాళ్లు తక్కువ. ఒకసారి ఇలా మసాలా, పెరుగు గ్రేవీతో దహీ క్యాలీఫ్లవర్ కూర ప్రయత్నించి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో పెరుగుతో పాటూ గ్రేవీ చిక్కదనం కోసం కొన్ని మసాలాలూ వాడతాం. దాంతో ఈ కూరను చపాతీలు, పుల్కాలు, అన్నంలోకి అయినా తినొచ్చు. బిర్యానీ లాంటివి వండినప్పుడు సైడ్ డిష్‌గా సర్వ్ చేయొచ్చు. దీన్నెలా తయారు చేయాలో చూడండి.

దహీ క్యాలీఫ్లవర్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

4 కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కలు

1 కప్పు మీల్ మేకర్

4 చెంచాల వంటనూనె

పావు టీస్పూన్ జీలకర్ర

పావు టీస్పూన్ ఆవాలు

పావు టీస్పూన్ మెంతులు

చిటికెడు ఇంగువ

2 చెంచాల శనగపిండి

సగం చెంచా పసుపు

చెంచా కారం

చెంచా అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకోవాలి

2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కల తరుగు

సగం కప్పు పెరుగు

1 చెంచా ఉప్పు

గుప్పెడు కొత్తిమీర తరుగు

పావు చెంచా గరం మసాలా

దహీ క్యాలీఫ్లవర్ తయారీ విధానం:

1. ముందుగా ప్యాన్ పెట్టుకుని వేడెక్కాక నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటమన్నాక మెంతులు కూడా వేసుకోవాలి.

2. ఇప్పుడు అదె ప్యాన్‌లో స్టవ్ సన్నం మంట మీద పెట్టుకుని శనగపిండి వేసుకోవాలి. అదే నూనెలో శనగపిండిని రంగు మారి, వాసన వచ్చేదాకా వేయించుకోవాలి.

3. కాస్త వాసన వస్తోందంటే శనగపిండి వేగిపోయిందని అర్థం. శనగపిండి మాడిపోకుండా చూసుకోవాలి. 

4. ఇప్పుడు వెంటనే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి.

5. అవి వేగిపోయాక పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగునూ అన్నీ మసాలాలు కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలి. లేదంటే పగిలిపోయినట్లు తయారవుతుంది. పెరుగును కనీసం రెండు మూడు నిమిషాలు కలుపుతూనే ఉండాలి.

6. ఇప్పుడు రెండు కప్పుల నీళ్లు పోసుకుని, కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి. పెద్ద మంట మీద పెట్టుకోవాలి.

7. అది ఉడుకు రాగానే దాంట్లో సన్నగా తరుగుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి.

8. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని వేడెక్కాక మీల్ మేకర్ వేసుకుని ఉడకనివ్వాలి. వాటి నీళ్లు పిండేసి క్యాలీఫ్లవర్ ముక్కలతో పాటూ వేసేయాలి. 

8. కనీసం పదినిమిషాలు ఆ గ్రేవీలో క్యాలీఫ్లవర్, మీల్ మేకర్ బాగా ఉడకాలి. మీ ఇష్టాన్ని బట్టి మీల్ మేకర్ ఎక్కువగా తక్కువ వేసుకోవచ్చు. 

9. కూరలో నీళ్లు బాగా ఇంకిపోయాక మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించి, కొత్తిమీర తరుగు చల్లుకోవాలి.

10. గ్రేవీ చిక్కగా అనిపించినా, పలుచగా అనిపించినా మీ ఇష్టాన్ని బట్టి కూర ఉడికించడం లేదా నీళ్లు మరిన్ని పోసుకోవడం చేయొచ్చు.

11. అంతే ఒకసారి ఉప్పు రుచి చూసి దింపేసుకుంటే దహీ క్యాలీఫ్లవర్ రెడీ అయినట్లే.

 

తదుపరి వ్యాసం